నొప్పులు, జ్వరం లాంటివి వచ్చాయంటే చాలు. వెంటనే దగ్గర్లో ఉన్న మెడికల్ షాపుకు పరిగెత్తుకుని వెళ్లి మెడిసిన్ కొనుక్కుని వేసుకుంటాం. చాలా మంది ప్రస్తుతం చేస్తున్నది ఇదే. అనారోగ్యం నుంచి ఉపశమనం లభించాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఇలా చేస్తున్నారు. అంతే తప్ప, ఆ మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతేకాదు, అసలు ఆ మందులు మంచివేనా, నాణ్యంగానే ఉంటాయా, వాటిని వాడవచ్చా..? వంటి విషయాలను తెలుసుకోకుండానే చాలా మంది ఇలా పలు రకాల మందులను వాడుతున్నారు. ఈ క్రమంలో ఆయా మందులను తయారు చేస్తున్న కంపెనీలు కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా మందులను తయారు చేస్తున్నాయి. అలాంటి పలు మందులను తాజాగా గుర్తించారు సంబంధిత అధికారులు. ఆ మందులు అస్సలు నాణ్యమైనవిగా ఉండడం లేదట, నాసిరకంగా ఉంటున్నాయట. తాజాగా జరిపిన ప్రయాగాల్లో ఈ విషయం తెలిసింది.
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణా సంస్థ (సీడీఎస్‌సీవో) ఈ మధ్యే పలు మందులపై ప్రయోగాలు చేసింది. వాటిలో నాణ్యత ఎంత ఉంది, అవి సురక్షితమేనా..? వంటి విషయాలను తెలుసుకోవడం కోసం కాంబిఫ్లాం, డీకోల్డ్ టోటల్, ఓప్లాక్స్-100 డీటీ, థియో ఆస్థలిన్, కెడిలోస్ సొల్యూషన్ వంటి మందులపై సీడీఎస్‌సీవో ప్రయోగాలు చేసింది. దీంతో సదరు అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిశాయి. వాస్తవానికి ఈ మందుల్లో ఏ మాత్రం నాణ్యత ఉండడం లేదట. అవన్నీ నాసిరకంగా తయారు చేస్తున్నారట. కాంబ్లిఫామ్ను జ్వరం, నొప్పుల కోసం ఉపయోగిస్తారు. అలాగే జలుబుకు డీకోల్డ్ టోటల్, యాంటీ బయోటిక్ ఓప్లాక్స్-100 డీటీ, శ్వాస సమస్యలకు థియో ఆస్థలిన్, మలబద్దకం కోసం కెలోడిస్ సొల్యూషన్ మందులను వాడుతారు. కాగా ఈ మందులు నాసిరకమైనవని సదరు సంస్థ తెలియజేసింది.
అయితే ఈ మందులపై నిషేధం విధిస్తారా..? లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఒక వేళ అన్ని బ్యాచ్ లకు చెందిన ఈ మందులు నాసిరకమైనవిగా తేలితే అప్పుడు వాటిని నిషేధించే అవకాశం ఉంది. లేదంటే కేవలం ఒక నిర్దిష్ట బ్యాచ్‌కు చెందిన మందులను మాత్రమే నిషేధించవచ్చు కూడా. ఏది ఏమైనా పైన చెప్పిన మందులను మాత్రం వాడకండి. డాక్టర్ సూచించిన మందులనే వాడండి. లేదంటే అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్న వారమవుతాం.