ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలను గుర్తించే పరికరాన్ని కనిపెట్టిన 9 వ తరగతి కుర్రాడు. ఆమ్మకు జరిగిన ఘటన మరెవ్వరికీ జరగొద్దని.

తెలివి ఎవరి సొత్తూ కాదు. పేదరికంలో ఉన్నా, వయస్సు చిన్నదైనా ప్రతిభ చాటేందుకు అవి అడ్డు కావు. సరిగ్గా ఇదే మాట శివకాశికి చెందిన ఓ బాలుడికి వర్తిస్తుంది. తన జీవితంలో ఎదురైన ఓ దుస్సంఘటననే ప్రేరణగా తీసుకున్న ఆ బాలుడు అద్భుతం చేసి చూపించాడు. తాను ఎదుర్కొన్న కష్టం మరొకరికి రాకూడదని తనకు చదువు చెప్పే గురువు సహాయంతో ఏకంగా ఓ నూతన పరికరాన్ని ఆవిష్కరించాడు. ఆ పరికరం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పిట్ట కొంచెం… కూత ఘనం… అనే సామెతను రుజువు చేస్తోంది.
తమిళనాడులోని శివకాశి తెలుసుగా. దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే బాణసంచాలో దాదాపు 90 శాతం వరకు బాణసంచా శివకాశిలోనే తయారవుతుంది. పటాకులను తయారుచేసే అనేక చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు అక్కడ ఉన్నాయి. అయితే అలాంటి వాటిలోనే జయకుమార్ అనే ఓ బాలుడికి చెందిన తల్లి కూడా దినసరి కార్మికురాలిలా పనిచేస్తోంది. కాగా ఒక రోజు ఆమె అనుకోకుండా ఓ పరిశ్రమలో జరిగిన బాణసంచా అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలకు గురైంది. ఘటనలో ఆమె శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఇది జయకుమార్ మనసును తీవ్రంగా కలచి వేసింది. దీంతో అతను బాగా ఆలోచించాడు. తన తల్లిలా మరొకరు ఇలా ప్రమాదంలో గాయపడవద్దని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే అతను అగ్ని ప్రమాదాలను వెంటనే పసిగట్టే తక్కువ ఖర్చుతో కూడిన ఓ నూతన అగ్నిమాపక యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. అప్పుడు జయకుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. తనకు చెప్పే సైన్స్ ఉపాధ్యాయుడు కరుణయ్ దాస్ సహాయంతో నూతన తరహా అగ్నిమాపక యంత్రాన్ని (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్)ను తయారు చేశాడు.
ఈ యంత్రం తన పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రతలో వచ్చే మార్పును ఎప్పటికప్పుడు ఓ హీట్ సెన్సార్ ద్వారా పరిశీలిస్తుంది. ఉష్ణోగ్రత సాధారణ స్థాయిని మించి పెరిగితే వెంటనే ఓ అలారం యాక్టివేట్ అయి అది పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మోటర్‌కు సిగ్నల్‌ను పంపిస్తుంది. దీంతో సదరు మోటార్ ఆన్ అయి వెంటనే స్ప్రింక్లర్ ద్వారా మంటలను ఆర్పేందుకు అవసరమైన నీటిని పంపిస్తుంది. ఇదంతా కేవలం ఒక్క క్షణంలోనే జరిగిపోతుందంటే నమ్మగలరా! అవును మరి, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కలిగే భారీ నష్టాన్ని నివారించడం కోసమే ఈ తరహా యంత్రానికి రూపకల్పన చేశాడు జయకుమార్.
Sivakasi-inventor
అయితే కేవలం పరికరం తయారీతోనే జయకుమార్ ఆగిపోలేదు. గత ఫిబ్రవరి నెల 27వ తేదీన జరిగిన బియాండ్ కార్ల్‌టన్ మెమోరియల్ ఫంక్షన్‌లో తన పరికరం గురించి అక్కడికి వచ్చిన వారికి క్షుణ్ణంగా తెలియజేశాడు. అది ఎలా పనిచేస్తుందో వివరించాడు. ఇది వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ అగ్నిమాపక యంత్రాన్ని తయారు చేయక మునుపే జయకుమార్ ఎల్‌పీజీ గ్యాస్ లీక్ సెన్సార్ అనబడే పరికరాన్ని తయారు చేశాడు. అగ్నిమాపక యంత్రంలాగే ఈ సెన్సార్ కూడా పనిచేస్తుంది. ఆ ఎల్‌పీజీ సెన్సార్‌ను తయారు చేసినందుకు గాను జయకుమార్‌కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. కాగా ఇప్పుడు జయకుమార్ అదే సైన్స్ ఉపాధ్యాయుడితో కలిసి పెద్దదైన అగ్నిమాపక యంత్రాన్ని తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. మనం కూడా అతని లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top