ఆచార్య చాణ‌క్యుడు విద్యార్థుల‌ను ఉద్దేశించి చెప్పిన ముఖ్య విష‌యాలు ఇవే..!

స్త్రీ, పురుషులు, భార్యాభ‌ర్త‌లు, ఉద్యోగులు… ఇలా అనేక మందికి ఉప‌యోగ‌ప‌డే ముఖ్య‌మైన విష‌యాలను ఆచార్య చాణక్యుడు చెప్పాడు క‌దా. వాటిని ఇంత‌కు ముందు క‌థ‌నాల్లో తెలుసుకున్నాం కూడా. ఎవ‌రెవ‌రు ఎలా ఉండాలి, ఎవ‌రు ఎవ‌రితో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, ఉద్యోగులైతే ఆఫీసులో ఎలా ఉండాలి, భర్త భార్య ప‌ట్ల ఎలా ఉండాలి, పురుషుడు స్త్రీతో ఎలా మెలగాలి… వంటి విష‌యాల‌ను ఆచార్య చాణక్యుడు చెప్ప‌గా మ‌నం వాటిని ఇంత‌కు ముందు తెలుసుకున్నాం. అయితే కేవ‌లం వారికే కాదు… చాణ‌క్యుడు విద్యార్థుల‌కు ఉప‌యోప‌డే కొన్ని ముఖ్య‌మైన విష‌యాలను కూడా చెప్పాడు. విద్యార్థిగా ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించ‌డానికి, ల‌క్ష్య సాధ‌న వైపు దూసుకెళ్ల‌డానికి అవి ఎంత‌గానో ప‌నికొస్తాయి. అస‌లే ప‌రీక్ష‌ల కాలం… కొన్ని రోజులైతే ఇక స్టూడెంట్స్ అంతా ప‌రీక్ష‌ల బిజీలో ప‌డిపోతారు. ఈ క్ర‌మంలో చాణ‌క్యుడు చెప్పిన విష‌యాల‌ను విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..!

chanakya

1. విద్యార్థులు త‌మ అందం గురించి అస్స‌లు ప‌ట్టించుకోకూడ‌దు. తాము ఎలా ఉన్నా, ఎవ‌రు ఏం కామెంట్ చేసినా దాని గురించి లోతుగా ఆలోచించుకోకూడ‌దు. ఆ స‌మ‌యాన్ని చ‌దువుకు కేటాయించాలి.

2. అతిగా నిద్ర‌పోకూడ‌దు. అలా చేస్తే సోమ‌రిగా త‌యార‌వుతారు. అది చ‌దువుకు ఆటంకం క‌లిగిస్తుంది. రోజుకు కావ‌ల్సిన‌న్ని గంట‌లు నిద్రిస్తే చాలు. ఎక్కువ అవ‌స‌రం లేదు. దీంతో చ‌దువుల్లో యాక్టివ్‌గా ఉంటారు.

3. కోపం ప‌నికిరాదు. కోపం ఉంటే మ‌న‌స్సుకు శాంతి ఉండ‌దు. శాంతి లేక‌పోతే చ‌దువుపై ఏకాగ్ర‌త కోల్పోతారు. దీంతో చ‌దువుల్లో వెనుక‌బ‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

4. ఇత‌రుల వ‌స్తువుల‌పై ఆశ ప‌డ‌కూడ‌దు. కొంద‌రు త‌మ వ‌స్తువుల‌ను ఆశ చూపి ప్ర‌లోభాల‌కు గురి చేస్తారు. అప్పుడు చ‌దువుకు ఆటంకం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అలా వ‌స్తువుల‌ను ఆశ చూపి కొంద‌రు చ‌ద‌వనీయ‌కుండా చేస్తారు.

5. విద్యార్థినీ విద్యార్థుల‌కు ఒక‌రిపై ఒక‌రికి ఆక‌ర్షణ క‌ల‌గ‌డం స‌హ‌జం. ఆ వ‌యస్సుకు అది కామ‌న్‌. కానీ… ఆ ఆక‌ర్ష‌ణ మోజులో ప‌డ‌కూడ‌దు. అలా ప‌డితే ఇక చ‌దువు ఏమాత్రం అబ్బదు. అది కెరీర్‌ను దారుణంగా దెబ్బ తీస్తుంది.

6. విద్యార్థులు ఎల్ల‌ప్పుడూ కొత్త విష‌యాల‌ను నేర్చుకునేందుకే ప్రాధాన్య‌త‌ను ఇవ్వాలి. ఇత‌రుల‌తో గంటలు గంట‌లు ముచ్చ‌ట్లు పెట్ట‌డం లేదంటే ఇత‌రుల‌ను కించ ప‌రిచేలా అనుక‌రించ‌డం వంటి ప‌నులు మానేయాలి.

7. రోడ్ల‌పై ఏది ప‌డితే అది తిన‌కూడ‌దు. ఇంట్లో వండిన ఆరోగ్య‌వంత‌మైన ఆహారాన్నే తినాలి. దీంతో పోష‌కాహారం స‌రిగ్గా అందుతుంది. చ‌దువుల్లో రాణిస్తారు.

8. నేటి త‌రుణంలో చ‌దువుకు ఎంత ప్రాధాన్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో విద్యార్థులు త‌మ‌కు వ‌చ్చే పాకెట్ మ‌నీని దుబారా ఖ‌ర్చు చేయ‌కుండా దాచి పెట్టుకోవాలి. పొదుపు చేయ‌డం నేర్చుకోవాలి. లేదంటే చ‌దువుకు ప‌నికొచ్చేవి చేయాలి.

Comments

comments

Share this post

scroll to top