హైద‌రాబాదీ బిర్యానీ కాద‌ది… పురుగుల బిర్యానీ… హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో బ‌య‌ట ప‌డుతున్న దిమ్మ తిరిగే నిజాలు..!

హైద‌రాబాదీ బిర్యానీ..! ఇదంటే చాలా మందికి ఇష్ట‌మే. పేరు చెబుతుంటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. మ‌న బిర్యానీ పేరు చెబితే చాలు విదేశీయులు కూడా లొట్ట‌లేసుకుంటూ తింటారు. అంత‌టి ఖ్యాతి హైదరాబాదీ బిర్యానీకి ఉంది. అయితే ఇదే పేరు అడ్డం పెట్టుకుని కొంద‌రు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ య‌జ‌మానులు లాభాపేక్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రోజుల త‌ర‌బ‌డి ఫ్రిజ్ లో నిల్వ చేసిన‌, పురుగులు తిరుగుతున్న‌, నాణ్య‌త‌లేని మాంసానికి మ‌సాలాలు ద‌ట్టించి మ‌రీ దాంతో బిర్యానీ వండుతున్నారు. ఈ క్ర‌మంలో మ‌సాలా ఘాటు మాటున స‌ద‌రు నాణ్య‌త లేని బిర్యానీని మ‌నం తింటున్నాం. ఆస్ప‌త్రుల పాల‌వుతున్నాం. అయిన‌ప్ప‌టికీ ఆ దందాను వ్యాపారులు మాన‌డం లేదు. ఇటీవ‌లి కాలంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌పై జీహెచ్ఎంసీ అధికారులు చేసిన దాడుల్లో ప‌లు దిగ్భ్రాంతిని క‌లిగించే విష‌యాలు తెలిశాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని పాత‌బ‌స్తీ మదీనా సమీపంలో ఉన్న‌ మిస్కిన్ హోటల్‌లో అధికారులు ఈ మ‌ధ్యే దాడి చేశారు. అక్క‌డ వారం రోజుల కిందటి కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వ చేసిన విషయాన్ని వారు గుర్తించారు. ఫ్రిజ్‌లో మాంసాన్ని పెట్టారు. అందులో పురుగులు తిరుగుతున్నాయి. పూర్తిగా అపరిశుభ మైన వాతావరణంలో వంటశాల నిర్వహిస్తున్నారు. దీంతో ఈ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అలాగే గుల్జార్ హౌస్‌లోని అర్మాన్ హోటల్‌లో జీహెచ్‌ఎంసీ ధ్రువీకరించని మాంసాన్ని వినియోగిస్తుండ‌గా అధికారులు ఆ హోట‌ల్‌పై దాడి చేసి విష‌యం తెలుసుకున్నారు. దీంతో అర్మాన్ హోటల్ కు రూ.50 వేల‌ జరిమానా విధించారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 4 లోని ఆర్ఎన్‌బీ (1589) హోటల్‌ను తనిఖీ చేయగా అధికారుల‌కు దిమ్మ తిరిగి పోయింది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో హోట‌ల్ వారు వంటశాలను నిర్వహిస్తున్న‌ట్టు గుర్తించారు. దీంతో ఈ హోటల్‌కు రూ.10 వేల‌ జరిమానా విధించారు.

అయితే అధికారులు గుర్తించి ఫైన్ వేసిన హోట‌ల్స్, రెస్టారెంట్స్ ఇంకా న‌గ‌రంలో చాలానే ఉన్నాయి. కానీ వాటి గురించి వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. ఏది ఏమైనా ప్ర‌స్తుతం ఉన్న కొంద‌రు హోట‌ల్స్ య‌జ‌మానులు హైద‌రాబాదీ బిర్యానీకి ఉన్న ప‌రువును కాస్తా గంగ‌లో క‌లుపుతున్నార‌నే మాట మాత్రం వాస్తవం. ఇది ఆగ‌క‌పోతే అప్పుడిక హైద‌రాబాదీ బిర్యానీ అంటే హుస్సేన్ సాగ‌ర్‌కు ఉన్న పేరులా మారుతుంద‌ని ఇట్టే చెప్ప‌వ‌చ్చు. ఏమైన‌ప్ప‌టికీ మీరు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండండి. బ‌య‌ట బిర్యానీ తినేట‌ప్పుడు ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకుని తినండి. లేదంటే అనారోగ్యాల బారిన ప‌డ్డాక బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

Comments

comments

Share this post

scroll to top