అవును మరి.. అనాదిగా స్త్రీలపై పురుషులు చూపుతున్న వివక్ష కారణంగా వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం మన దేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి సమానంగా లేదు. దీంతో పురుషులకు పెళ్లిళ్లు కావడం ఆలస్యం అవుతోంది. అయితే కేవలం మన దేశంలోనే కాదు, ఈ పరిస్థితి ఇతర దేశాల్లోనూ ఉంది. అందుకు మన పొరుగు దేశమైన చైనా కూడా మినహాయింపు కాదు. అక్కడ కూడా బ్రహ్మచారులు పెరిగిపోతున్నారు. యువకులకు యువతులు దొరకడం కష్టతరమైంది. దీంతో ఆ యువకుడు ఏం చేశాడో తెలుసా..? తెలిస్తే షాకవుతారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
చైనాలోని బీజింగ్‌లో ఉన్న వుమెన్ యూనివర్సిటీ అది. అందులో కేవలం మహిళలకు మాత్రమే చదువుకోవడానికి అడ్మిషన్ ఇస్తారు. అలా ఏటా 1500 మంది యువతులకు అక్కడ అడ్మిషన్ ఇస్తారు. అక్కడి వుమెన్ ఫెడరేషన్ ఈ కాలేజీని నడిపిస్తుంది. అయితే 1500 మంది యువతులతోపాటు వారిలో 1 శాతం సంఖ్యలో యువకులకు కూడా ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తారట. అవును, మీరు విన్నది నిజమే. షాకింగ్‌గా ఉన్నా ఆ వుమెన్ యూనివర్సిటీలో ఏటా 1500 మంది యువతులకు గాను 1 శాతం మగవారికి కూడా ఆ యూనివర్సిటీలో ఆర్ట్స్ గ్రూప్‌లో చేరేందుకు అడ్మిషన్ ఇస్తారు.
అయితే ఈ సారి కూడా కొందరు యువకులు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అది ఏటా జరిగే విషయమే అయినా, ఈ సారి దరఖాస్తు చేసుకున్న యువకుల్లో ఒకతను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎందుకంటే.. అతను ఇంటర్వ్యూలో యూనివర్సిటీలో ఎందుకు చేరుతున్నావ్.. అని అడిగితే.. తమ ఊర్లో 130 మంది యువకులకు 100 మంది యువతులే ఉన్నారట. దీంతో తనకు సరైన అమ్మాయి దొరుకుతుందో లేదోనని భయం కలిగిందని, అందుకే 1500 మంది ఏటా చేరే ఆ యూనివర్సిటీనిని ఎంచుకున్నానని, అందులో చేరితే తనకు నచ్చిన ఎవరో ఒక అమ్మాయిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవచ్చని భావించానని, అందుకే వుమెన్ యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకున్నట్లు అతను చెప్పాడు. దీంతో ఇంటర్వ్యూయర్లు ఖంగు తిన్నారు. అయితే ఆ యువకుడి తండ్రికి మాత్రం తన కొడుకు ఇలా చేయడం నచ్చడం లేదట. అంత మంది అమ్మాయిల మధ్య ఎలా ఉంటాడోనని అతను కంగారు పడుతున్నాడట. ఏది ఏమైనా ఇప్పుడీ వార్త కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.