మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయని తెలిసిందే. ఇలాంటి ఆలయాల్లో పాటించే ఆచారాలు, వ్యవహారాలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని ఆలయాల్లోకి స్త్రీలను అనుమతించరు. ఇక కొన్నింటిలోకి పురుషులను అనుమతించరు. ఇప్పుడు మేం చెప్పబోతున్న ఆలయం కూడా ఇలాంటిదే. అందులోకి గత 400 సంవత్సరాలుగా పురుషులు వెళ్లలేదు. కానీ ఇటీవలే స్థానికులు తమ ఆచారాన్ని పక్కన పెట్టారు. దీంతో ఎట్టకేలకు 400 ఏళ్ల తరువాత ఆ ఆలయంలోకి పురుషులు వెళ్లారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని సతాభ్యా అనే గ్రామంలో పంచువారాహి దేవత ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం ఉందని స్థానికుల నమ్మకం. ఈ ఆళయంలో పురుషులకు అనుమతి లేదు. వివాహితులైన ఐదుగురు దళిత మహిళలు ప్రతి రోజూ ఆలయంలో నిత్య శుద్ధి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా బంగాళాఖాతంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో సముద్రం ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఒడిశా విపత్తు నిర్వహణల శాఖ, ప్రపంచబ్యాంకులు సంయుక్తంగా ఓడీఆర్పీ పేరుతో పునరావాస కార్యక్రమాలను చేపట్టాయి. ఈ క్రమంలోనే సతాభ్యా గ్రామాన్ని తరలించాయి.
అయితే తమ గ్రామాన్ని ఇంతకాలం పాటు రక్షించిన పంచువారాహి దేవాలయాన్ని కూడా తరలించాలని సతాభ్యా గ్రామస్తులు నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగానే సతాభ్యా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే బాగాపాటియా అనే గ్రామంలో అక్కడి అధికారుల సాయంతో గ్రామస్థులు కొత్త ఆలయం నిర్మించుకున్నారు. కానీ, దేవాలయంలో ఉన్న ఐదు విగ్రహలను తరలించడం మహిళలకు కష్టంగా మారింది. ఎందుకంటే ఆలయంలో ఉన్న ఐదు భారీ రాతి విగ్రహాలు ఒక్కొక్కటి టన్నున్నర బరువు ఉన్నాయి. దీంతో వాళ్లు పురుషుల సాయం తీసుకోక తప్పలేదు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20వ తేదీన ఐదుగురు వ్యక్తుల సాయంతో విగ్రహాలను తొలగించి.. పడవ ప్రయాణం ద్వారా కొత్త ఆలయానికి తరలించారు. అనంతరం శుద్ధి కార్యక్రమం నిర్వహించి కొత్తగా నిర్మించిన ఆలయంలో పూజలు చేశారు. అయితే ఎట్టకేలకు 400 ఏళ్ళ తర్వాత ఈ ఆలయంలోకి విగ్రహాల తరలింపు కారణంగా పురుషులకు ప్రవేశం లభించడం విశేషమే కదా..!