ఆ వృద్ధుడికి సహాయం చేస్తుంటే.. అతను నా ఛాతిపై చేయి వేశాడు. తరువాత ఏమైందంటే…

అప్పుడు నేను ఇండోర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్నా. ఫ్లైట్‌ లో ప్రయాణం. టిక్కెట్‌ ముందుగానే బుక్‌ చేసుకున్నా. అయినప్పటికీ ఎయిర్‌ పోర్టుకు బాగా ఆలస్యం అయింది. చివరకు గేట్‌ వద్ద నన్ను, మరో అంకుల్‌ను లేట్‌గా వచ్చినందుకు ఫ్లైట్‌లోకి అనుమతించలేదు. చాలా సేపు సిబ్బందితో వాదించా. చివరకు వారు మాకు ఫ్లైట్‌లో వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే ఫ్లైట్‌ ఎక్కేటప్పుడు ఆ అంకుల్‌ కిందపడబోయాడు. చూస్తుంటే బాగా వయస్సు ఉంటుంది. అందుకే మెట్లపై నడవడం ఇబ్బంది అయి ఉంటుందని భావించా. వెంటనే అతనికి సహాయం అందించా. అతని చేయిని నా భుజం మీదుగా వేసుకుని ఆయన్ను మెట్లు ఎక్కించే ప్రయత్నం చేశా.

అలా ఆ అంకుల్‌ను విమానంలోకి మెట్ల ద్వారా ఎక్కిస్తున్నప్పుడు నా భుజంపై అతని చేయి కిందకు పడింది. అది నా వక్షోజాలను తాకింది. పై నుంచి ఎయిర్‌ హోస్టెస్‌ అది చూశారు. అప్పుడు నాకనిపించింది. అనవసరంగా ఆ అంకుల్‌కు సహాయం చేశానని. నన్ను నేను తిట్టుకున్నా.. ఆ అంకుల్‌ అంత నీచుడు అని, అతని వల్ల నాకు అలా జరిగినందుకు తీవ్రంగా విచారిస్తూ లోలోపల కుమిలిపోయా. చివరకు ఫ్లైట్‌ డోర్‌ వద్దకు వచ్చాక, అతన్ని నిర్దాక్షిణ్యంగా ఎయిర్‌ హోస్టెస్‌కు అప్పగించి వెంటనే నా సీట్లోకి వెళ్లి కూర్చున్నా.

ఆ సంఘటన తరువాత నా మనస్సు రగిలిపోయింది. అతను నా ఛాతిని తాకినందుకు అతని చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నా. చివరకు ఫ్లైట్‌ దిగేటప్పుడు అతను లగేజీ కౌంటర్‌ వద్ద కనిపించాడు. అతను నా భుజం మీద వేసిన చేయిని చూశా. దాన్ని కదిలించడం లేదు. ఎందుకంటే అతనికి పక్షవాతం ఉంది. ఆ చేయి కదలదు. అందుకే ఒకే చేత్తో అతను తన లగేజీ తీసుకోవడం చూశా. అప్పుడనిపించింది నాకు. నేను చాలా పెద్ద తప్పు చేశానని. అతన్ని అతని సీట్ దాకా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఉంటే బాగుండేదని భావిస్తూ ఎయిర్‌ హోస్టెస్‌కు అతన్ని నిర్దాక్షిణ్యంగా అప్పగించినందుకు చాలా ఫీలయ్యా. అయినా అతన్ని కొట్టనందుకు చాలా సంతోషించా. నిజంగా అలా గనక చేసి ఉంటే దేవుడు నన్ను క్షమించేవాడు కాదేమో. అప్పుడు జరిగిన ఆ సంఘటన నాకు ఇంకా గుర్తుంది. లగేజీ తీసుకున్నా ఆయన నాకు థాంక్స్‌ చెప్పి ముందుకు కదిలాడు. అప్పుడు నాకు మరింత సిగ్గనిపించింది. నా మర్యాదను నేను కోల్పోయినట్టు ఫీలయ్యాను. మగాళ్లు ఆడవాళ్లపై లైంగిక దాడులు చేయడం ఎక్కువై పోయింది. అయినప్పటికీ అందరు మగాళ్లు అలా ఉండరు. అది నాకు ఆలస్యంగా తెలిసింది. తెలిశాక చింతించా..!

 

Comments

comments

Share this post

scroll to top