17 ఏళ్ల తరువాత భారత్‌కు మరోసారి మిస్‌ వరల్డ్‌ టైటిల్‌…సాధించిన “మనుషి” గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

1966 రియెటా ఫరియా… 1994 ఐశ్వర్యారాయ్‌… 1997 డయానా హేడెన్‌… 1999 యుక్తాముఖి… 2000 ప్రియాంకా చోప్రా… ఏంటీ ఈ లిస్ట్‌ అని ఆశ్చర్యపోతున్నారా ? ఏమీ లేదండీ.. ఈ పేర్లన్నీ చూస్తే మీకు ఈ పాటికే ఓ విషయం అర్థమైపోయి ఉండాలే ? అవును, మీరు గెస్‌ చేసింది కరెక్టే. వీరు ఆయా సంవత్సరాల్లో ఎంపిక కాబడిన మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ విన్నర్స్‌. తెలిసింది కదా.. మొత్తం ఇప్పటి వరకు కేవలం 5 మంది భారతీయ యువతులకు మాత్రమే ఇప్పటి వరకు మిస్‌ వరల్డ్‌ టైటిల్స్‌ వచ్చాయి. చివరి సారిగా 2000వ సంవత్సరంలో ప్రియాంకా చోప్రాను ఆ అదృష్టం వరించింది. అయితే తాజాగా ఇప్పుడు.. అంటే ఏకంగా 17 ఏళ్ల తరువాత మళ్లీ ఆ అదృష్టం ఓ భారతీయ యువతికి దక్కింది. ఆమే.. మనుషి చిల్లర్‌.

మనుషి చిల్లర్‌ హర్యానా వాసి. వయస్సు 20 సంవత్సరాలు. మెడికల్‌ స్టూడెంట్‌. అనుకోకుండా మోడలింగ్‌ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో భాగంగానే ఈ ఏడాదికి గాను మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ను సాధించింది. మొత్తం ప్రపంచ దేశాల నుంచి 108 మంది సుందరీమణులు పోటీ పడగా వారందరినీ దాటుకుంటూ వచ్చి మనుషి చిల్లర్‌ ఈ ఘనత సాధించింది. 17 ఏళ్ల తరువాత భారత్‌కు మిస్‌ వరల్డ్‌ కిరీటం తెచ్చి పెట్టింది. అయితే చైనాలోని సన్యాలో జరిగిన ఫైనల్‌ పోటీల్లో జడ్జిలు ఆమెను ఏ ప్రశ్న అడిగారో తెలుసా ? ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం చేసే వారికి అత్యధికంగా జీతం దక్కుతుంది ? అని జడ్జిలు అడిగారు.

అందుకు మనుషి బదులిస్తూ.. తన దృష్టిలో అత్యంత ఎక్కువ జీతం తీసుకోవడానికి ఒక అమ్మకు తప్ప ఎవరికీ అర్హత లేదు. ఎందుకంటే అమ్మ పుట్టినప్పటి నుంచి మనల్ని జాగ్రత్తగా పెంచుతుంది. కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఆకలేస్తే అడక్కుండానే అన్నం పెడుతుంది. పిల్లలకు బాధ కలిగితే తానే బాధ పడుతుంది. అలాంటి అమ్మకే అత్యధిక జీతం దక్కే అర్హత ఉంటుంది. అని మనుషి చెప్పింది. దీంతో జడ్జిలు ఆమె మాటలకు ఫిదా అయ్యారు. మిస్‌ వరల్డ్‌ 2017 టైటిల్‌ను ప్రధానం చేశారు. దీంతో మిస్‌ వరల్డ్‌ సాధించిన 6వ భారతీయ యువతిగా మనుషి చిల్లర్‌ పేరుగాంచింది. ఇక ఈ టైటిల్‌కు గాను మొదటి రన్నరప్‌ (2వ స్థానం)గా మిస్‌ మెక్సికో నిలవగా, రెండో రన్నరప్‌ (3వ స్థానం)గా మిస్‌ ఇంగ్లండ్‌ నిలిచింది. ఈ శుభ సందర్భంలో మిస్‌ వరల్డ్‌ 2017 అయిన మనుషి చిల్లర్‌కు కంగ్రాట్స్‌ చెబుదామా !

Comments

comments

Share this post

scroll to top