ఆ “జియో” బంపర్ ఆఫర్ ఫేక్..! న‌మ్మి ఆర్డ‌ర్ చేయాల‌ని చూస్తే మీ న‌గ‌దు మాయం అవుతుంది జాగ్ర‌త్త‌..!

భార‌తీయ టెలికాం మార్కెట్‌లోకి సంచ‌ల‌నంలా దూసుకువ‌చ్చిన జియో హ‌వా ఇంకా కొన‌సాగుతూనే ఉంది. టెలికాం రంగంలో జియో దిన దినాభివృద్ధి చెందుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్న జియో దూకుడు ఇప్ప‌ట్లో త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే టెలికాం రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న జియో ఇక‌పై డీటీహెచ్ సేవ‌ల‌ను కూడా అందిస్తుంద‌న్న వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సేవ‌లపై ఇంకా జియో అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ వాటిని ఆరంభించేందుకు తెర వెనుక భారీగానే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని హ్యాక‌ర్లు రెచ్చిపోతున్నారు.

జియో డీటీహెచ్ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త‌ల‌ను మ‌నం నిత్యం మీడియాలో తెలుసుకుంటూనే ఉన్నాం. సోష‌ల్ మీడియాలో అయితే ఈ పుకార్లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జియో డీటీహెచ్ కు వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో ఉంచుకుని దాంతో కొంద‌రు మోస‌గాళ్లు ప్ర‌జ‌ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న డ‌బ్బును దోచుకుంటున్నారు. తాజాగా జియో డీటీహెచ్ పేరుతో జరుగుతోన్న మరో మోసాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం “JIO PHONE & DTH Rs. 10 only, for lifetime free channels register now offer for 1st 1000 customers avail this offer http://jiodevices.online/ Book now” అంటూ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు ఓ ఎస్ఎంఎస్ విస్తృతంగా వ‌స్తోంది. దీంతో అది నిజ‌మే అని నమ్మేవారు ఆ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో క్రెడిట్‌, డెబిట్ కార్డుల స‌మాచారాన్ని ఎంట‌ర్ చేసి జియో డీటీహెచ్ కొనేందుకు య‌త్నిస్తున్నారు. అలా చేసిన ప‌క్షంలో వారు తెలిపే బ్యాంకు వివ‌రాలు హ్యాక‌ర్ల చేతిలోకి వెళ్తున్నాయి. దీంతో వారు ఆ వివ‌రాల‌తో ప్ర‌జ‌ల బ్యాంకుల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారు. ఇక చివ‌ర‌కు జ‌నాలు తాము మోస‌పోయామ‌ని తెలుసుకుని నెత్తి, నోరు బాదుకుంటున్నారు.

పైన చెప్పిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఎవ‌రైనా పేమెంట్ కోసం య‌త్నిస్తే పేమెంట్ జ‌ర‌గ‌క‌పోగా ఎర్ర‌ర్ మెసేజ్ వ‌స్తుంది. అనంత‌రం వినియోగ‌దారుల బ్యాంక్ వివ‌రాలు హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్తాయి. త‌రువాత వినియోగ‌దారుల బ్యాంక్ అకౌంట్లలో ఉండే సొమ్మును హ్యాక‌ర్లు కాజేస్తారు. ప్ర‌స్తుతం చాలా మందికి ఇలాగే జ‌రుగుతున్నట్లు తెలిసింది. దీంతోపాటు రూ.199 చెల్లిస్తే జియో సిమ్‌ను డోర్ డెలివ‌రీ చేస్తామంటూ క‌నిపించే వెబ్‌సైట్లు కూడా న‌కిలీవే ఉంటున్నాయి. వాటిల్లోనూ ఇలాగే డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా డ‌బ్బులు చెల్లించే వారు మోస‌గింప‌బ‌డుతున్నారు. వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న న‌గ‌దును హ్యాక‌ర్లు కాజేస్తున్నారు. క‌నుక ఇలాంటి వెబ్‌సైట్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి వెబ్‌సైట్లలో బ్యాంకు కార్డుల వివ‌రాల‌ను ఎవ‌రైనా ఎంట‌ర్ చేసి ఉంటే వెంట‌నే కార్డుల‌ను బ్లాక్ చేయాల‌ని, పాస్‌వ‌ర్డ్‌, మొబైల్ నంబ‌ర్లు మార్చుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క‌నుక‌ మీకు కూడా పైన చెప్పిన లాంటి మెసేజ్‌లు వ‌చ్చినా, వెబ్‌సైట్లు క‌నిపించినా వాటిని న‌మ్మ‌కండి. లేదంటే మీ బ్యాంకుల‌లో ఉన్న డ‌బ్బును హ్యాకర్లు కాజేస్తారు జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top