VIP లకు కౌంటర్….మీకోసం, మేమెందుకు రోడ్లపై నిలబడాలి? అంటూ సూటి ప్రశ్న!?

పరీక్ష సమయం: ఉదయం గం. 10
రూమ్  నుండి కాలేజ్ కి దూరం: 7 కి.మీ.
సమయం: 15-20 నిముషాలు బైక్ పై వెళ్ళడానికి
బయలుదేరిన సమయం: ఉదయం గం.8…. అయినా ఎగ్జామ్ సెంటర్ కు టైమ్ కు చేరలేకపోయాను . అవును ఇది నా వ్యక్తిగత అనుభవం. ఓ సారి చదివి చెప్పండి…ఈ VIP కల్చర్ ను ఏం చేద్దామో..?
ఈ సీన్ ప్రతిఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో చోటుచేసుకునేదే. ప్రతి రోజూ జాతీయ రహదారి మీదుగా నా కాలేజ్ కు వెళతాను. మా ఇంటి నుండి కాలేజ్ కున్న దూరం 7కి.మీ. కావడంతో 15-20నిముషాల్లో కాలేజ్ కు వెళ్లిపోవచ్చు. ఆ రూట్ లో ట్రాఫిక్ ఉండదుకాబట్టి. అయితే ఆ రోజునుండే పరీక్షలు మొదలుకావడంతో నా స్నేహితుడితో కలిసి ఉదయం గం.8లకే కాలేజ్ కు బైక్ పై బయలుదేరాను. ఎగ్జాం టైం గం.10లకు. నేషనల్ హైవేపైకి రాగానే కొన్ని వందల వాహనాలు రోడ్ పై ఆగిపోయున్నాయి. అప్పటివరకూ ఇంత ట్రాఫిక్ ను ఈ హైవేపై చూసిందే లేదు.
మ్యాటర్ ఏంటని పక్కనున్న వాళ్ళను అడగ్గా.. ఎవరో విఐపి వస్తున్నారట,అందుకే ఇలా అన్ని వాహనాలను నిలిపివేశారు. ఆయన వెళ్లాకే ఇదంతా క్లియర్ చేస్తారని చెప్పారు. పోలీసులు అటూ, ఇటూ ఎటువంటి వాహనాలు ఆ విఐపి వాహనాలకు ఎదురుగా రాకూడదని.. వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేసి, ఆయన కోసం  ఎదురుచూస్తున్నారు.విజయవాడకు దగ్గరలోని మంగళగిరిలో ఒక ఫంక్షన్ కు ఆయన అటెండ్ అవుతున్నారు.  విజయవాడకు 30కి.మీ దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఆయన దిగుతారు. అక్కడి నుండి హైవే మీదుగా వెళతాడు. అయితే ఇంకా ఆ విఐపి గన్నవరం కూడా రాకముందే ట్రాఫిక్ పోలీసులు ఇలా వాహనాలను నిలిపివేశారు. నాకు పరీక్ష సమయం దగ్గరపడుతోంది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. చుట్టూ వాహనాలు వెళ్ళడానికి వీలులేకుండా ఉన్నాయ్.
indian_traffic_generic_thinkstock_650_bigstry
అందరూ తమ చేతిగడియారాలు చూసుకుంటున్నారు ఎప్పుడు బయటపడతామా ఈ ట్రాఫిక్ నుండి అని. రయ్..రయ్ మంటూ సైరన్ ల మోత వినపడింది. ఆ విఐపి వచ్చాడు. ఆయన అలా వెళ్ళగానే పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. అప్పటికే ఎగ్జాంకు ఆలస్యం అవడంతో స్పీడుగా కాలేజ్ కు వెళ్లిపోయాను. కానీ పరీక్షకు అటెండ్ కాలేకపోయాను. ఎంతో బాధేసింది. ఎవర్ని ప్రశ్నించాలి. ఏమని అడగాలి అనే బాధకన్నా, నా స్థానంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ లో ఉంటే పరిస్థితి ఏంటి?ఈ రోజు పరీక్ష మిస్ అయినా,ఫెయిల్ అయినా మళ్ళీ రాసుకోవచ్చు కానీ మనిషి ప్రాణంపోతే ఆ వ్యక్తి తీసుకురాగలడా?
492591107
ఆ వ్యక్తే అని కాదు ఈ రాజకీయ నాయకులు, ఎంతో విలువైన మన సమయాన్ని, ప్రాణాలను తిరిగివ్వగలరా? పరీక్షకు సమయానికి రాలేకపోయిన నేను మరో సంవత్సరం వృధా చేసుకోవాలి. ఇలా విఐపి రావడం వలన పరీక్షకు లేట్ గా వచ్చాను అని నా లెక్చరర్స్ ను రిక్వెస్ట్ చేసుకుంటే వారు నన్ను పరీక్ష రాయడానికి అనుమతినిస్తారు. కానీ ప్రతిసారి అదే రిపీట్ అయితే? ప్రజలచేత ఎన్నుకోబడి, ప్రజల కోసం పనిచేస్తామని, ప్రజల అవసరాలకే ఇలా అడ్డుగా నిలబడితే ఇక ఆ నాయకుడు ఎందుకు? ఆ పదవి ఎందుకు? తన రక్షణ కోసం ఇదంతా ఉండచ్చు కానీ ఎన్నో సమస్యలతో సతమతవుతున్న వారిని ఇలా గంటలకొద్దీ ట్రాఫిక్ పై నిలిపివేస్తే వారి పరిస్థితి ఏంటి? ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఇలా నడిరోడ్ పై నిలబెట్టడం సమంజసమేనా..? అని ఒక కాలేజ్ విద్యార్ధి తనకు రీసెంట్ గా జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.
mystory-750x500
నిజానికి మనదేశంలో ఇలాంటి దుస్థితిని మనమంతా ఎదుర్కుంటున్నాం. రాజకీయ నాయకుడు, సినిమా సెలెబ్రిటీ, ఏ క్రికెటర్ వస్తున్నా సరే. గంటలకొద్దీ ట్రాఫిక్ లో ప్రజలను వెయిట్ చేయిస్తున్నారు. మొన్నటికి మొన్న పశ్చిమబెంగాల్ లో గుండెపోటుతో ఓ మహిళను అంబులెన్స్ లో తీసుకెళుతుండగా, ఆ రాష్ట్ర సీఎం వస్తున్నారని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ట్రాఫిక్ లోనే నిలిపివేశారు. అదృష్టం బాగుండి ఆమె ప్రాణాలతో బయటపడింది. అయితే అప్పటికే అంబులెన్స్ కు, అవసరం ఉన్న వారిని తన కోసం ఇలా ట్రాఫిక్ లో నిలిపివేయవద్దని ఆ సీఎం చెప్పినా ట్రాఫిక్ అధికారులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించారు.మంచి సమాజం కోసం, ఉన్నత భవిష్యత్ కోసం నాయకుడిగా నేతలను ఎన్నుకుంటే.. వారి రక్షణ కోసమని ఇలా చేయడం ఎంతవరకూ కరెక్టో ఆలోచించండి. ఆ నేతలు మేల్కొనేలా, ప్రజలు ఎదుర్కుంటున్న ఈ పెద్ద సమస్య వారి చెవినపడి చలించేలా మన గళం విప్పుదాం.

Comments

comments

Share this post

scroll to top