ఎయిడ్స్ వ్యాధి క‌న్నా ఓ సుఖ‌వ్యాధి ఇప్పుడు బాగా వ్యాపిస్తున్న‌ద‌ట‌. జాగ్ర‌త్త‌. అదేమిటో తెలుసా..?

వైద్య రంగంలో ఎన్నో ర‌కాల వ్యాధుల‌కు కొత్త కొత్త మందుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు క‌నిపెడుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆ మందుల ప్ర‌భావం రాను రాను త‌గ్గిపోతూనే ఉంది. దీంతో ఆయా వ్యాధుల‌కు గాను కొత్త మందుల‌ను త‌యారు చేయ‌డం వైద్యుల‌కు స‌వాల్‌గానే మారుతోంది. గ‌నేరియా అనే ఓ సెగ వ్యాధికి కూడా మందులను త‌యారు చేయ‌డం ఇప్పుడు చాలా క‌ష్టంగా మారింది. ఎందుకంటే ఈ వ్యాధి కోసం ప్ర‌స్తుతం ఇస్తున్న మందులు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేద‌ట‌. అందుక‌నే దీని బారిన ప‌డి అనేక మంది ఇప్పుడు ప్రాణాల‌ను కోల్పోతున్న‌ట్లు వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

గ‌నేరియా అనే సెగ‌వ్యాధి ఒక‌ర‌క‌మైన అంటు వ్యాధి. సుర‌క్షిత‌మైన శృంగారం లేక‌పోవ‌డం వ‌ల్ల‌, ఆ వ్యాధి ఉన్న‌వారితో సేఫ్‌గా శృంగారంలో పాల్గొన‌క‌పోవ‌డం వ‌ల్ల ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ‌స్తుంది. ఈ వ్యాధి రావ‌డానికి నిసీరియా గొనోరియా అనే బాక్టీరియా కార‌ణం. అమెరికా వాసుల‌కు ఈ వ్యాధి ఎక్కువ‌గా వ‌స్తుంద‌ట‌. సెక్స్ లో పాల్గొన్న 2 నుంచి 5 రోజుల్లో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి, మూత్ర మార్గం నుంచి చీము, స్త్రీలల్లో తెల్లమైల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిరోజుల తర్వాత మూత్రం నిలిచిపోవటం, మూత్రమార్గం సన్నబడి కుంచించుకుపోవటం, మూత్ర మార్గానికి రంధ్రం పడి దానిలోంచి మూత్ర విసర్జన కావటం వంటి సమస్యలు ముంచుకొస్తాయి. పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలల్లో ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం లాంటి సమస్యలూ రావొచ్చు. ఈ బ్యాక్టీరియా కీళ్లు, గుండె, కళ్ల వంటి భాగాలకూ చేరితే రకరకాల సమస్యలు మొదలవుతాయి. స్త్రీలల్లో పొత్తికడుపు నొప్పి, తెల్లమైల అధికం కావటం, నెలసరి క్రమం తప్పిపోవటం, నడుము నొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి.

ఎయిడ్స్ వ్యాధి ఒక‌సారి వ‌స్తే ఇక న‌యం కాద‌ని తెలిసిందే. అయితే ఇప్పుడు గ‌నేరియా కూడా అలాగే మారుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి కోసం ఇస్తున్న యాంటీ బ‌యోటిక్ మందులు ఏమాత్రం ప‌నిచేయ‌డం లేద‌ట‌. ఆ మందుల‌కు కూడా బాక్టీరియా త‌ట్టుకుని నిల‌బ‌డుతుంద‌ని, దీంతో ఆ బాక్టీరియా సూప‌ర్ బ‌గ్‌గా మారింద‌ని, దాన్ని నాశ‌నం చేయ‌డం క‌ష్టంగా మారింద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌నేరియా కోసం ఇప్పుడు ఇస్తున్న మందులు ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌నేరియా బాధితులు పెరుగుతుండ‌గా ఈ వ్యాధి ప‌ట్ల వైద్య ప్ర‌పంచం ఆందోళ‌న చెందుతోంది. కానీ దీని గురించి ఇంకా చాలా మందికి తెలియ‌డం లేదు. అది విచారించద‌గిన విష‌యం.

ఏటా అనేక కోట్ల మందికి గ‌నేరియా వ్యాధి సోకుతూ ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చ‌రిస్తోంది. మార్కెట్‌లో ఉన్న అన్ని మందుల‌కు గ‌నేరియా బాక్టీరియా లొంగ‌డం లేద‌ట‌. మందుల‌ను కూడా హ‌రాయించుకునే స్థితికి ఆ బాక్టీరియా చేరింద‌ట‌. దీంతో ఇప్పుడు ఉన్న మందులు గ‌నేరియాకు ప‌నిచేయ‌డం లేదు. ఇక కొత్త మందులు కూడా ఇంకా ప్ర‌యోగ ద‌శ‌లోనే ఉన్నాయి. అవి ఇప్పుడ‌ప్పుడే మార్కెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. ప‌రిస్థితి ఇలా ఉంటే ఇక గ‌నేరియా వ‌చ్చిన వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు.

గ‌నేరియా గురించిన ఓ వార్త కూడా ఈ మ‌ధ్యే తెలిసినా దీన్ని ఏ మీడియా చాన‌ల్‌, వార్త ప‌త్రిక కూడా ప్ర‌సారం చేయ‌లేదు, ప్ర‌చురించ లేదు. అదేమిటంటే… హైద‌రాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ సైంటిస్టులతో క‌లిసి పూణెలోని జాతీయ ఎయిడ్స్ ప‌రిశోధ‌న సంస్థ తాజాగా ఓ ప్ర‌యోగం చేసింది. ఈ ప్ర‌యోగంలో భాగంగా ఢిల్లీ, పూణె, ముంబై, హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని అనేక మంది గ‌నేరియా రోగుల‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. దీంతో తెలిసిందేమిటంటే… ఆ రోగుల్లో 124 మందిలో యాంటీ బ‌యోటిక్ మందుల‌కు సైతం లొంగ‌ని విధంగా బాక్టీరియా రోగ నిరోధ‌కత‌ను పెంచుకున్నాయ‌ట‌. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌యం. కానీ దీనిపై మ‌న మీడియా ఏమీ చెప్ప‌డం లేదు.

గ‌నేరియా బాక్టీరియా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం వ‌ల్ల మొద‌టి త‌రం యాంటీ బ‌యోటిక్స్ అయితే దాదాపుగా ప‌నిచేయ‌డం లేదు. సిప్రోఫోక్సాసిన్‌కు 98 శాతం, పెన్సిలిన్‌కు 52 శాతం, టెట్రాసైక్లిన్‌కు 56 శాతం, అజిత్రోమైసిన్‌కు 5 శాతం ఐసోలేట్లు లొంగడం లేదు. ఇలా చివరకు స్పెక్టినోమైసిన్, సెఫ్ట్రియాగ్జోన్, సెఫిగ్జయిమ్ వీటికీ లొంగకుండా మారిపోతున్నాయి. నిజానికి రెండు దశాబ్దాలుగా ఈ వ్యాధి విస్తరిస్తున్నది. గతంలో యాంటీ బయాటిక్స్ బలంగా పనిచేసిన దశలో ఈ వ్యాధిని డాక్టర్లు నయం చేసేవారు, మరి ఇప్పుడు ? సెఫ్ట్రియాగ్జోన్, సెఫిగ్జయిమ్‌కు కూడా లొంగడం లేదంటే మరి ఇంకా పవర్ ఫుల్ యాంటీ బయాటిక్ కావాలి. కానీ మూడు రకాలు ఇప్పుడు ప్రయోగదశలో ఉన్నాయి. అవి ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తాయో తెలియదు. మ‌నం ఎడాపెడా యాంటీ బయాటిక్స్ వాడేయడం వల్ల వచ్చిన దుస్థితి ఇది. మరిప్పుడు ఈ వ్యాధి త‌గ్గేందుకు మార్గం లేదా ? అంటే.. ఉంది.. అది సుర‌క్షిత‌మైన శృంగారం. అలా చేయ‌క‌పోతే చివ‌ర‌కు అనేక వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. దాంతో ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. క‌నుక ఈ వ్యాధి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top