కార్పోరేట్ కాలేజీల్లో…బ‌ల‌వంత‌పు చ‌దువుల‌పై విమ‌ర్శ‌ణాత్మ‌క క‌విత‌.!!

 

తరగతి గది హత్య
కొమ్మలకు ఊగాల్సిన ఈ పూలేంటి
ఇలా ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి?
మనలో చెట్టుతనం చచ్చిపోయిందిలే
****
పుస్తకాల బరువు మోయలేకో
ఊపిరి తీసుకోనివ్వకుండా వెంటాడే గడియారాన్ని తప్పించుకోలేకో
ప్రేమగా హత్తుకోవాల్సిన అమ్మనాన్నల ఆకాంక్షల కర్కశత్వాన్ని తట్టుకోలేకో
రక్తం జుర్రుకునే రాగింగ్ కి తలవంచలేకో
దేహాల్ని కళేబరాలు చేసుకున్నారా చిట్టితల్లులూ?
ఆనందాల తోటల్లేవ్
అనుభవాల పాటల్లేవ్
అనుభూతుల పక్షుల్లేవ్
చదువొక పిశాచమై రక్తనాళాల్ని పేల్చేస్తుంటే
పుస్తకాలు భూతాలై గుండెకింది చెమ్మనంతా పీల్చేస్తుంటే
ఎదిగే మొక్కలాంటి జీవితం అస్తిపంజరమైపోతుంటే
నీళ్ళు పోయాల్సిన తోటమాలులందరూ
ద్రోహంతో వేళ్ళ మొదళ్ళలో విషం కుమ్మరిస్తుంటే
బతుకుమీద తేళ్ళు కొండేలతో పొడుస్తున్నట్లుంటుంది
****


చదువు వ్యాపారంలో
కొనుగోలుదారులే అమ్మకపు సరుకులు
బాల్య యవ్వనాలు తూకానికి అమ్ముడుపోతాయ్
ఇక్కడ పిల్లలందరూ పుట్టుకతోనే ఖైదీలు
పసిపిల్లల వీపుల మీద
అక్షరాలు లాఠీచార్జీలై గద్దిస్తుంటాయి
స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళన్నె జైళ్ళే
టీచర్లు హెడ్మాస్టర్లు వార్డెన్లందరూ పోలీసులే
బార్బ్ డ్ వైర్ ఫెన్సింగ్ తో ఎత్తైన గోడల మధ్య
చదువెంత క్రూరమైందో హెచ్చరించే ఆల్సేషియన్ల పహారాలో
దివారాత్రాలు భయం నిర్బంధం
క్లాసు నుండి క్లాసుకి అస్తిమిత యాంత్రిక పరుగులు
వికసించే వయసుల సంక్లిష్ట మనోనేత్రం మీద భీతావహ దృశ్యాల ముద్ర
పల్లానికి పరవళ్ళు తొక్కే హార్మోన్ల అలజడిలో ఉద్రేక నైరాశ్యల వెల్లువ
శతృదేశం కాన్సంట్రేషన్ క్యాంపుల్లో
యుద్ధఖైదీలు మాతృదేశం మీద బెంగపడ్డట్లు
అర్ధరాత్రి అమ్మ గుర్తుకొస్తే నాన్న తలంపుకొస్తే
ఉలిక్కిపడి లేస్తే
చుట్టూ నిద్రలోనే పాఠాలు వల్లెవేస్తూ పలవరించే
సాటి పాక్షిక అనాధలు
పశువుల కొట్టంలో కట్టేసిన దూడకైనా
పక్కనే పాలుతాపే పొదుగుల్నిండిన తల్లులుంటాయి
మరిక్కడ ఏ సన్నని ఇనుపమంచం
అమ్మ కౌగిళ్ళను మంజూరు చేయగలదు?
పోలీసు లాఠీల్లా పంతుళ్ళ బెత్తాలు భయపెట్టినప్పుడు
ఏ వసారాల గోడలు నాన్న భుజాల్లా కాపు కాయగలవు?
నెలకొకసారి అమ్మానాన్న మునివేళ్ళ ములాఖత్ ల కోసం ఎదురుచూపు
వాళ్ళొస్తారు
ఎదురు చూసిన భుజం మీద తలవాల్చితే బండరాళ్ళ స్పర్శ!
****
నిఘంటువుల్లో కొత్తపదాన్ని చేర్చండి
ఎన్ కౌంటర్, లాకప్ డెత్ తో పాటు
తరగతిగది హత్యని!
(“కవిత్వంలో ఉన్నంతసేపూ….” సంకలనం నుండి)

Credits: Aranya Krishna.

Comments

comments

Share this post

scroll to top