కోహ్లీకి బుద్ది చెప్ప‌డానికి…ఓ సాధార‌ణ వ్య‌క్తి…ఇండియ‌న్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి అప్లై చేశాడ‌ట‌!!

ఇటీవ‌ల లండ‌న్‌లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో పాక్ చేతిలో భార‌త్ చిత్తుగా ఓడిపోవ‌డం, ఆ త‌రువాత కొన్ని నాట‌కీయ ప‌రిణామాల న‌డుమ కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయ‌డం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో కుంబ్లే రాజీనామాకు కెప్టెన్ విరాట్ కోహ్లియే కార‌ణమ‌ని యావ‌త్ దేశ క్రికెట్ అభిమానులంద‌రూ భావించారు. అంత‌టితో వారు ఆగ‌లేదు, కోహ్లిపై ఎదురు దాడి చేయ‌డం మొద‌లు పెట్టారు. అత‌నిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఓ క్రికెట్ అభిమాని మాత్రం అలా కాదు, ఏకంగా కోహ్లికి బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అందుకు అత‌ను ఏం చేశాడో తెలుసా..?

ఈ మ‌ధ్యే భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ కుంబ్లే రాజీనామా చేయ‌డంతో బీసీసీఐ కొత్త కోచ్ వేట‌లో ప‌డింది. అందుకు చాలా మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే నిజానికి వారిలో మాజీ క్రికెట్ ప్లేయ‌ర్లే ఉన్నారు. ఈ క్ర‌మంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన ఉపేంద్ర‌నాథ్ బ్ర‌హ్మ‌చారి అనే ఓ 30 ఏళ్ల మెకానిక‌ల్ ఇంజినీర్ కూడా భార‌త క్రికెట్ జ‌ట్టు కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు కూడా. బీసీసీఐ వెబ్ సైట్‌లో ఉన్న ఈ-మెయిల్ ఐడీకి త‌న ద‌ర‌ఖాస్తును పంపిన‌ట్టు ఉపేంద్ర‌నాథ్ వెల్ల‌డించాడు.

అయితే అత‌ను ఆ ప‌ని ఎందుకు చేశాడో తెలుసా..? కెప్టెన్ విరాట్ కోహ్లికి బుద్ధి చెప్ప‌డానిక‌ట‌. అవును, అందుకే..! అనిల్ కుంబ్లే లాంటి లెజెండ‌రీ క్రికెట్ ప్లేయ‌ర్‌ను ప‌ట్టుకుని అవ‌మాన ప‌ర‌చ‌డ‌మే కాక‌, అదే రీతిలో ఆయ‌న్ను కోచ్ ప‌ద‌వి నుంచి విరాట్ కోహ్లి త‌ప్పుకునేలా చేశాడ‌ని, అది చాలా త‌ప్ప‌ని, అంతటి ప్లేయ‌ర్‌ను అలా అవ‌మాన ప‌ర‌చ‌డం కోహ్లికి భావ్యం కాద‌ని ఉపేంద్ర‌నాథ్ అన్నాడు. కోచ్ ప‌ద‌వి నుంచి కుంబ్లే తొల‌గిపోవ‌డానికి కార‌ణం కోహ్లియే అని యావ‌త్ క్రికెట్ అభిమానులు భావిస్తున్నార‌ని, వారిలో తానూ ఒక‌డిన‌ని అన్నాడు. అంతేకాదు, ఇక కుంబ్లే వెళ్లిపోయాక ఆయ‌న స్థానంలో మాజీ ప్లేయ‌ర్లు ఎవ‌రు కోచ్‌గా వ‌చ్చినా వారికి, కోహ్లికి ప‌డ‌ద‌ని, క‌నుక తాను కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేస్తున్నాన‌ని చెప్పాడు. తాను అహంకారి స్వ‌భావం ఉన్న వ్య‌క్తుల‌తో స‌ర్దుకుపోతాన‌ని, కొద్ది రోజుల‌కు కోహ్లిని దారిలోకి తెస్తాన‌ని, ఆ త‌రువాత బీసీసీఐ ఎవ‌ర్నయినా కోచ్‌గా పెట్టుకోవ‌చ్చ‌ని ఉపేంద్ర‌నాథ్ అన్నాడు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు కోచ్ అయి ఎలాగైనా అహంభావి అయిన కోహ్లికి బుద్ధి చెప్పాల‌ని అనుకుంటున్నాన‌ని, అందుకే కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేశాన‌ని అత‌ను చెప్పాడు..! అయితే ఉపేంద్ర‌నాథ్ అలా ద‌ర‌ఖాస్తు చేయ‌డం, దాని గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ఏమో గానీ ఈ వార్త కాస్తా ప్ర‌స్తుతం వైర‌ల్ అయింది..!

Comments

comments

Share this post

scroll to top