ఆ గ్రామంలో బాలింత‌లైతే 3 నెలలు ఊరి బ‌య‌టే ఉండాలి. అమానుష‌మైన ఆచారం పాటిస్తున్నారు వారు.

మ‌నం టెక్నాల‌జీ ప‌రంగా అనేక అంశాల్లో ముందుకు దూసుకెళ్తున్నాం. అభివృద్ధిలో అగ్ర‌రాజ్యాల‌తో పోటీ ప‌డుతున్నాం. అయిన‌ప్ప‌టికీ మ‌న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్ప‌టికీ కొన్ని సాంఘిక దురాచారాలు, మూఢ న‌మ్మ‌కాల‌నే జాడ్యాలు ప్ర‌జ‌ల‌ను ప‌ట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా ఇలాంటి ఆచారాల‌ను పాటించే ప్ర‌జ‌ల గురించే. అయితే వారు ఎక్క‌డో అడ‌వుల్లో లేరు. జ‌నావాసాల మ‌ధ్య‌నే ఉంటున్నారు. కానీ వారు పాటిస్తున్న ఆచారాలు మాత్రం ఆ వ‌ర్గానికి చెందిన యువ‌తులకు, మ‌హిళ‌లకు ప్రాణ సంక‌టంగా మారాయి. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

అది అనంతపురం జిల్లా రొల్ల మండలం గంతగొల్లహట్టి గ్రామం. అక్క‌డ దాదాపుగా 120 నివాసాలుంటాయి. ఆ గ్రామంలో ఊరుగొల్ల, కాడుగొల్ల అనే రెండు కులాలున్నాయి. అందులో కాడుగొల్ల కులంలో ఉన్న ఆచారాలు మహిళలను మానసికంగా, శారీరకంగా తీవ్ర క్షోభకు గురిచేస్తున్నాయి. ఆ ఊర్లో నెలసరి సమయంలో మహిళలు ఇంటి బయటే ఉండాలి. వారు చ‌దువుకునే అమ్మాయిలు, బాలిక‌లు అయినా స‌రే నెల‌స‌రి వ‌స్తే నెల‌కు 5 రోజుల పాటు ఊరి బ‌య‌టే పొలిమేర‌లో ఉండాలి. అలాగే ప్ర‌స‌వించిన స్త్రీలు 3 నెల‌లు ఊర్లో ఉండ‌కూడ‌దు. ఊరి బ‌య‌ట పొలిమేర‌లోనే ఉండాలి. వీరంద‌రికీ పొలిమేర‌లో నివాసాలుంటాయి. చెప్పుకోవ‌డానికే అవి నివాసాలు కానీ వాటిల్లో సౌక‌ర్యాలు ఏమీ ఉండ‌వు. ఎండకు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ, చ‌లికి వ‌ణ‌కాలి.

అలా బాలికలు, యువ‌తులు, మ‌హిళ‌లు, బాలింత‌లు పొలిమేర‌ల్లోనే ఆయా స‌మ‌యాల్లో ఉండాలి. ఇక వారు అలా ఉన్న‌న్ని రోజులు ఊర్లోకి రాకూడ‌దు. ఆల‌య ప్ర‌వేశం కూడా నిషేధం. చ‌దువుకునే వారు అయితే ఊర్లోకి రాకుండా చుట్టూ 11 కిలోమీట‌ర్లు న‌డిచి స్కూళ్ల‌కు, కాలేజీల‌కు వెళ్లాలి. ఇక వారితో ఊర్లో ఉన్న ఎవ‌రూ మాట్లాడ‌రాదు. తాక‌రాదు. అలా చేస్తే చేసిన వారికి కూడా అదే శిక్ష వేస్తారు. వారు కూడా ఊర్లో ఉండ‌కుండా పొలిమేర‌లో కొన్ని రోజులు ఉండాలి. అలా పొలిమేర‌లో ఉండే మ‌హిళ‌లు అంద‌రూ త‌మ వంట తామే చేసుకోవాలి. త‌మ బ‌ట్ట‌లు తామే ఉతుక్కోవాలి. ఎవ‌రూ స‌హాయం కూడా చేయ‌రాదు. ఇక ఆ నివాసాల్లో క‌రెంటు కూడా ఉండ‌దు. అలాంటి నివాసాల్లో పైన చెప్పిన విధంగా అన్ని రోజుల పాటు ఉన్నాక చివ‌ర‌కు ఆల‌యంలో పూజ చేసి వారు మ‌ళ్లీ గ్రామంలోకి వెళ్తారు. అంత‌టి అమానుష‌మైన ఆచారాన్ని ఆ గ్రామ వాసులు ఇప్ప‌టికీ పాటిస్తున్నారంటే.. నిజంగా వారినేమ‌నుకోవాలి..!

ఆ గ్రామంలో ఇలా ఇప్ప‌టికీ దురాచారాల‌ను పాటిస్తున్నా అక్క‌డి అధికారులు మాత్రం ఆ దురాచారాల‌ను మాపే దిశ‌గా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని స‌ద‌రు బాధిత మ‌హిళలు చెబుతున్నారు. త‌మ పెద్ద‌ల నుంచి వ‌స్తున్న ఆచారం క‌నుక తాము ఎదురు తిర‌గలేక‌పోతున్నామ‌ని, అలా చేస్తే త‌మ‌కే న‌ష్టం క‌నుక ఆ ఆచారాన్ని పాటిస్తున్నామ‌ని ఆ మ‌హిళ‌లు అంటున్నారు. త‌మ‌పై ప్ర‌భుత్వం ద‌య చూపించి త‌మ‌కు ఊరిపొలిమేర‌ల్లో ఉండేందుకు నివాసాలు ఏర్పాటు చేయాలని, వాటిల్లో సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని వారు వేడుకుంటున్నారు.

ఆ గ్రామ వాసుల‌ది నిజానికి హిందూ మతమే. వారు. ఎత్తప్ప స్వామి, చిక్కన్న స్వామి అనే దేవ‌త‌లను ఎక్కువగా పూజిస్తారు. గంతగొల్లహట్టి గ్రామంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ పూజారి ఎప్పుడూ చెప్పులు వేసుకోరు. ఎంతదూరమైనా కాలినడకనే వెళ్తారు కానీ బస్సు, బైకు, కారు ఏవీ ఎక్కరు. ఇక ఆలయంలో కేవ‌లం మ‌గ‌వారు మాత్ర‌మే పూజ‌లు చేస్తారు. బీసీ-డీ వర్గానికి చెందిన కాడుగొల్ల కులస్థులు అనంతపురం జిల్లాలోని రొల్ల, మడకశిర, గుడిబండ, అమరాపురం, అగలి మండలాల్లో దాదాపు 40 వేల మంది ఉంటారని స‌మాచారం. కాగా ఈ కులస్థులంతా ఈ ఆచారం పాటిస్తార‌ట‌. కాడు గొల్ల కులస్థుల ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. మగవాళ్లు ఏడాదిలో 5 నెలలు మాత్రమే గ్రామంలో ఉంటారు. మిగతా 7 నెలలు స్థానికంగా గొర్రెలకు మేత దొరక్క కర్ణాటక వెళ్తారు. గంతగొల్లహట్టి గ్రామంలో గడచిన ఐదారేళ్ల నుంచే పిల్లలు బడికి వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. ఇక్కడ 16, 17 ఏళ్లకే బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండక ముందే పెళ్లై, తల్లులైన వారు ఈ ఊరిలో క‌నిపిస్తుంటారు. ఏది ఏమైనా.. నిజంగా ఆ గ్రామ మ‌హిళ‌లు ప‌డుతున్న వేద‌న అంతా ఇంతా కాదు. ఇక‌నైనా వారి బ‌తుకుల్లో మార్పు క‌ల‌గాల‌ని ఆశిద్దాం.

 

Comments

comments

Share this post

scroll to top