రూ.370 దొంగ‌త‌నం చేసిన వ్య‌క్తుల‌కు 5 ఏళ్ల జైలు శిక్ష వేశారు న్యాయ‌మూర్తులు..!

అవును. అత‌నికి న్యాయం జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు… 29 ఏళ్ల త‌రువాత అత‌నికి న్యాయం జరిగేలా చేశారు న్యాయ‌మూర్తులు. ఆ వ్య‌క్తి వ‌ద్ద నుంచి ముగ్గురు వ్య‌క్తులు 29 ఏళ్ల కింద‌ట రూ.370 దొంగిలించారు. అప్పుడు వారిపై కేసు న‌మోదైంది. అయితే చాలా సంవ‌త్స‌రాల విచార‌ణ‌, వాయిదాల అనంత‌రం ఈ కేసులో తీర్పునిచ్చారు న్యాయ‌మూర్తులు. నిజంగా మ‌న దేశంలో చాలా సుదీర్ఘ‌కాలం పాటు కోర్టులో ఉన్న కేసు ఇదే అనుకుంటా. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అత‌ని పేరు వాజిద్ హుస్సేన్‌. షాజ‌హాన్ పూర్ నుంచి పంజాబ్‌కు ట్రెయిన్‌లో వెళ్తున్నాడు. అదే ట్రెయిన్‌లో అత‌ను ఉన్న కంపార్ట్‌మెంట్‌లోనే చంద్ర‌పాల్‌, క‌న్హ‌య్య లాల్‌, స‌ర్వేష్ అనే ముగ్గురు వ్య‌క్తులు కూడా ప్ర‌యాణిస్తున్నారు. అయితే వీరు ముగ్గురూ క‌లిసి టీ లో మ‌త్తుమందు క‌లిపి దాన్ని హుస్సేన్‌కు ఇచ్చారు. దీంతో ఆ విషయం తెలియని హుస్సేన్ ఆ టీ తాగాడు. అనంత‌రం స్పృహ కోల్పోయాడు. ఇంకేముందీ… అత‌ని చొక్కా, ప్యాంటు జేబుల్లో ఉన్న మొత్తం రూ.370ల‌ను వారు దొంగిలించి ఆ ట్రెయిన్ నుంచి ఉడాయించారు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది 1988వ సంవ‌త్స‌రం జూలై 18వ తేదీన‌.

కాగా సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత మెళ‌కువ వ‌చ్చే స‌రికి త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును ఆ ముగ్గురు వ్య‌క్తులు దొంగిలించార‌ని తెలుసుకున్న హుస్సేన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. నిందితులు దొరికారు కూడా. అయితే ఈ కేసు విచార‌ణ చాలా సుదీర్ఘంగా సాగింది. 29 ఏళ్ల పాటు కేసును విచారించారు. మ‌ధ్య‌లో అనేక వాయిదాలు వ‌చ్చాయి. ఈ క్రమంలో 2012లో హుస్సేన్ కోర్టుకు హాజ‌రు కాగా అప్పుడు న్యాయ‌మూర్తులు తీర్పుచెప్పారు. స‌ద‌రు ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ముగ్గురు వ్య‌క్తుల‌కు రూ.10వేల జ‌రిమానాతోపాటు 5 ఏళ్ల జైలు శిక్ష వేశారు. అయితే ఆ ముగ్గురిలో ఇద్ద‌రు మాత్ర‌మే ఇప్పుడు బ‌తికి ఉన్నారు. వారు లాల్, స‌ర్వేష్‌లు. చంద్ర‌పాల్ ఎప్పుడో చ‌నిపోయాడు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రూ త‌మ 60వ ప‌డిలో ఉన్నారు. ప్ర‌స్తుతం వీరికి సంతానం క‌ల‌గ్గా వారికి పెళ్లిళ్లై వారికి కూడా సంతానం ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు వీరికి జైలు శిక్ష ప‌డ‌డం అంద‌రినీ విస్మ‌యానికి లోను చేసింది. ఏది ఏమైనా ఇంత సుదీర్ఘ కాలం పాటు కేసు విచార‌ణ సాగినందుకు మ‌నం చింతించాల్సిందే. ఇప్ప‌టికే ఎన్నో కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్న నేప‌థ్యంలో ఇక‌నైనా ప్ర‌భుత్వం ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటే బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రుగుతుంది. లేదంటే ఇదిగో.. పైన కేసులో జ‌రిగింది క‌దా… అలాగే అవుతుంది..!

Comments

comments

Share this post

scroll to top