ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధ వనరులపై మనందరికీ సమాన హక్కు ఉంటుంది. అయితే నేటి వ్యాపార ప్రపంచంలో కొందరు ఆ వనరులను కూడా డబ్బులకు అమ్ముకుంటున్నారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఆ ఉపాధ్యాయుడు మాత్రం అలా కాదు. చుట్టు పక్కల ఇండ్లలో ఎవరికీ నీరు లభించకపోయినా తన వద్ద ఉన్న బోరు నుంచి వస్తున్న నీటిని అందరికీ పంచుతూ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాడు. అతనే షేక్ మతీన్ ముసా.
మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో ఉన్న ఓ గ్రామంలో షేక్ మతీన్ ముసా స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ దాదాపు 300 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా లాతూర్‌లో నెలకొన్న కరువు కారణంగా అక్కడ కూడా ఆయా బావులు, బోర్లలో నీళ్లన్నీ ఎండిపోయాయి. కానీ ఆశ్చర్యంగా మతీన్ ఇంట్లో బోరు మాత్రం ఎండిపోలేదు. దీంతో అతను రోజూ ఆ నీటిని తానే స్వయంగా తోడి ఇరుగు పొరుగు కుటుంబాలకు ఉచితంగా ఆ నీటిని అందిస్తున్నాడు. ఇలా అతను రోజూ దాదాపు 10వేల లీటర్ల నీటిని ఆయా కుటుంబాలకు అందిస్తున్నాడు. ఇందుకోసం రోజూ ఆ గ్రామస్తులు బిందెలు, బకెట్లతో బారులు తీరి అతని ఇంటి వద్ద నిలబడి ఉంటారు.
అయితే మతీన్ ఇలా నీటిని ఉచితంగా అందివ్వడం గమనించిన అతని ఇరుగు పొరుగు స్నేహితులు మాత్రం ఆ నీటిని ఊరికే ఎందుకు ఇవ్వడం, అమ్ముకోవచ్చుగా, అని సలహా ఇచ్చారట. కాగా మతీన్ వారి సలహాను తిరస్కరించాడు. ప్రకృతి మనకు అందించిన సహజ సిద్ధ వనరులను మనమందరం సమానంగా పంచుకోవాల్సిందేనని వారికి బదులిచ్చాడు.
తీవ్రమైన కరువు కారణంగా లాతూర్కు నీటి ట్యాంకర్లతో కూడిన ట్రైన్లను ప్రభుత్వం తరచూ పంపుతున్నా అవి వారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. లాతూర్ ప్రజల దాహార్తి తీరాలంటే వారికి నిత్యం ఎంతైనా దాదాపు 6 కోట్ల లీటర్ల నీరు కావాలి. అలాంటి తీవ్రమైన కరువు ఉన్న నేపథ్యంలో ఏదో తన వంతు సహాయంగా ఆ గ్రామస్తుల దాహార్తిని తీరుస్తున్న మతీన్ కృషిని నిజంగా మనం అభినందించాల్సిందే!