సంక్షేమ హాస్ట‌ల్స్‌లో వార్డెన్ల ప‌ని ప‌ట్టేందుకు క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి ఏం చేశారో తెలుసా..?

సెల్ఫీ అనేది నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న‌వారికి కామ‌న్ అయిపోయింది. ఎక్క‌డ ఎప్పుడు ఏ ప్ర‌దేశంలో ఎలాంటి సంద‌ర్భంలో ఉన్నా సెల్ఫీ తీసుకుంటున్నారు. కొంద‌రైతే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో ప‌నికిమాలిన సెల్ఫీ, ప్రాణాలు తీసే సెల్ఫీ అంటూ చాలా మంది సెల్ఫీకి వ్య‌తిరేకంగా మారుతున్నారు. అయితే కొంద‌రికి సెల్ఫీ యూజ్‌లెస్ గా మారిందేమో గానీ ఆ ప్రాంత విద్యార్థుల‌కు మాత్రం సెల్ఫీ చాలా లాభం చేకూరుస్తోంది. ఇంత‌కీ అదెలాగో తెలుసా..?

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఎస్సీ, బీసీ, గిరిజన పాఠశాల/కళాశాలల సంక్షేమ వ‌స‌తి గృహాలు (హాస్ట‌ల్స్‌) అన్నీ కలిపి మొత్తం 35 (ఎస్సీ-18, బీసీ-11, ఎస్టీ-06) ఉన్నాయి. ఇందులో సుమారు 4856 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతూ విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి గ‌త కొద్ది రోజులుగా మౌలిక స‌దుపాయాలు స‌రిగ్గా అంద‌డం లేద‌ని, మధ్యాహ్న భోజ‌నం అయితే అస‌లు నాణ్యంగా ఉండ‌డం లేద‌ని, అది కూడా స‌రిగ్గా పెట్ట‌డం లేద‌ని ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలికి తెలిసింది. ఈ క్ర‌మంలో స‌ద‌రు హాస్ట‌ల్ వార్డెన్లు రోజూ హాస్ట‌ల్స్‌కు వెళ్ల‌డం లేద‌ని, స‌రుకులు తెచ్చి అందులో వేసి వారు తమ సొంత ప‌నికోసం వెళ్లిపోతున్నార‌ని ఆమె గుర్తించారు. దీంతో ఆమె వినూత్న ఆలోచ‌న చేశారు. అదేమిటంటే…

స‌ద‌రు సంక్షేమ వ‌స‌తి గృహాల వార్డెన్లు, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు అంద‌రికీ క‌లిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి. ఆమే ఈ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు హాస్ట‌ల్స్‌కు చెందిన వార్డెన్లు రోజూ త‌మ త‌మ పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు వెళ్లి మ‌ధ్యాహ్న భోజ‌నం వ‌డ్డించి, అదే స‌మ‌యంలో అక్క‌డి విద్యార్థులంద‌రితో క‌లిసి సెల్ఫీ దిగాలి. అనంత‌రం ఆ సెల్ఫీని ఆమ్ర‌పాలి క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాలి. దీంతో వారు రోజూ హాస్ట‌ల్‌కు వ‌చ్చేది, రానిదీ, భోజ‌నం ఎలా పెడుతుందీ సుల‌భంగా తెలుస్తుంది. ఈ ఆలోచ‌న వ‌ల్ల ప్రస్తుతం ఆ హాస్ట‌ల్స్ వార్డెన్లు అంద‌రూ స‌రైన స‌మ‌యానికి వ‌చ్చి విద్యార్థుల‌కు నాణ్య‌మైన భోజ‌నం పెట్ట‌డ‌మే కాదు, వారికి మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నార‌ట‌. దీంతో పాఠ‌శాల‌ల‌కు, క‌ళాశాల‌ల‌కు రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింద‌ట‌. వారు రోజూ సెల్ఫీలు దిగి పెడుతుండ‌డంతో ఎవ‌రు ఎలా ప‌నిచేస్తున్నారో క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలికి తెలుస్తున్న‌ద‌ట‌. ఎవ‌రైనా ఒక్క రోజు అలా భోజ‌నం స‌మ‌యంలో సెల్ఫీ దిగి పెట్ట‌క‌పోయినా ఆమె క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. అవును మ‌రి, ఇలాంటి క‌ఠిన‌మైన, నిజాయితీ ఉన్న క‌లెక్ట‌ర్లు ఉంటే ఇక ఎవ‌రి ఆగ‌డాలు సాగుతాయి చెప్పండి. ఏది ఏమైనా క‌లెక్ట‌ర్ ఆమ్ర‌పాలి చేస్తున్న ప‌నికి ఆమెను మ‌నం అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top