వేయి గ్రామాలకు నీరందించి… 5 నదులకు జీవం పోసిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా.

ప్రకృతి మనకు ప్రసాదించిన సహజ సిద్ధ వనరుల్లో దేన్నయినా సులభంగా వెలికితీసి వాడుకోవచ్చు. కానీ ఏ వనరును కూడా తయారుచేయలేం. సృష్టించలేం. అలాంటి వాటిలో నీరు కూడా ఒకటి. నిత్యం మనం ఎన్నో అవసరాల కోసం నీటిని ఉపయోగిస్తున్నాం. కానీ అలా ఉపయోగించిన నీటిని మళ్లీ రాబట్టే ప్రయత్నం చేస్తున్నామా? అంటే, అధిక శాతం మంది నుంచి లేదనే సమాధానం వస్తుంది. ఏ కొద్ది మందో నీటి పొదుపు గురించి ఆలోచిస్తారు. కానీ రాజస్థాన్‌కు చెందిన రాజేంద్ర సింగ్ మాత్రం నీటి సంరక్షణ గురించి ఇంకా ఎక్కువే ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో గ్రామాలకు నీటిని అందించిన వనరు అయ్యారు. అంతేకాదు అంతరించిపోయిన నదులకు తిరిగి జీవం పోశారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు.
Rajendra_Singh-750x500
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ వద్ద ఉన్న బాగ్‌పత్ జిల్లా దౌలా గ్రామంలో 1959 ఆగస్టు 6న రాజేంద్ర సింగ్ జన్మించారు. పుట్టుకతోనే ఈయనది రాజపుత్రుల కుటుంబం. జమీందారీ వంశానికి చెందినవారు. కాగా ఈయన తండ్రికి జన్మించిన వారందరిలోకి ఈయనే పెద్ద. కాగా 1974లో రాజేంద్ర సింగ్ పాఠశాలలో చదువుతున్నప్పుడు గాంధీ పీస్ ఫౌండేషన్ నుంచి వచ్చిన రమేష్ శర్మ అనే వ్యక్తి వారి గ్రామంలో సమాజహిత కార్యక్రమాలను చేపట్టడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే రమేష్ శర్మ దౌలా గ్రామాన్ని శుభ్రత దిశగా అడుగులు వేయించాడు. స్థానికంగా ఓ లైబ్రరీ నెలకొల్పేలా చేశాడు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో మద్యం వల్ల కలిగే అనర్థాలను అక్కడి ప్రజలకు వివరించడం కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమంలో రాజేంద్రసింగ్ పాల్గొనేలా చేశాడు. సరిగ్గా ఈ సమయంలోనే రాజేంద్ర సింగ్ మనసులో సమాజ సేవ పట్ల కచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది. తాను కూడా ఏదో ఒక  సమాజ హిత కార్యక్రమానికి బీజం వేయాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు. అయితే అది అనుకున్న వెంటనే జరగలేదు.
ఇదిలా ఉండగా రాజేంద్ర సింగ్ హైస్కూల్ విద్యను పూర్తి చేసుకుని అనంతరం బాగ్‌పత్ జిల్లాలో ఉన్న భారతీయ రిషికుల్ ఆయుర్వేదిక్ మహావిద్యాలయలో డిగ్రీ కోర్సులో చేరాడు. దాన్ని కూడా పూర్తి చేసుకుని ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీలో పట్టా సాధించాడు. అనంతరం హిందీ సాహిత్యంలో పీజీ విద్యను పూర్తి చేశాడు. 1980లో రాజస్థాన్ జైపూర్‌లో నేషనల్ సర్వీస్ వాలంటీర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పుడు రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అడల్ట్ ఎడ్యుకేషన్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేవాడు. ఈ క్రమంలోనే తరుణ్ భారత్ సంఘ (యంగ్ ఇండియా అసోసియేషన్) (టీబీఎస్) అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యుడిగా జాయిన్ అయ్యాడు. దీన్ని జైపూర్ యూనివర్సిటీ విద్యార్థులు ఏర్పాటు చేశారు. 3 ఏళ్ల తరువాత రాజేంద్ర సింగ్ ఈ సంస్థకు జనరల్ సెక్రటరీ అయ్యాడు. కాగా 1984లో కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సంస్థ బోర్డు మొత్తం రాజీనామాలు చేయడంతో అందులో రాజేంద్ర సింగ్ మాత్రమే కార్యవర్గ సభ్యుడిగా మిగిలాడు. అనంతరం ఆయన టీబీఎస్ బాధ్యతలను చేపట్టాడు.
r_singh_at_amaipur_0
టీబీఎస్‌కు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా మారాక రాజేంద్ర సింగ్ సమాజహిత కార్యక్రమాలను చేపట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు తన స్నేహితులు నలుగురు జత కలిశారు. వీరు కూడా టీబీఎస్ ద్వారా సమాజ సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆయన 1984లో తన వద్ద ఉన్న సామాన్లన్నింటినీ అమ్మేసి వాటి ద్వారా వచ్చిన రూ.23వేలతో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న తనగాజీ మండలం కిశోరి గ్రామానికి ప్రయాణమయ్యాడు. అప్పుడు తనతోపాటే ఆయన స్నేహితులు నలుగురు కూడా ప్రయాణమై వెళ్లారు. అప్పుడు 1985 అక్టోబర్ 2. ఆ సమయంలో కిశోరి గ్రామంలో ఉన్న రాజేంద్రసింగ్ మొదట ఓ ఆయుర్వేదిక్ వైద్యశాలను ప్రారంభించాడు. ఈయనకు తోడుగా ఉన్న స్నేహితులు సమీపంలోని గ్రామాలకు వెళ్లి విద్య ఆవశ్యకతను గురించి అక్కడి పెద్దలకు, పిల్లలకు అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో స్థానిక గ్రామాల ప్రజలు నీటి కోసం అనేక అవస్థలు పడుతున్నారని రాజేంద్ర సింగ్ తెలుసుకున్నాడు. దీంతో వెంటనే ఓ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గ్రామాల్లో అక్కడక్కడా వర్షపునీటిని ఒడిసిపట్టే చిన్నపాటి చెక్‌డ్యాంలు, స్టోరేజ్ ట్యాంక్‌లను నిర్మాణం చేశాడు. దీంతో ఆ తరువాత ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు ఎండిపోయిన బావులు కూడా రాజేంద్ర సింగ్ చొరవతో నిండిపోయాయి. 3 సంవత్సరాల తరువాత కేవలం 15 అడుగుల లోతులోనే నీళ్లు లభించాయి. ఇదంతా రాజేంద్రసింగ్ వల్లే జరిగిందని ఆయా గ్రామాల ప్రజలు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ క్రమంలో దాదాపు వేయి గ్రామాలకు ఆయన నీరందించగలిగారు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు.
_81813716_81813713
రాజేంద్ర సింగ్ కృషిని గమనించిన అక్కడి అటవీ శాఖ అధికారులు ఓ పార్క్ నిర్వహణను ఆయనకు అప్పగించారు. అయితే దానికి కూడా నీరు అవసరమైంది. ఈ నేపథ్యంలో తాను గతంలో ఆయా గ్రామాల్లో అనుసరించిన పద్ధతుల్నే పార్క్ సంరక్షణ కోసం మరొకసారి చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే సమీపంలో ఉన్న నదులన్నింటి వద్ద వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చెక్‌డ్యాంలు, స్టోరేజ్ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టాడు. దీంతో కేవలం 4 ఏళ్ల కాలంలోనే నదులన్నీ తిరిగి ప్రవహించడం మొదలు పెట్టాయి. ఇలా ఆయన 5 నదులకు తిరిగి జీవం పోశారు. దీంతో ఆ పార్క్‌లో కూడా పచ్చదనం నెలకొంది. ఇదంతా రాజేంద్ర సింగ్ తన తరుణ్ భారత్ సంఘ (టీబీఎస్) ఆధ్వర్యంలో చేయడం విశేషం.
భూగర్భ జలాలను పరిరక్షించడంలో రాజేంద్ర సింగ్ చేసిన కృషికి గాను ఆయనకు మార్చి 2000వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ రివర్ ప్రైజ్ దక్కింది. అదే సంవత్సరం ప్రతిష్ఠాత్మక మెగసెసె అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ఆయనను వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తున్నారు. నిజంగా రాజేంద్ర సింగ్ లాంటి వ్యక్తి ఊరికి ఒకరు ఉంటే అసలు నీటి సమస్య అంటూ ఉండేది కాదేమో!

Comments

comments

Share this post

scroll to top