ఆ ఫ్రిజ్ లో ఉన్న ఆహారాన్ని ఎవ‌రైనా ఫ్రీగా తీసుకోవ‌చ్చు. ఎందుకో తెలుసా..?

ఆక‌లేస్తే మ‌నం ఇంట్లో ఆహారం వండుకుని తింటాం. అది న‌చ్చ‌క‌పోతే బ‌య‌ట ఏ హోట‌ల్‌కో వెళ్లి న‌చ్చిన ఫుడ్ ఆర్డ‌ర్ ఇచ్చి తింటాం. కానీ అస‌లు పూట‌కు గ‌తిలేని వారి ప‌రిస్థితి ఏమిటి..? వారికి ఎవ‌రు ఆహారం పెడ‌తారు..? అంటే.. అందుకు స‌మాధానం దొర‌క‌దు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం ఆహారం ఎవ‌రు పెడ‌తారు అంటే… అందుకు అక్క‌డ ఉండే ఫ్రిజ్ పేరు చెబుతారు. ఎందుకంటే అదే అక్క‌డ ఉండే పేద‌ల‌కు భోజ‌నం పెడుతోంది క‌నుక‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఏంటీ.. ఫ్రిజ్ ఎలా భోజ‌నం పెడుతుంది..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..! అవును, ఫ్రిజే పెడుతుంది. కాక‌పోతే దాన్ని నిర్వ‌హించేది మాత్రం ఓ లేడీ డాక్ట‌ర్‌. ఆమె చొర‌వ వ‌ల్లే ఆ ఫ్రిజ్ న‌డుస్తోంది. దాని స‌హాయంతో పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం అందుతోంది.

ఆమె పేరు ఇసా ఫాతిమా జాస్మిన్‌. చెన్నై వాసి. ఈమె ఓ ఆర్థోడాంటిస్ట్‌. అయితే వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయినా ప్ర‌వృత్తి రీత్యా మంచి మ‌న‌స్సున్న మ‌నిషి. మ‌న దేశంలో ఇండ్ల‌లో గానీ, హోట‌ల్స్‌, రెస్టారెంట్లలో గానీ మొత్తం క‌లిపి వండిన ఆహారంలో 50 శాతం మేర ఆహారం వృథా అవుతోంద‌ని ప‌లు సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. అయితే అదే ఆహారాన్ని పారేయ‌కుండా పేద‌ల‌కు పెడితే దాంతో దేశంలో ఎవ‌రూ ఆక‌లితో బాధ ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని ఫాతిమా భావించింది. ఈ నేప‌థ్యంలోనే అలాంటి ఆహారాన్ని సేక‌రించేందుకు ఆమె చెన్నై బీచ్‌లో ఓ క‌మ్యూనిటీ ఫ్రిజ్‌ను పెట్టింది.

అందులో చుట్టూ నివాసం ఉండే స్థానికులు, హోట‌ల్స్ వారు త‌మ వ‌ద్ద మిగిలిపోయిన ఆహారాన్ని ఉంచ‌డం ప్రారంభించారు. దీంతో ఆ విష‌యం తెలిసిన పేద‌లు ఫ్రిజ్ వ‌ద్ద‌కు వ‌చ్చి అందులో ఉన్న ఆహారాన్ని తీసుకుని తిన‌డం ప్రారంభించారు. అలా ఇప్పుడీ విష‌యం చాలా మందికి తెలిసే స‌రికి ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఆహారం అక్క‌డ పేద‌ల‌కు అందుతోంది. కేవ‌లం ఆహార‌మే కాదు, కొంద‌రు పండ్లు, జ్యూస్‌లు వంటివి కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారు. ఇక దాని ప‌క్క‌నే ఓ షెల్ఫ్‌ను ఏర్పాటు చేయ‌గా అందులో అవ‌స‌రం లేని పుస్త‌కాలు, బ‌ట్ట‌లు, బొమ్మ‌లు, షూస్‌, చెప్పులు వంటి వ‌స్తువుల‌ను పెట్టడం ప్రారంభించారు. దీంతో ఆ వ‌స్తువుల‌ను కూడా పేద‌లు తీసుకుంటున్నారు. క‌మ్యూనిటీ ఫ్రిజ్ అనే ఐడియా స‌క్సెస్ కావ‌డంతో మ‌రిన్ని చోట్ల ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని ఫాతిమా భావిస్తోంది. ఆమె ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం..!

Comments

comments

Share this post

scroll to top