వినాయకుడికి గరక- కొడుక్కి కొత్త బట్టలు.తల్లి కళ్లల్లో ఆనందం.

అమ్మా… రేపు  నా పుట్టిన రోజు కదా..! నాకు కొత్త బట్టలు కావాలి అంటూ మారాం చేస్తున్నాడు అయిదేళ్ల రాజు . అనిత, నర్సింగ్  ల ఒక్కగానొక్క  కొడుకు రాజు. రాజు పుట్టిన మూడేళ్ళకే  కల్తీ కల్లుకు బలయ్యాడు నర్సింగ్. అప్పటి నుండి అనితే తన కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. కొడుకు పుట్టిన యేడాదికే అత్త, భర్త, సంకలో చంటి పిల్లాడితో  మహబూబ్ నగర్ నుండి హైద్రాబాద్ కు కూలీ పని చేసుకుందామనుకొని  వలసొచ్చిన కుటుంబం అనిత వాళ్లది.

పట్నం లో చేతి నిండా పని, జేబు నిండా డబ్బు వచ్చే సరికి నర్సింగ్ కు తాగుడు అలవాటైంది. చివరకు అదే తాగుడుకు బలయ్యాడు.వయసు పైబడడంతో అనిత అత్త కూడా కాలం చేసింది.అప్పటి నుండి  కొడుకుని చూసుకుంటూ బతుకుతుంది అనిత. మూడిళ్లలో పాచి పనిచేసుకోవడం పిల్లాడిని చదివించుకోవడం ఇదే ఆమె లోకం. పిల్లాడే ఆమె ప్రపంచం.

అలాంటి రాజు …అమ్మా నాకు కొత్త బట్టలు అని అడగగానే .ఏం చేయాలో ఆమెకు తోచలేదు. చేతిలో చిల్లి గవ్వాలేదు, కొడుకు నోరు తెరిచి బట్టలు కావాలన్నాడు. తెల్లారితే బాబు పుట్టిన రోజు, కూలీకి వెళ్లి డబ్బులు తెచ్చుకుందామనుకున్నా అప్పటికే మద్యాహ్నం  దాటింది. అప్పుడు ఎవ్వరూ కూలీకి రానివ్వరు. ఏం చేయాలో అమెకు పాలుపోవడం లేదు. వీధిలోకి వచ్చి చూస్తే అంతటా భారీ భారీ వినాయక మండపాలు కడుతున్నారు. గణేష్  విగ్రహాల గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. వెంటనే అనితకు తన చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన వినాయకుడి కథ గుర్తుకు వచ్చింది. ఏకదంతుడు ఇష్టపడే 21 పత్రాలు గుర్తొచ్చాయ్.

vinayaka leafs

గడప దగ్గర  అలిగి కూర్చున్న కొడుకు నుదుటి మీద ఓ ముద్దిచ్చి  ఇంటి నుండి బయలుదేరింది అనిత.. రామోజీ ఫిల్మ్ సిటీ కి ముందున్న అడవిలాంటి ప్రదేశం లోకి వెళ్లింది. అందులో వినాయకుడికి ఇష్టమైన పత్రాలను , గరక ను తెంచి సంచిలో వేసుకుంది. తన చేతిలోని రెండు సంచుల నిండా అన్నీ ఆకులు ,అలములతో నింపింది. తిరిగి వస్తూ వస్తూ వనస్థలిపురం రోడ్డు మీద గణేష్ విగ్రహాలు తయారు చేసి అమ్మే దగ్గర తను సేకరించిన ఆకులను పెట్టుకొని కూర్చుంది.

అక్కడికొచ్చిన వారు పక్కన విగ్రహం కొనడం, అనిత దగ్గర వినాయకుడికి అవసరమైన పత్రి కొనడం  స్టార్ట్ అయ్యింది. గంట, రెండు గంటలు, మూడు గంటలు… అనిత తెచ్చిన పత్రి అంతా అమ్ముడుపోయింది. 900 రూపాయలొచ్చాయ్. అన్న టైం ఎంతైంది అనగానే 6:30  అన్నాడు అక్కడున్న ఓ వ్యక్తి. వెంటనే అక్కడి నుండి బయలుదేరి వస్తూ వస్తూనే  కొడుక్కి  ఓ జత బట్టలు , ఓ చాక్లెట్ పాకెట్ తీసుకొని వచ్చింది అనిత.  రాజు అమ్మ కోసం అరుగు మీద కూర్చొని  ఎదురుచూస్తున్నాడు..అనిత  రాగానే కొడుకుని కౌగిళించుకొని .. నాన్నా ఇదిగోరా నీ కొత్త బట్టలు అని తెచ్చిన కవర్ ను  రాజు చేతిలో పెట్టింది. తన కోసం తెచ్చిన బట్టలను తనివితీరా చూసుకున్న రాజు..వెళ్లేటప్పుడు అమ్మ తన నుదిటి మీదిచ్చిన ముద్దును తిరిగి ఇచ్చాడు.  అప్యాయతతో ఆ తల్లి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయ్.

#అనితమ్మ కు హ్యాట్సాఫ్.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top