కెసిఆర్ కు నిరుద్యోగి బహిరంగ లేఖ -ఓయూ యువకుడి కంటతడి.

అయ్యా… కెసిఆర్ గారు వందనాలు, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీకు తెల్వకపోవొచ్చు, కానీ మీరు నాకు బాగా తెల్సు, ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా, బంగారు తెలంగాణ నినాద కర్తగా.  అంతా బాగానే ఉంది, కానీ నా బాధ కూడా జర జెప్త వినుండి సారు.

ఏమీ తెల్వని పోరగాన్ని, ఉస్మానియా యూనివర్సిటీకి  వచ్చిన, మొదటి సారి  పైసదువుల కోసం పల్లె వదిలి పట్నం వస్తున్నాని కొడుకా మంచిగా సదువుకో, ఉద్యోగం రావాలే అని మాఅమ్మ  ఆమె చెవి కమ్మలమ్మి 4 వేల రూపాలు  జేబుల పెట్టింది. అప్పటి వరకు నే సదివిన పుస్తకాలు,బట్టల సంచి తో ఓయుల దిగిన.  కొత్త కొత్త గా, అంతా బాగుంది, కొత్త దోస్తులందరూ  నా లాగ ఊళ్లకెల్లి వచ్చినోల్లె. రెండో రోజు కాలేజీ కు వెళ్ళా..బంద్ బోర్డు పెట్టిన్రు..!! తీరా ఆరా తీసే దాక తెల్వదు.. తెలంగాణా బంద్ అని.

నిజంగా నిజం చెబుతున్న అప్పటి వరకు తెలంగాణా గొడవ నాకు తెల్వదు.! తెల్సుకోవాలని లైబ్రరీ మెట్లెక్కా . ఉద్యమానికి సంబంధించిన బుక్స్ అన్నీ తిరిగేసా.నర నరాన ఉక్రోషం.గింత అవమానం జరిగిందా అని లోలోపల కోపం…ఫలితం వచ్చే దాక పోరాటం జరగాలి అని కోరుకున్న. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయ్ అన్న…మా సీనియర్ రంజిత్ అన్న మాటలు విని రాళ్ళు పట్టుకున్నాం. నినాదాలు చేసాం, భాష్ప వాయు గోలాల పొగను పీల్చాం. పోలీస్ లు వదిలిన షెల్ల్స్ డొక్కల తగిల్నయ్. మరో సారి ఉల్లిగడ్డలు తెచ్చుకొని మరీ టియర్ గ్యాస్ కు ఎదురుగా నిలబడ్డం. ఎందుకంటే మా పోరాటం లో నిబద్దత ఉందని.

అరెస్టులు చేసారు, హాస్టల్లోకి వచ్చి కొట్టారు, భరించాం…నినదిన్చాం.. మా దోస్త్ తమ్ముడు  ఆర్ట్స్ కాలేజీ ముందు చెట్టుకు ఉరేసుకున్నప్పుడు..మా చేతులతో శవాన్ని దించాం. వాడు రాసిన లెటర్ చదివి ఏడుస్తూనే జై తెలంగాణా అన్నాం. అరేయ్ నా తమ్ముడు రా… అని ఏడుస్తూ అడిగిన మా దోస్త్ కు సమాధానం చెప్పలేక సగం చచ్చాం. వీరుల్లారా.. వీర వనితల్లారా అంటూ పాడుకుంటూ పున్నమి వేళ నిండు చంద్రున్ని,ఆ పక్కనే ఉన్న సుక్కల్ని చూస్తూ వాడక్కేవుంటాడని  మాకు మేమే ధైర్యం సెప్పుకున్నాం.

రబ్బరు బుల్లెట్లు, ముళ్ళ కంచెల మద్య మా పరీక్షలు ముగిసాయ్. కాలం గిర్రున తిరిగింది. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కింది .తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. జూన్ 2, ఆర్ట్స్ కాలేజీ  విద్యుత్ దీపాలతో వెలుగుతుంది. మా  మోముులు కూడా రెట్టించిన చిచ్చుబుడ్డుల ఎలిగిపోతున్నాయి.                ఆ దీపాల  వెలుగుల్లో అసైదూల ఆడుతున్న మా దోస్త్ తమ్ముడి ఆత్మను పలకరించాం!!  వాడి చివరి లెటర్ ను మరో సారి గట్టిగా  చదివినం.. కళ్ళ నుండి ధారలు కారుతున్నాయ్…అక్షరాల్లో వాడి మోమును చూసి.


కొత్త రాష్ట్ర సంబరాలు…ఆ ఆనంద క్షణాలు అలాగే సాగాయ్.కొత్త రాష్ట్రం,కొత్త ప్రభుత్వం, అది కూడా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన పార్టీ చేతిలో అధికారం .కమ్మలమ్మిన అమ్మ కళ్ళలో ఆనందం… అరేయ్ తెలంగాణా వచ్చిందంట ఉద్యోగం వచ్చినట్టేనా??అని అమ్మ అడుగుతుంటే  వచ్చినట్టే..వచ్చినట్టే అని చెపుతూ …చెపుతూ నెట్టుకొస్తున్నం. ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. అధికారం వస్తే లక్ష ఉద్యోగాలు లెక్క గట్టి ఇస్తం అన్న మీరు నోటిఫికేషన్ కు దిక్కు లేకుండా చేశారు. ఉద్యమాన్ని చేతులతో నడిపించిన ఓయూ పిల్లలంటే ఇప్పుడు మీకు ఎక్కడలేని కోపం వస్తున్నట్టుంది  అవహేళన చేస్తున్నారు. ఐఏయస్ ల కొరతుందని ఉద్యోగాల ముచ్చటగూడ మర్చిపోయారు. TSPSC ఎందుకేర్పండిదో నాకైతే తెల్వట్లేదు.

విచిత్రం  ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పడి ఈయాల్టికి సరిగ్గా సంవత్సరం, ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అసలు విషయం ఏంటంటే
మా దోస్త్ తమ్ముడి  సంవత్సరికం అయిపోయింది ,మా అమ్మ  చెవి కమ్మలు తాకట్టు కొట్టోని సొంతమయ్యాయ్!! నేనింకా కోచింగ్ ల పేరుతో అశోక్ నగర్ చౌరస్తా లో తిరుగుతున్నాను.  

By

Azharuddin – OU Student

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top