“అమెజాన్”లో ఒకోసారి “చిన్న వస్తువు” కొన్నా “పెద్ద బాక్స్” లో వస్తుంది.! ఎందుకో తెలుసా.? 4 కారణాలు ఇవే.!

నేటి తరుణంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ఎక్కువైంది. ఏ చిన్న వస్తువు కొనాలన్నా చాలా మంది ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా తమకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. బయట తిరిగే బాధ లేకుండా ఇంట్లో కూర్చుని కేవలం ఒక్క క్లిక్‌తో ఐటమ్స్‌ను ఆర్డర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్‌ సంస్థలు కూడా చాలా సౌకర్యవంతంగా డెలివరీలను అందిస్తున్నాయి. అయితే డెలివరీల విషయానికి వస్తే ముఖ్యంగా అమెజాన్‌ సంస్థ ద్వారా మనకు అప్పుడప్పుడు మనం ఆర్డర్‌ చేసే వస్తువులు చిన్నవైనప్పటికీ పెద్ద పెద్ద బాక్సుల్లో వస్తాయి కదా. గమనించారా ? అయితే ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా ? అదే ఇప్పుడు చూద్దాం.

అమెజాన్‌ సంస్థ చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో పంపేందుకు పలు కారణాలు ఉన్నాయి. అవేమిటంటే…

1. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు అన్నింటిలోనూ అమ్మేవారు వేరే ఉంటారు. వారిని సెల్లర్స్‌ అని అంటారని తెలుసు కదా. అయితే వారు తమ వస్తువులకు సంబంధించి కొలతలు, పరిమాణాన్ని ఆన్‌లైన్‌ డేటాబేస్‌లో తప్పుగా ఎంటర్‌ చేస్తారు. లేదంటే వాటి గురించి పట్టించుకోరు. దీంతో ఏ వస్తువును ఏ పరిమాణంలో ఉన్న బాక్సులో పెట్టాలో ఆటోమేటెడ్‌ ప్యాకింగ్‌ మెషిన్లకు తెలియదు. ఈ కారణంగా చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో ప్యాక్‌ చేయడం జరుగుతుంది.

2. తప్పులు చేయడం మానవ సహజం. అయితే మనుషులే కాదు, రోబోలు కూడా తప్పు చేస్తాయి. ఈ క్రమంలోనే రోబోటిక్‌ టెక్నాలజీతో పనిచేసే ఆటోమేటెడ్‌ ప్యాకింగ్‌ మెషిన్లు కూడా కొన్ని సార్లు తప్పు చేస్తాయి. చిన్న వస్తువుకు కూడా పెద్ద బాక్సును అనుకోకుండా ఎంపిక చేస్తాయి. దీంతో ఆయా వస్తువులు పెద్ద బాక్సుల్లో ఆటోమేటిక్‌గా ప్యాక్‌ అవుతాయి. అలా ప్యాక్‌ అయిన వాటిని మళ్లీ ఓపెన్‌ చేయడం కుదరదు. కనుక వాటిని అలాగే పంపిస్తారు.

3. ఈ-కామర్స్‌ సంస్థలు ఐటమ్స్‌ను డెలివరీ చేసేందుకు ఉపయోగించే బాక్సులను బయటి సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చి తయారు చేయించుకుంటాయి. అయితే నేటి తరుణంలో చిన్న బాక్సుల ఉత్పత్తి అంతగా లేదు. కేవలం పెద్ద బాక్సులనే ఎక్కువగా కాంట్రాక్టు సంస్థలు తయారు చేస్తున్నాయి. దీంతో పెద్ద బాక్సులనే చిన్న వస్తువులకు వాడాల్సి వస్తోంది.

4. సాధారణంగా వస్తువులను రవాణా చేసే ట్రక్కుల్లో ట్రాన్స్‌పోర్టు వారు ఖాళీలు అస్సలు ఉంచరు. అలా ఉంచితే ఒక వస్తువు మీద మరొక వస్తువు పడి అవి డ్యామేజ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక వీలున్నంత వరకు ట్రక్‌ను పూర్తిగా ప్యాకేజీలతో నింపేస్తారు. అయితే అలా నింపాలంటే పెద్ద బాక్సులు అయితే సౌకర్యంగా ఉంటుంది. కనుక చిన్న వస్తువులను కూడా పెద్ద బాక్సుల్లో పెట్టి ప్యాక్‌ చేస్తారు. ఆ పెద్ద బాక్సులను ట్రక్కుల్లో మొత్తం నింపుతారు. దీంతో ట్రక్కులు నిండి వస్తువులు లోపల ఒకదానిపై ఒకటి పడిపోకుండా ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top