ప్రపంచం నిదుర పోయే వేళ ..రాత్రి అంతమయ్యే సమయాన ఓ రాగం మెల మెల్లగా తాకుతోంది. దేహాలుకు కొట్టుకు పోతున్నప్పుడు ..హృదయాలు మమేకమై పోయినప్పుడు..మనసులు కలిసేందుకు తహతహ లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి అల్లా రఖా రెహమాన్ తన సంగీత మాధుర్యాన్ని పంచుతాడు. సముద్రపు హోరును..ప్రకృతి పరవశాన్ని పుణికి పుచ్చుకున్న ఆ అద్భుత సృజనకారుడు ప్రపంచాన్ని తన ట్యూన్లలోకి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మనమంతా నిద్రలోకి జారుకున్నప్పుడు రెహమాన్ ఒక్కడే మేల్కొంటాడు. నిద్రహారాలు మాని కొత్త రాగాన్ని కనుక్కునే పనిలో నిమగ్నమవుతాడు. తమిళనాడులో పుట్టిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేయని ప్రయోగాలంటూ ఏవీ లేవు. ఒకప్పుడు యాడ్స్లలో భాగంగా వచ్చే జింగిల్స్‌ను కూర్చడంలో పనికి కుదిరిన ఈ తమిళ కుర్రాడు..ఓ రెస్టారెంట్లో ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం కంట పడ్డాడు.
ఇంకేం ఓ అద్భుతం జరిగింది..అదే దేశాన్ని..ప్రపంచాన్ని ఉర్రూత లూగించిన రోజా సినిమా. వేలాది సినిమా థియేటర్లలో రిలీజై కోట్లాది రూపాయల కోటాలోకి చేరిపోయింది. ఆ మూవీకి సంగీత శిఖరం రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కోట్లాది జనం గుండెల్ని సంగీతంలో ఓలలాడేలా చేసింది. సముద్రమై చుట్టు ముట్టింది. భారతీయ సినీ సంగీతం ఒక్కసారిగా ఎవరీ కుర్రాడంటూ వేచి చూసే స్థాయికి తనను తాను మల్చుకున్నాడు. వందలాది మందిని గాయనీ గాయకులుగా పరిచయం చేశాడు. ఎస్పీబీ ఆధిపత్యాన్ని తగ్గించాడు. కొత్త గొంతుకలు కోయిలమ్మలై హృదయాలను పాటల తోటల్లోకి తీసుకెళ్లాడు. ఎన్నో రాగాలకు ప్రాణం పోశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందంటాడు అల్లారఖా.
ఈ సంగీత కళాకారుడు..శిఖరం అంచున నిలబడ్డాడు. ఓ రుషిలా..ఓ యోగిలా బతుకు మర్మాన్ని మరింత రాగరంజితం చేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు. 1967 జనవరి 6న జన్మించిన దిలీప్ కుమార్ పుట్టుకతో హిందువు..ఆ తర్వాత సూఫీ తత్వాన్ని అమితంగా ఇష్టపడే ఇస్లాం మతం స్వీకరించాడు..రెహమాన్‌గా పేరు మార్చుకున్నాడు. ఏదో మహత్తు..గమ్మత్తు దీనిలో దాగి ఉందంటాడు.
కడప పెద్ద దర్గా అంటే మనోడికి ఎనలేని భక్తి. సంగీత దర్శకుడిగా ఎన్నో ఎత్తులు చూసిన అల్లా రఖా..మనసు దోచే గాయకుడు కూడా. ఆయ గొంతులోని మాధుర్యం కోట్లాది గుండెల్ని మీటింది. కన్నీళ్లను..బాధను కలగలిపితే..బంధం..బంధాల్ని కలిపితే అతడి సంగీతమవుతుంది. సంగీత దర్శకులు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే..రెహమాన్ మాత్రం తన కోసం నిర్మాతలు, దర్శకులు వేచి చూసే స్థాయికి ఎదిగాడు.
తొమ్మిదేళ్లపుడు రెహమాన్ తండ్రిని కోల్పోయాడు. పేదరికం వెంటాడినా సంగీత సాధన మానలేదు. కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకుని ఇళయరాజా దగ్గర శిష్యరికం చేశాడు. జింగిల్స్ చేస్తూ యోధ సినిమాకు పనిచేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కోటి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళంతో పాటు భారతీయ భాషలన్నింటిలోకి ఈ సినిమా తర్జూమా అయింది. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా సంగీతం ప్రపంచాన్ని ఊపేసింది. జయహో గీతం మిలియన్ల కొద్దీ విన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డును వరించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి ఇండియన్ రెహమానే. అల్లా రఖా అంటే తనకు భయమంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఎల్. వైద్యనాథన్ ఒకానొక సమయంలో వ్యాఖ్యానించారు.
కర్ణాటక సంగీతం, హిందూస్తానీ సాంప్రదాయం, రెగ్గె, ర్యాంప్, రాక్, పాప్, ఖవ్వాలీ, జాజ్, ఒపేరా, సూఫీ, ఆఫ్రికన్, పాశ్చాత్య సంగీతాన్ని మేళవించాడు అల్లారఖా. ఎన్నో బిరుదులు, మరెన్నో పురస్కారాలు అతడిని వరించాయి. రెహమాన్ ఉత్తుంగ తరంగమై ఎదిగాడు. ఆయనలోని ప్రతిభా సంపత్తిని గుర్తించిన ఎన్నో సంస్థలు, దేశాలు సన్మానించాయి. ఆయన సంగీతంలో వచ్చిన పాటలు ఆస్కార్‌కు ఎంపికయ్యాయి.
రెండుసార్లు ఆస్కార్ అవార్డును అందుకున్న ఘనత రెహమాన్ ఒక్కడికే దక్కింది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా ..19 సార్లు హిందీ, తమిళ చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు పొందాయి. బొంబాయి, రంగీలా, స్పదేశ్, లగాన్, రంగ్‌దే, బసంతి, గురు, జోదాఅక్బర్, రజనీకాంత్ అన్ని సినిమాలకు మనోడే మ్యూజిక్ అందించారు. 2013 ఆగష్టు 9న సంగీత పాఠశాలను అనిల్ అంబానీతో కలిసి ప్రారంభించాడు. ఇండియాలోనే అద్భుత సదుపాయాలు కలిపిన సంగీత కాలేజీగా ప్రసిద్ధి చెందింది.
భక్తుడు..ఫకీరు – ఒకప్పుడు పేదరికంతో తల్లడిల్లిన దిలీప్‌కుమార్ అలియాస్ అల్లా రఖా రెహమాన్ ..స్వచ్ఛమైన భక్తుడు. సంచారి..యోగి..ఫకీరు. ఎక్కడ దర్గాలుంటే అక్కడికి ఈ సంగీతకారుడు చేరుకుంటాడు. కడపలోని పెద్ద దర్గా ప్రేమికుడు. ప్రతి ఏటా ఉత్సవాలకు హాజరవుతాడు. ఖవ్వాళీ ప్రదర్శన ఇస్తాడు. ఈ ఇండియన్ ప్రపంచాన్ని తన వైపు మళ్లేలా చేసుకున్న ఈ ఘనత రెహమాన్‌దే.