వారిరువురు ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. వారిలో ఓ వ్యక్తికి కళ్లు కనపడవు. మరో వ్యక్తికి చేతులు లేవు. అయినా వారిద్దరూ కలిసి చేసిన పనికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వారు చేసిన కృషి, పడ్డ శ్రమ అలాంటిది మరి. ఇంతకీ వారు చేసిన మహత్కార్యమేమిటో తెలుసా? మొక్కలు నాటడం. అవును, ఒకట్లు, పదుల్లో కాదు వేల సంఖ్యలో మొక్కలు నాటి వృక్షాలను పెంచారు. ఇద్దరూ కలిసి ఒక చిన్నపాటి అడవినే సృష్టించారు. వారే జియా హాక్సియా, జియా వెంకీలు.
జియా హాక్సియా, జియా వెంకీలది సెంట్రల్ చైనాలోని ‘యి’ అనే పేరు గల నది పక్కన ఉన్న ఓ చిన్న గ్రామం. వారిద్దరు చిన్నప్పటి నుంచి అదే గ్రామంలో పెరిగారు. కాగా హాక్సియా పుట్టు గుడ్డి వాడు. వెంకీకి రెండు చేతులు లేవు. అయినా తమ వైకల్యాన్ని చూసి వారు బాధ పడలేదు. అయితే వారికున్న అంగ వైకల్యం కారణంగా ఎవరూ ఎక్కడా పనివ్వలేదు. అయినప్పటికీ వారు అధైర్య పడలేదు. ఏదో ఒక చిన్న పని చేస్తూనే కాలం వెళ్లదీయసాగారు. ఈ క్రమంలోనే తమ గ్రామంలోని నది పక్కన ఉన్న చెట్లన్నీ ఎండి పోయి అక్కడి నేలంతా బంజరు భూమిగా మారింది. దీన్ని చూసిన హాక్సియా, వెంకీలు తట్టుకోలేకపోయారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఆ బంజరు భూమిలో మొక్కలను నాటడం ప్రారంభించారు.
అయితే హాక్సియా, వెంకీల దగ్గర మొక్కలను కొనేందుకు, వాటిని నాటేందుకు అవసరమైన పనిముట్లు లేవు. అయినా వారు దిగులు చెందలేదు. తమ వద్ద ఉన్న ఓ గునపం, ఐరన్ రాడ్లనే పనిముట్లుగా చేసుకున్నారు. ఆ బంజరు భూమికి ఆనుకుని ఉన్న కొన్ని దేవదారు వృక్షాల కొమ్మలను నరికి వాటిని నాటడం మొదలు పెట్టారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే కళ్లు కనిపించని హాక్సియా చెట్టు ఎక్కి కొమ్మలను నరికితే అతన్ని తన భుజాలపై మోస్తూ వెంకీ సపోర్ట్‌ను అందించేవాడు. అలా వారిద్దరూ దేవదారు కొమ్మలను మొక్కలుగా నాటారు. ఆశ్చర్యంగా కొద్ది రోజులకే అవి చిగురించడం ప్రారంభించాయి. దీంతో తమ ప్రయత్నం ఫలించిందని భావించిన వారిరువురు అంతటితో ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 12 ఏళ్లుగా దాదాపు 12 వేల మొక్కలను నాటారు. అవన్నీ ఇప్పుడు వృక్షాలుగా మారి ఆ ప్రాంతమంతా చిన్నపాటి అడవిని తలపిస్తోంది.
ఎవరు ఎలాంటి సహాయం చేయకున్నా, డబ్బులు లేకున్నా, అంగ వైకల్యం అడ్డు వచ్చినా ఎంతో శ్రమించి పర్యావరణ పరిరక్షణ కోసం వారు చేసిన ఆ మహత్కార్యాన్ని నిజంగా మనం అభినందించాల్సిందే! వారిద్దరినీ వేనోళ్ల పొగడాల్సిందే! ఏమంటారు!