రక్షణ ప్రశ్నార్థకంగా మారిన వేళ…. మామూలు మనుషులేంటి… ప్రజా ప్రతినిధులకే రక్షణ క్వశ్చన్ మార్క్ అయిన వేళ… సాక్షాత్తు డిల్లీ రాజధాని లో ఏకంగా ప్రభుత్వ పార్టీ మహిళా ఎమ్మెల్యే పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమ్ఆద్మీపార్టీ మహిళానేత, ఢిల్లీ చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై ఈ దాడి జరిగింది.
ఆమె గత కొద్ది రోజులుగా ఢిల్లీనగరంలో మాదక ద్రవ్యాల్ని నిరోధించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతానికి చేరుకోగానే గుర్తుతెలియని వ్యక్తులు ఆమె ర్యాలీ పై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అల్కా తలకు బలమైన గాయం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సదరు ఎమ్మెల్యే ను హుటాహుటిన ఆసుపత్రికి పంపించారు.

దాడి చేసింది ఎవరు, దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.