ఈమె ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్‌, 23 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తూనే ఉంది.

అది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి ప్రాంతం. భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ అక్కడి ఆర్‌టీఏ అధికారులకు ఎన్నో సార్లు అప్లికేషన్ పెట్టుకుంది. అయితే ఆ రోజుల్లో ఇలా ఓ మహిళ భారీ వాహన డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు పెట్టుకోవడమేమిటని చాలా మంది అధికారులు పెదవి విరిచారు. అయినప్పటికీ వారు ఆ మహిళకు టెస్ట్ కోసం అనుమతించలేదు. కాగా ఎట్టకేలకు ఓసారి ఆమెకు డ్రైవింగ్ టెస్ట్‌కు రావాలని పిలుపువచ్చింది. ఎంతోకాలంగా అందుకోసం వేచి ఉన్న ఆ మహిళ తనకు వచ్చిన ఆ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోలేదు. ధైర్యంగా ఆర్‌టీఏ కార్యాలయానికి వెళ్లింది. పరీక్షకు సిద్ధమైంది. అయితే ఆమె డ్రైవింగ్ ఎలా చేస్తుందో చూద్దామని, హేళన చేస్తున్నట్టుగా అక్కడి అధికారులు వేచి ఉన్నారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ మహిళ డ్రైవింగ్ టెస్టులో విజయవంతంగా 8 అంకెను పూర్తి చేసింది. పరీక్ష పాసైంది. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. ఆమే వసంత కుమారి. ఇప్పుడామె ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్‌గా పేరు గాంచింది.
తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో వసంత కుమారి జన్మించింది. ఆమె యుక్త వయస్సులో ఉండగానే తల్లి చనిపోయింది. కాగా తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వసంత కుమారికి 19వ ఏట ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అతనికి అప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉండేవారు. అయితే వివాహం అనంతరం వసంత కుమారికి మరో ఇద్దరు సంతానం కలిగారు. ఆమె భర్త ఓ నిర్మాణ సంస్థలో కార్మికుడిగా పనిచేసే వాడు. అదే సమయంలో వసంత కుమారి స్థానికంగా ఉన్న మహాలిర్ మండ్రమ్ అనే ఓ గ్రూప్‌కి సెక్రటరీగా విధులు నిర్వహించేది.
అయితే తమకు వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉండడంతో వేరే ఏదైనా పని చేసి డబ్బు సంపాదించాలని వసంత కుమారి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆర్‌టీసీ బస్ డ్రైవర్‌గా చేరి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఆమె అనుకున్నంత సులువుగా అది రాలేదు. సాధారణంగా పురుషులకే కష్టంగా ఉండే డ్రైవర్ ఉద్యోగం మహిళలు చేయాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. అయితే అందుకు వసంత కుమారి భయపడలేదు. డ్రైవింగ్ వృత్తినే ఇష్టపడింది. అందుకు అనుగుణంగా హెవీ వెహికల్స్‌ను డ్రైవింగ్ చేయడం నేర్చుకుంది. ఈ క్రమంలో ఆర్‌టీఏ కార్యాలయం చుట్టూ లైసెన్స్ కోసం తిరిగి ఎట్టకేలకు దాన్ని సంపాదించింది.
vasanthakumari
కాగా 1993 మార్చిలో తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వారు ఆమెకు బస్ డ్రైవర్‌గా ఉద్యోగం ఇచ్చారు. దీంతో ఆమె ఆసియాలోనే మొదటి మహిళా బస్ డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది. అయితే కొంత కాలం పాటు ఫీల్డ్ వర్క్ చేసి అనంతరం డెస్క్‌జాబ్‌లకు షిఫ్ట్ అయ్యే మహిళల్లా కాకుండా వసంత కుమారి ఎల్లప్పుడూ డ్రైవర్‌గానే ఉండాలని నిశ్చయించుకుంది. అందు కోసం ఆమె తన వృత్తిని ఎంతగానో ప్రేమించింది. మొదట్లో ఆమెకు డ్యూటీ చేయడం ఇబ్బందిగా ఉండేది. పిల్లల్ని, ఇంటిని చూసుకోవడం, విధులకు హాజరు కావడం కష్టంగా మారింది. అయితే ఆమె తన పట్టు వదలలేదు. ఇరుగు పొరుగు వారి వద్ద పిల్లల్ని విడిచి పెట్టి ఉదయం 6 గంటలకు మొదటి డ్యూటీ విధులకు వెళ్లేది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల తరువాత ఇంటికి చేరుకునేది.
ప్రస్తుతం వసంత కుమారి వయస్సు 57 ఏళ్లు. ఆమె డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుంచి నేటి వరకు దాదాపు 23 ఏళ్లుగా డ్రైవింగ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె షిఫ్ట్ రాత్రి పూట 10 గంటలకు ముగుస్తుంది. నాగర్‌కోయిల్ – తిరువనంతపురం మధ్య ఆమె రోజూ డ్రైవింగ్ చేస్తోంది. అయితే ఆమె తన జీవన ప్రయాణంలో రెయిన్ డ్రాప్స్ వుమెన్ అచీవర్ అవార్డును కూడా సాధించింది. మరో ఏడాదిలో ఆమె రిటైర్ కానుండగా ఇదే విషయంపై ఆమెను ప్రశ్నిస్తే, రిటైర్ అయ్యాక సొంతగా డ్రైవింగ్ స్కూల్ పెడతానని బదులిచ్చింది. అది వీలుకాకపోతే ఏదైనా కాలేజీలో బస్ డ్రైవర్‌గా జాయిన్ అవుతానని స్పష్టం చేసింది. కానీ డ్రైవింగ్ చేయడం మాత్రం వదలనని చెప్పింది. వసంత కుమారి పట్టుదల చూస్తే వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం స్పష్టమవుతుంది.

Comments

comments

Share this post

scroll to top