సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ అవ‌స‌రం లేద‌ట‌… మ‌రోసారి తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు

గ్యాస్ స‌బ్సిడీ, ఫించ‌న్‌, ఉపాధి హామీ ప‌థ‌కాలు… ఇలా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ‌పెడుతున్న ఏ సంక్షేమ ప‌థ‌కానికైనా ఇప్పుడు ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయింది. దీంతో ఒక‌ప్పుడు చాలా మంది ఆధార్ తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆధార్ కార్డు కోసం ఫొటో దిగేందుకు దేశ‌వ్యాప్తంగా జ‌నాలు ఎంత‌టి ఇబ్బందులు ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే. అయితే ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ ఉప‌యోగించ‌డాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు దాఖ‌లు చేయ‌గా, అప్ప‌ట్లో… అంటే ఆగ‌స్టు 11, 2015న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి కాద‌ని స్ప‌ష్టం చేసింది.

అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వాలు అస్స‌లు పాటించ‌డం లేదు స‌రి క‌దా, ఇంకా అవి ప్ర‌వేశ‌పెడుతున్న కొత్త సంక్షేమ ప‌థ‌కాలకు కూడా ఆధార్‌ను వాడడం మొద‌లుపెట్టాయి. దీంతో ఈ విష‌యంపై సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివన్‌ వాదిస్తూ… ఆధార్‌ తప్పనిసరి కాదు స్వచ్ఛందమేనంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఈ క్ర‌మంలోనే దీనిపై మ‌రోసారి సుప్రీం కోర్టుకు వెళ్ల‌గా, ఆ కోర్టు ఇప్పుడు తాజాగా మ‌రోసారి త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

ప్ర‌భుత్వాలు ప్ర‌వేశ‌పెట్టే ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాల‌కైనా ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాద‌ని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ప్ర‌జ‌లు త‌మ‌కు తాము స్వ‌చ్ఛందంగా వివ‌రాలు ఇస్తే త‌ప్ప ఆధార్ త‌ప్ప‌నిసరి కాద‌ని, ప్ర‌తి పౌరుడికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు చేరాల‌ని తెలియజేసింది. అయితే ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డం, డ్రైవింగ్ లైసెన్సులు, పాన్‌, బ్యాంకులు వంటి సంక్షేమేత‌ర ప‌నుల‌కు ఆధార్ ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ సుప్రీం కోర్టు ఆదేశాలను ప్ర‌భుత్వాలు పాటిస్తాయా..? అన్న‌ది వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top