అయ్యా BCCI పెద్దలు…..
మీకు క్రికెట్ అంటే కాసుల గలగలు కావొచ్చు, మాంచి వ్యాపారం కావొచ్చు, కానీ నాకు ప్రాణం, నా దేశ గౌరావాన్ని సగర్వంగా నిలబెట్టే సాధనం. కానీ నేడు ఆ గౌరవాన్ని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో కప్పిపెట్టారు మీరు.!! టెస్ట్, వన్డే అంటూ లెక్కలు లేకుండా ప్రతి ఫార్మాటూ కళ్ళప్పగించి చూసే నా గుండెల్లో బాకులు దించారు మీరు!!
ఏం జరుగుతుంది మన క్రికెట్ కు, కాసుల వేటలో మన ఆట ఎటుపోతోంది? వన్డే ఫార్మాట్ లో సెకెండ్ ప్లేస్ లో ఉన్న జట్టు, పసికూన బంగ్లాదేశ్ పై ఆ అత్తెసరు ప్రదర్శనేంటి? వరల్డ్ కప్ లోనే అవలీలగా సెమీస్ కు చేరిన జట్టు, అనామక జట్టు ముందు ఎందుకు చేతులెత్తేసింది? ఐపియల్ లో అదరగొట్టిన మన స్టార్లు అక్కడెందుకు చతికిలబడ్డారు? టీమ్ ఇండియా సమిష్టి వైఫల్యానికి అసలు కారణం ఏమిటి? వీటికి సమాధానాలు మీకు దొరక్కపోవొచ్చు లేదా సమాధానాలు వెతికే పనిలో మీరుండొచ్చు ….
కానీ నా సమాధానం మాత్రం సూటిగా ఉంది. కాస్త వినండి…. వీటన్నింటి కారణం మీరు! అవును ముమ్మాటికి మీరే.!! ఆటగాళ్లను గంగిరెద్దులా ఆడిస్తోంది మీరే, వారిని మనుషులనుకుంటున్నారా? లేక మర యంత్రాలనుకుంటున్నారా?విశ్రాంతి లేకుండా ఆ షెడ్డ్యూల్ ఏంటి? కాసుల కక్కుర్తిలో ఆటగాళ్లు, మీరు చేసిన నిర్వాహకం. అన్ని వెరసి భారత క్రికెట్ పరువును తీసాయ్, నెంబర్-2 జట్టు ఆట ఇదేనా అంటుంటే నా ప్రాణాలు ఆ కామెంట్రీలో కొట్టుకుపోయాయ్!!
గత అయిదు నెలల నుండి విశ్రాంతి అనే మాట లేకుండా ఆటగాళ్ళ ను కీ ఇచ్చే చైనా బొమ్మళ్లా ఆడించారు. పిబ్రవరి 14 నుండి మార్చి 29 న వరకు జరిగిన వరల్డ్ కప్ లో పాల్గొని వచ్చారో లేదో, ఏప్రిల్ 18 న ఐపియల్ సీజన్ కు తెరలేపి మే 24 న వరకు అంటే దాదాపు అయిదు వారాల పాటు ప్లేయర్స్ ను అదే పనిగా ఆడించారు.
15 రోజులు రెస్ట్ తీసుకున్నారో లేదో పదండి బంగ్లా టూరుకు అని ఆటగాళ్ళను తరిమారు. ఆటగాళ్లకు విశ్రాంతి లేకపోతే ఫలితం ఇలా కాక మరెలా వస్తుంది.? నా కంట్లో కన్నీరెలా ఆగుతుంది. మళ్లి ఇది చాలదన్నట్టు వచ్చే నెల జింబాబ్వే పర్యటనను కూడా ఫిక్స్ చేసారు. ఇక ఆపండి డబ్బుల లెక్కలు తర్వాత చూసుకొండి, ఆటగాళ్ల ఆటను గమనించండి. నాలాంటి అభిమానుల పల్స్ రేట్ ను పెంచకండి, ఐసియూ లో నన్నుచేరేలా చేయకండి! ఎందుకంటే జింబాబ్వే చేతిలో కూడా ఓడితే ఇదే జరుగుతుందని నాభయం
ఇట్లు.