కూరగాయలమ్మే మహిళ… పేదల కోసం హాస్పిటల్‌ను కట్టించింది.తన భర్తలా మరెవ్వరూ వైద్యం అందక మరణించొద్దని.

కృషి, పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోవచ్చని నిరూపించిందామె. భర్త చనిపోయినా, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, కూరగాయలమ్ముతూ, కూలి పనిచేస్తూ పైసా పైసా కూడబెట్టింది. తన భర్తలా ఏ వ్యాధితోనూ పేద ప్రజలు చనిపోకూడదని భావించి సొంత ఖర్చులతో ఓ చిన్నపాటి హాస్పిటల్‌ను ఆమె ప్రారంభించింది. క్రమంగా అదే హాస్పిటల్ ఈ రోజు కొన్ని వందల మందికి సేవలందించే వైద్యాలయంగా మారింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుహాసిని ఓ పేద కుటుంబంలో జన్మించింది. కాగా తనకు 12 సంవత్సరాలు రాగానే పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే తనకు సంతానం కూడా కలిగారు. అయితే ఆమె తన 23వ ఏట భర్తను కోల్పోయింది. అతనికి సోకిన వ్యాధికి సరైన చికిత్స చేయించే స్థోమత లేకపోవడంతో తన భర్తను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పిల్లల సంరక్షణ భారం ఆమెపై పడింది. అయితే అప్పుడే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా, ఎప్పటికైనా తన సొంత ఖర్చుతో ఓ హాస్పిటల్‌ను ప్రారంభించి తనలాంటి పేద వారికి ఉచితంగా వైద్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా ఆమె వెనకడుగు వేయలేదు.
HOOSSSSP-750x500
ఈ క్రమంలోనే సుహాసిని గత 20 ఏళ్లుగా అక్కడా ఇక్కడా ఇండ్లలో పనిచేసి, కూలినాలి చేసి పైసా పైసా కూడబెట్టింది. తాను సంపాదించిన దాంట్లో రెండు వంతులు సొంత ఖర్చులకు, రెండు వంతులు తిండికి, మరో వంతును పొదుపు చేసింది. ఎలాంటి విలాసాలకు ఆమె పోలేదు. అయితే తన చిన్న కుమారుడు అజొయ్‌ను మాత్రం డాక్టర్‌ని చేసింది. కాగా 1993లో తాను నివసించే ప్రాంతంలోనే ఒక ఎకరం భూమిని తాను పొదుపు చేసిన డబ్బులతో కొనుగోలు చేసింది. అందులో ఒక చిన్న షెడ్డును ఏర్పాటు చేసింది. దాంట్లో ఆమె కుమారుడు అజొయ్ వైద్య సేవలను అందించేవాడు. హాస్పిటల్‌లో తన షిఫ్ట్ అయిపోగానే ఆ షెడ్డుకు వచ్చి స్థానికంగా నివసించే పేదలకు వైద్యం చేసేవాడు. కాగా ఆ షెడ్డులోనూ మొదటి రోజే 252 మంది పేషెంట్లు వైద్యం కోసం రావడం గమనార్హం. దీంతో సుహాసిని ఆనంద భాష్పాలు రాల్చింది. ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యం నెరవేరినందుకు సంతోషించింది. అయితే అంతటితో ఆమె ఆగలేదు.
ఇంకా మంచి సదుపాయాలతో పెద్ద హాస్పిటల్‌ను నిర్మించాలని ఆమె భావించింది. ఈ క్రమంలో మళ్లీ కూరగాయలను అమ్మే వ్యాపారం చేపట్టింది. కాగా ఆమెకు తన పెద్ద కుమారుడు సుజొయ్ సహకారం అందించాడు. ఆమెతో కలిసి వ్యాపారం చేస్తూ మరింత డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇదే సమయంలో అజొయ్ కూడా తన వంతు బాధ్యతగా కార్పొరేట్ సంస్థలను, చారిటీలను, ట్రస్ట్‌లను నిధుల కోసం ఆశ్రయించాడు. అయితే అతని ప్రయత్నమూ వృథా కాలేదు. సరిగ్గా వారి షెడ్డు హాస్పిటల్ ప్రారంభమైన రెండేళ్లకే అనగా ఫిబ్రవరి 5, 1995న అధునాతన హాస్పిటల్ నిర్మాణానానికి పునాది పడింది. అనంతరం ఒక సంవత్సరంలో హాస్పిటల్‌ను పూర్తి చేసి మార్చి 9, 1996న హ్యుమానిటీ హాస్పిటల్‌ను ప్రారంభించారు.
ప్రస్తుతం ఈ హాస్పిటల్ నిర్వహణలో సుహాసిని కుటుంబ సభ్యులందరూ భాగస్వాములుగా ఉన్నారు. కాగా సుహాసిని మాత్రం తన కుమారుల పిల్లలైన మనవలతో ఆడుకుంటూ వారి సంరక్షణ చూస్తోంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్‌లో తీవ్రమైన శస్త్రచికిత్సలకు కూడా దాదాపు రూ.5వేల లోపే ఖర్చవుతుంది. సాధారణ చికిత్సలకైతే వారు కేవలం రూ.10 మాత్రమే తీసుకుంటారు. అయితే ఇది ఇంతటితో ఆగదంటుంది సుహాసిని. ఇంకా ఎక్కువే చేయాలని ఆమె ఇప్పటికీ భావిస్తుంది.

Comments

comments

Share this post

scroll to top