మాయదారి ఫేస్బుక్… అవును, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరు కూడా అలాగే అంటారు. ఎందుకంటే విషయం అలాంటిది మరి. ఏమీ లేదండీ… మీకు తెలియకుండా మీ ఫొటో తీసి, మీ ఫోన్ నంబర్ సంపాదించి ఫేస్బుక్లో నకిలీ ప్రొఫైల్ పెట్టారనుకోండి. దాంట్లో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పోస్ట్ చేశారనుకోండి. ఆ విషయం మీకు తెలిస్తే… అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది..? ఏముందీ… మొదట ఎవరైనా పోలీసులకు కంప్లెయింట్ ఇస్తారు. ఆ తరువాత జరిగే పరిణామాలను చూస్తారు తప్ప, చేసేదేం ఉండదు. నేరస్తులు దొరికితే ఓకే, లేదంటే ఆ కేసు ఎటో వెళ్తుంది. అయితే అక్కడ జరిగింది కూడా ఇదే. కాకపోతే ఆ కేసులో నిందితులు దొరికారనుకోండి, కానీ పోలీసులే బాధితుల ఫిర్యాదుకు కాస్త లేటుగా స్పందించారు.
అది మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సిటీ. అక్కడే ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది ఓ బాలిక. ఆమె ఉంటున్న కాలనీలోనే ఆమెకు తెలిసిన ఇద్దరు యువకులు ఉండేవారు. వారి పేర్లు రోన్నీపాల్ (21), ప్రదీప్ ప్రజాపతి (26). వీరిద్దరూ ఆ బాలిక చదువుతున్న స్కూల్లోని ఆమె తరగతికి చెందిన ఆమె స్నేహితులను మచ్చిక చేసుకున్నారు. అనంతరం ఆమె ఫోన్ నంబర్ సంపాదించారు. తరువాత ఫొటోలు సేకరించారు. వాటితో ఫేస్బుక్లో ఆమెకు తెలియకుండా ఓ నకిలీ ప్రొపైల్ క్రియేట్ చేశారు. ఇక ఆ ఖాతాలో పలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారు.
”గ్వాలియర్ సిటీలో ఉన్న ఓ కోట వద్ద కలుసుకుందాం, ఎవరైనా ఉంటే రండి, నా రేటు రూ.10వేలు, అన్ని చార్జిలతో కలిపి” అని వారు ఆ నకిలీ ఖాతాలో పోస్టులు పెట్టారు. ఆ బాలికను కాల్‌గర్ల్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే వారు అంతటితో ఆగలేదు. ఈ విషయాన్ని ఆమె స్కూల్లో ప్రచారం చేశారు. దీంతో స్కూల్ ఉపాధ్యాయులకు విషయం తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులను పిలిపించారు. దీంతో వారందరికీ అసలు విషయం తెలిసింది. ఫేస్బుక్లో ఆ ప్రొఫైల్ ను ఆమె క్రియేట్ చేయలేదని, సదరు యువకులు రోన్నీ, ప్రదీప్లే చేశారని తెలిసింది. దీంతో ఆ బాలిక, ఆమె తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లోని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు 15 రోజుల వరకు స్పందించలేదు. దీంతో బాధితులు సీఎం హెల్ప్ లైన్‌ను ఆశ్రయించగా అప్పుడు వారు స్పందించి కేసు నమోదు చేసుకుని సదరు యువకులను అరెస్టు చేశారు. చూశారుగా.. మనం ఏమరుపాటుగా ఉంటే… మనకు లేదా మనకు తెలిసిన వారికి ఇలాగే జరగొచ్చు. కాబట్టి ఫేస్బుక్ పట్ల జాగ్రత్త..!