వైజాగ్ తీరం: అల్ల‌క‌ల్లోలంగా మారిన స‌ముద్రం.. భారీగా దూసుకు వ‌స్తున్న రాకాసి అల‌లు..!

ప్ర‌కృతికి కోపం వ‌చ్చిన‌ప్పుడల్లా జ‌నాలు భ‌య‌ప‌డాల్సిన పరిస్థితి ప్ర‌స్తుతం మ‌న దేశంలో కొన్ని ప్రాంతాల్లో నెల‌కొని ఉంది. మ‌రీ ముఖ్యంగా స‌ముద్ర తీర ప్రాంతాన ఉంటున్న వారు అయితే ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి వ‌స్తుందోన‌ని బిక్కు బిక్కుమంటూ కాలం గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వారిని రాకాసి అల‌లు భ‌య‌పెడుతున్నాయి. ఆఫ్రికాలో ప్ర‌చండ‌మైన గాలులు వీయ‌డం వ‌ల్ల అక్క‌డ స‌ముద్రంలో భారీ ఎత్తున అల‌లు ఏర్ప‌డ్డాయి. అవిప్పుడు మ‌న దేశానికి వ‌చ్చేశాయి. ద‌క్షిణ భార‌త దేశంలో స‌ముద్ర తీర ప్రాంతాల‌కు ఆ రాకాసి అల‌లు ఇప్ప‌టికే చేరుకుని జ‌నాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి.

ఆఫ్రికాలో ఏర్ప‌డిన ప్ర‌త్యేక వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల్ల ద‌క్షిణ భార‌త దేశంలో తీర ప్రాంతాల్లో ఉండే ప్ర‌జ‌లు జంకుతున్నారు. ఆ ప్రాంతాల్లో బ‌ల‌మైన గాల‌లు స‌ముద్రంపై వీస్తుండ‌డంతో అలలు పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డుతున్నాయి. సుమారుగా 50 నుంచి 70 అడుగుల వ‌ర‌కు స‌ముద్రం ముందుకు వ‌చ్చింది. దీనిపై ఇప్ప‌టికే సునామీ హెచ్చ‌రిక‌ల సంస్థ ఇన్‌కాయిస్ వివ‌రాల‌ను తెలియ‌జేసి ఆయా రాష్ట్ర తీర ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో మూడు రోజుల పాటు స‌ముద్రం అల్ల‌కల్లోలంగా ఉండ‌నుంది. ఈ క్ర‌మంలో స‌ముద్రంలో భారీగా అల‌లు ఎగ‌సిప‌డ‌నున్నాయి. త‌మిళ‌నాడు, ఏపీ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో స‌ముద్రం ఇప్ప‌టికే అల్ల‌క‌ల్లోలంగా మారింది.

అండ‌మాన్ నుంచి భార‌త తీరం వైపుకు భారీ అల‌లు కూడా దూసుకువ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏర్ప‌డుతున్న గాలుల వేగం గంట‌కు 100 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఉంది. దీని ప్ర‌భావం కార‌ణంగా స‌ముద్రంలో అల‌లు 3 నుంచి 4 మీట‌ర్ల ఎత్తు వ‌రకు ఎగ‌సిప‌డుతున్నాయి. గాలులు తీరానికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చే స‌మ‌యంలో అల‌లు మ‌రింత ఉధృతంగా ఉండ‌నున్నాయి. దీంతో తీర‌ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. కాగా తీరంలో లోత‌ట్టు ప్రాంతాల్లోకి కూడా స‌ముద్ర‌పు అలలు చొచ్చుకు వ‌స్తాయ‌ని క‌నుక ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెబుతున్నారు. అలాంటి ప్ర‌దేశాల్లో ఉండేవారు సుర‌క్షిత ప్రాంతాలకు వెళితే మంచిద‌ని ఇన్‌కాయిస్ సూచించింది.

స‌ముద్ర తీర ప్రాంతాలు అల్ల‌క‌ల్లోలంగా ఉన్నందున ప్ర‌జ‌లెవ‌రూ స‌ముద్ర స్నానాల‌కు వెళ్ల‌రాద‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక మ‌త్స్య‌కారులు కూడా చేప‌ల వేట‌కు వెళ్ల‌రాద‌ని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ , మహారాష్ట్రపై ఈ అలల ఉద్ధృతి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశముంది. కాగా ఇప్పటికే అలలు పశ్చిమ తీరంలోని చాలా ప్రాంతాలను తాక‌గా మ‌రోవైపు అరేబియా సముద్రంలోని ఆయా ప్రాంతాల్లోనూ నాలుగు నుంచి ఐదు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక తీర‌ప్రాంతాల్లో ఉండే వారు మ‌రో రెండు, మూడు రోజుల పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top