యాక్సిడెంట్ అయ్యి రోడ్డుమీద అత‌నుంటే…ర‌క్షించాల్సిందిపోయి మ‌న‌వాళ్ళు ఏం చేశారో తెలుసా?

ఇటీవ‌లే మ‌నం దేశ 70వ స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకున్నాం. స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన ఎంతో మందిని త‌ల‌చుకున్నాం. వారి గొప్ప‌త‌నాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. సంతోషంగా సంబ‌రాలు నిర్వ‌హించుకున్నాం. కానీ తోటి మ‌నుషుల ప‌ట్ల మాన‌వ‌త్వం చూపించ‌డంలో మాత్రం వెనుక‌బ‌డ్డాం. అవును, స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘ‌నంగా జ‌రుపుకుంటున్న‌ప్ప‌టికీ మ‌నం తోటి మ‌నుషుల ప‌ట్ల మాత్రం మాన‌వ‌త్వంగా ఉండ‌డం లేదు. దాన్ని నిరూపిస్తుంది ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఘ‌ట‌న‌. స‌రిగ్గా ఇది స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు అంటే.. ఆగ‌స్టు 15న‌నే అది కూడా దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీలోని క‌శ్మీరీ గేట్ స్టేట్ బ‌స్ ట‌ర్మిన‌స్ ప్రాంతం అది. ఆ రోజు ఆగ‌స్టు 15. సెల‌వు రోజు కావ‌డంతో ర‌ద్దీ కొంచెం త‌క్కువ‌గానే ఉంది. అయిన‌ప్ప‌టికీ జ‌నాలు ఆ ప్రాంతంలో బాగానే ఉంటారు. ఎందుకంటే నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతాల్లో అది కూడా ఒక‌టి. అయితే అదే రోజున సాయంత్రం ఆ రోడ్డులో వెళ్తున్న న‌రేంద్ర కుమార్ అనే వ్య‌క్తిని గుర్తు తెలియని కారు ఒక‌టి ఢీకొట్టింది. దీంతో న‌రేంద్ర కుమార్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌ను రోడ్డుపై ప‌డిపోయాడు.

అయితే గాయాల‌తో రోడ్డుపై ప‌డి ఉన్న న‌రేంద్ర కుమార్‌ను చూసి కూడా ఎవ‌రూ అత‌నికి స‌హాయం చేయ‌లేదు. పోలీసుల‌కు కాల్ చేయ‌డం కానీ, ఆంబులెన్స్‌ను పిల‌వ‌డం గానీ, ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌డం గానీ చేయ‌లేదు. దీంతో అత‌ను 12 గంట‌ల పాటు రోడ్డుపై అలా ప‌డిపోయి ఉన్నాడు. అత‌ని మెడ‌, వెన్నెముక‌, కాలికి తీవ్ర‌గాయాలు కావ‌డంతో అత‌నికి లేచేందుకు శ‌రీరం స‌హ‌క‌రించ‌లేదు. అయితే సాయం చేయ‌క‌పోతే పోయారు క‌నీసం అత‌ని ప‌ట్ల జాలి కూడా ఎవ‌రూ చూపించ‌లేదు. అతని వ‌ద్ద ప్యాంటు జేబులో ఉన్న ప‌ర్సులోని న‌గ‌దును, అత‌ని సెల్‌ఫోన్‌ను కొంద‌రు దొంగిలించుకుపోయారు. కాగా 12 గంట‌ల అనంత‌రం ఆ రోడ్డున వెళ్తున్న ఓ వ్య‌క్తి కొన్ని నీళ్లు ఇచ్చి పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు న‌రేంద్ర‌ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. దీంతో న‌రేంద్ర ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డాడు. చూశారు క‌దా. నిజంగా ఇలాంటి ఘ‌ట‌న‌లే మ‌నుషుల్లో ఉండే మాన‌వ‌త‌ను చాటి చెబుతాయి. దేశ రాజ‌ధాని న‌గ‌రంలోని ప్ర‌జ‌లే మాన‌వ‌త‌ను మ‌రిచి ఇలా ఉన్నారంటే.. ఇక దేశం ఎటు పోతుంద‌ని మ‌నం అర్థం చేసుకోవాలి. సాటి మ‌నిషికి సాయం చేయాల‌నే ఎవ‌రైనా చెబుతారు, కానీ అక్క‌డి వారికి ఆ స్ఫుర‌ణ లేన‌ట్టుంది. పైగా బాధితుడి నుంచి న‌గ‌దు, సెల్‌ఫోన్ దొంగిలించారు. ఇక ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top