మన ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం…చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి చెయ్యి కోల్పోయిన దేవేంద్రకు జావెలిన్ త్రో లో గోల్డ్.

ఆత్మ‌విశ్వాసం ముందు అంగ‌వైక‌ల్యం చిన్న‌బోయింది. ప‌ట్టుద‌ల, కృషి ఉంటే చాలు ఎలాంటి ల‌క్ష్యాన్నైనా సాధించ‌వ‌చ్చ‌ని మ‌రోసారి నిరూపిత‌మైంది. అది ఈ సారి జ‌రుగుతున్న రియో పారాలంపిక్స్‌లో చోటు చేసుకుంది. భార‌త్‌కు చెందిన దేవేంద్ర ఝ‌ఝారియా రియో పారాలంపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టి భార‌త్‌కు స్వ‌ర్ణాన్ని అందించాడు. దీంతో అత‌ని ఖాతాలో రెండో ఒలంపిక్ ప‌త‌కం చేరింది. పారాలంపిక్స్‌లో రెండు బంగారు ప‌త‌కాలు సాధించిన భార‌తీయుడిగా దేవేంద్ర పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.

Devendra-Jhajharia

ప్ర‌మాద‌వ‌శాత్తూ చేయి పోయినా కొండం ఆత్మ విశ్వాసంతో ముందుకు…
రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన జాట్ కుటుంబంలో దేవేంద్ర 1981 జూన్ 10న జ‌న్మించాడు. కాగా అత‌ను 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వాడిగా ఉన్న‌ప్పుడు త‌న ఇంటి వ‌ద్ద ఉన్న ఓ చెట్టు ఎక్క‌బోతుండ‌గా మ‌ధ్య‌లో ఉన్న క‌రెంటు తీగ‌ను అనుకోకుండా ముట్టుకున్నాడు. దీంతో దేవేంద్ర‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అత‌ని ప‌రిస్థితిని గ‌మనించిన వైద్యులు ఎడ‌మ చేయిని తొల‌గించారు. అయితే చేయి కోల్పోయి అంగ వైక‌ల్యం ఏర్ప‌డినా క్రీడ‌ల్లో మాత్రం దేవేంద్ర చురుగ్గానే ఉండేవాడు. ఇత‌ర విద్యార్థుల‌తో పోటీ ప‌డేవాడు. ప్ర‌ధానంగా జావెలిన్ త్రోలో అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌రిచే వాడు. ఈ క్ర‌మంలో 1997లో అత‌ని స్కూల్‌లో ఒక రోజు జ‌రిగిన స్పోర్ట్స్ మీట్‌లో ప్ర‌ముఖ ద్రోణాచార్య అవార్డు గ్ర‌హీత, కోచ్ ఆర్‌డీ సింగ్ దేవేంద్ర ప్ర‌తిభ‌ను చూశాడు. జావెలిన్ త్రోలో దేవేంద్ర చాటుతున్న స‌త్తాను గ‌మ‌నించి అత‌నికి కోచ్‌గా మారాడు. ఈ క్ర‌మంలో సింగ్ పర్య‌వేక్ష‌ణ‌లో దేవేంద్ర మ‌రింత రాటుదేలాడు. అదే అత‌నికి ఎన్నో మెడ‌ల్స్‌ను తెచ్చి పెట్టింది.

Devendra-Jhajharia

గోల్డ్ మెడ‌ల్ కొట్ట‌డం దేవేంద్ర‌కు మంచి నీరు తాగినంత పని…
ఆర్‌డీ సింగ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జావెలిన్ త్రోలో శిక్ష‌ణ తీసుకున్న దేవేంద్ర 2002లో కొరియాలో జ‌రిగిన ఎఫ్ఈఎస్‌పీఐసీ గేమ్స్‌లో గోల్డ్ మెడ‌ల్‌ను సాధించాడు. 2013 ఐపీసీ అథ్లెటిక్స్ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో, 2014 ఏషియన్ పారా గేమ్స్‌లో, 2015 ఐపీసీ అథ్లెటిక్స్ వ‌రల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో వ‌రుస‌గా గోల్డ్‌, సిల్వ‌ర్ మెడ‌ల్స్ సాధించాడు. కాగా 2004లో ఏథెన్స్‌లో జ‌రిగిన పారాలంపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో 62.15 మీట‌ర్లు త్రో చేసి మొద‌టి స్థానంలో నిలిచాడు. గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. అనంత‌రం ఇప్పుడు రియోలో జ‌రిగిన పారాలంపిక్స్‌లో 63.97 మీటర్లు త్రో చేసి త‌న రికార్డును తానే బ‌ద్ద‌లు కొట్టాడు. అంతేకాదు మ‌ళ్లీ స్వ‌ర్ణ ప‌త‌కం సాధించాడు. దీంతో పారాలంపిక్స్‌లో రెండు గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన మొద‌టి భార‌తీయ పారాలంపియ‌న్‌గా దేవేంద్ర రికార్డు సృష్టించాడు. అత‌నిలో దాగి ఉన్న అచంచ‌ల విశ్వాసానికి, ప‌ట్టుద‌ల‌కు, అత‌ను చూపుతున్న ప్ర‌తిభ‌కు భార‌తీయులుగా మనం అతన్ని అభినందించాల్సిందే. అత‌నికి శాల్యూట్ చేయాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top