ఎన్నో ఏళ్లుగా విమానయాన రంగంలో విశిష్ట సేవలందిస్తున్న ఎయిరిండియా సంక్షోభం దిశగా సాగుతోంది. 50 వేల కోట్లకు పైగా అప్పులు మిగిలాయి. వీటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతోంది. రుణాల వాయిదాలు తీర్చేందుకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. కేంద్రంలో కొలువు తీరే కొత్త ప్రభుత్వమే దీనిని పరిష్కరించాలి. అంత వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా విమానాలు ఎగరకుండానే ఉండి పోయాయి. పాత వాటికి మరమ్మతులు చేయాలంటే కనీసం ఎయిరిండియాకు తక్షణమే 1500 కోట్లపైనే కావాల్సి ఉంటుంది. ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ పీకలలోతు కష్టాల్లో ఉండి పోయింది. ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. వేలాది మంది సిబ్బంది, ఉద్యోగులు రోడ్డు పాలయ్యారు.
దీనిని కొనుగోలు చేసేందుకు టాటా అధినేత రతన్ టాటా ముందుకు వచ్చినా..ఎందుకనో వెనక్కి తగ్గారు. ప్రభుత్వ ఆధీనంలో ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎయిరిండియా కోట్లాది రూపాయల అప్పుల్లోకి చేరింది. రోజుకో గండాన్ని ఎదుర్కొంటోంది ఎయిరిండియా. అప్పుల పాలైన ఈ సంస్థకు ప్రభుత్వమే అడపా దడపా డబ్బులు సర్దుతోంది. ఈసారి ముందస్తు ఎన్నికలు రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన వాయిదాలు నిలిచి పోయాయి. దీంతో విమానాలు నడపడం ఇబ్బందిగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా 9 వేల కోట్ల రుణంతో ప్రారంభించింది. వీటిని తీర్చేందుకు ఈ సంస్థ వద్ద ఒక్క పైసా లేదు. ప్రభుత్వం మరోసారి గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పా ఈ సమస్య నుండి గట్టెక్కే పరిస్థితి దరిదాపుల్లో కనిపించడం లేదు. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఎయిరిండియా స్థితిగతులను కేంద్ర ఆర్థిక శాఖకు వివరించింది.
ఎట్టి పరిస్థితుల్లోను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించేలా చేయాలని చూస్తోంది. 127 విమానాలు ఉండగా 20 విమానాలు ఎగరడం లేదు. ఇంజన్లలో సమస్యలు నెలకొనడంతో కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. వీటిని రిపేర్ చేసేందుకు కనీసం డబ్బులు కూడా లేక పోవడం గమనార్హం. జెట్ ఎయిర్ వేస్ తరహాలోనే..ఈ కంపెనీ కూడా భారీ నష్టాలను చవి చూస్తోంది. పాకిస్తాన్ తన ఆకాశ మార్గాన్ని మూసి వేయడంతో ఐరోపా, అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానాలకు రోజుకు 6 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. దీంతో కొన్ని విమానాలను రద్దు చేసింది. ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడంతో ఎయిరిండియా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. త్వరలో కొలువు తీరే సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది దీని భవిష్యత్.
బీజేపీ అధికారంలోకి వస్తే ఎయిరిండియాను 100 శాతం వాటాను విక్రయించే అవకాశాలు ఉండగా..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది తీసుకునే నిర్ణయంపై ఆధారడి ఉంటుందని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 54 వేల కోట్ల అప్పులకు ప్రతి ఏటా ఎయిరిండియా 4 వేల 400 కోట్లు వడ్డీ రూపేణా చెల్లిస్తోంది. దీనిలో 2 వేల 700 కోట్లు ప్రభుత్వమే చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నారు. రోజు రోజుకు భారంగా తయారైన ఈ వ్యవహారాన్ని త్వరగా తేల్చేందుకు కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టక పోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. యుపిఏ హయాంలో ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్‌ను విలీనం చేయాలన్న నిర్ణయం వల్లనే ఎయిరిండియా ఈ స్థితికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎయిరిండియా సంస్థ వాటాలను విక్రయించాలని ప్రయత్నించినా ఏ ఒక్కరు దీనిని కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.