8 ఏళ్ల బాలికను వారం పాటు హింసించి అత్యాచారం చేశారు.. వారిని కాపాడుతున్న నాయకులను ఏమనాలి..?

దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా ఐదున్నర ఏళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అర్థరాత్రి పూట రాజధాని నడి వీధుల్లో ఓ బస్సులో ఓ అమాయకురాలిపై కొందరు నీచులు దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమెను రాక్షసంగా హింసిస్తూ దాడికి పాల్పడుతూ మానవ మృగాళ్లలా ప్రవర్తించారు. దీంతో ఆ ఘటనపై యావత్‌ దేశం ఒక్కతాటిపైకి వచ్చి తమ గళం వినిపించింది. ఆ ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు చేశారు. దీంతో దిగి వచ్చిన అప్పటి కేంద్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఏకంగా ఆ అమాయకురాలు నిర్భయ పేరిట నిర్భయ చట్టాన్ని తెచ్చింది. అనంతరం ఆ ఘటనలో నిందితులకు శిక్ష పడింది. అయితే ఆ ఘటన తరువాత నిర్భయ చట్టం వచ్చినప్పటికీ రోజు రోజుకీ మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఇంకా చెప్పాలంటే.. అప్పటికీ ఇప్పటికీ ఆ నేరాల సంఖ్య మరింత పెరిగింది. అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, మనల్ని పాలిస్తున్న నాయకులు మహిళల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా నిర్భయకు మించిన మరో ఘటన చోటు చేసుకుంది. అది కూడా 8 సంవత్సరాల వయస్సున్న ఓ బాలికపై. కొందరు కామాంధులు ఆమెను వారం రోజుల పాటు ఓ ఆలయంలో బంధించి ఆ బాలికకు మత్తు పదార్థాలు, డ్రగ్స్‌ ఇచ్చి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. ఆమెను చిత్ర హింసలు పెట్టారు. చివరకు ఏం చేయాలో తెలియక ఆ బాలికను గొంతు నులిమి ఆపై బండరాళ్లతో తలపై మోది అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చారు. ఇక ఈ కేసులో అత్యంత నీచాతి నీచమైన విషయం ఏమిటంటే… బాలికను అత్యాచారం, హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, వారిని విడిచిపెట్టాలంటూ ఆ రాష్ట్ర మంత్రులు ర్యాలీలు తీయడం.. నిజంగా ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం…

ఇంతకీ అసలేం జరిగింది..?
అది జమ్మూ కాశ్మీర్ లోని కతువా అనే ప్రాంతంలో ఉన్న రసానా అనే గ్రామం. ఆ గ్రామంలో మహమ్మద్‌ యూసుఫ్‌ పుజ్వాలా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వయస్సు 52 సంవత్సరాలు. అతని భార్య పేరు నసీమా. వీరికి ఆసిఫా బానో (8) అనే కుమార్తె ఉంది. అయితే ఆసిఫా వీరి సొంత కుమార్తె కాదు. దత్తత తీసుకున్న కూతురు. పుజ్వాలాకు ఇద్దరు కూతుళ్లు ఉండే వారు. కానీ వారు ప్రమాదంలో చనిపోగా తన బావమరిది కుమార్తె అయిన ఆసిఫాను పుజ్వాలా దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. కాగా పుజ్వాలాది ముస్లింలలో గుజ్జర్‌ సముదాయానికి చెందిన కుటుంబం. వీరి ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం. అందులో భాగంగానే హిమాలయ పరిసరాల్లో గొర్రెలు, గేదెలు, గుర్రాలను మేపుకుంటూ పుజ్వాలా తన కుటుంబంతో జీవిస్తున్నాడు. కాగా అతని కూతురు ఆసిఫా నిత్యం గుర్రాలను తోలుకుని సమీపంలో ఉన్న కతువా అడవికి వెళ్లి వస్తుంటుంది. అందులో భాగంగానే జనవరి 10, 2018న ఆసిఫా నిత్యం చేసే పనిలాగే యథావిధిగా అడవికి గుర్రాలను తోలుకుని వెళ్లింది. అయితే ఎంతో కాలంగా ఆమెపై కన్ను వేసిన సంజీ రామ్‌ అనే వ్యక్తి మేనల్లుడు అడవిలో ఆసిఫాను అపహరించాడు. అనంతరం ఆమెను సమీపంలో ఉన్న ఓ ఆలయంలో బంధించాడు. ఆలయానికి మరో వైపు ఉన్న ఓ చిన్నపాటి గదిలో ఆసిఫాను బంధించాడు. అనంతరం ఆమెపై ఆత్యాచారం చేశాడు.

వారం రోజుల పాటు కామాంధుల అకృత్యం…
సంజీరామ్‌ నిజానికి ఓ మాజీ ప్రభుత్వ అధికారి. ఇతను కతువాలో ఉన్న ఆ ఆలయ కేర్‌ టేకర్‌గా ఉన్నాడు. అతని మేనల్లుడు ఆసిఫాను అడవిలో చూసి తరువాత ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఇక సంజీరామ్‌ మేనల్లుడు అదే గ్రామానికి చెందిన పర్వేష్‌ కుమార్‌ అలియాస్‌ మన్ను అనే తన స్నేహితునికి విషయం చెప్పగా పర్వేష్‌ ఆలయానికి చేరుకుని ఆసిఫాపై అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంజీరామ్‌, ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా (28), సురేందర్‌ వర్మలు కూడా ఆసిఫాపై రోజూ అత్యాచారం చేశారు. వారు మెడికల్‌ షాపుకు వెళ్లి మత్తు మందు కొనుగోలు చేసి మరీ ఆ బాలికపై అత్యాచారం చేశారు. జనవరి 11వ తేదీన సాయంత్రం సంజీరామ్‌ మేనల్లుడు తన బావ, సంజీరామ్‌ కొడుకు అయిన విశాల్‌కు ఫోన్‌ చేసి చెప్పగా మీరట్‌లో ఉన్న విశాల్‌ రాత్రికి రాత్రే 584 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ మరుసటి రోజు ఉదయం అంటే జనవరి 12వ తేదీ ఉదయం 8.30 గంటలకు కతువా చేరుకుని ఆలయానికి వెళ్లి గదిలో బందీగా ఉన్న ఆసిఫా నోట్లో నిద్ర మాత్రలు బలంగా కుక్కి, బలవంతంగా ఆమెతో నీళ్లు తాగించి అనంతరం మరోసారి ఆమెను రేప్‌ చేశారు. అలా వారం పాటు ఆ కామాంధుల అకృత్యం కొనసాగింది. అనంతరం ఆమెను ఆలయం గది నుంచి బయటకు తెచ్చి మొదటగా గొంతు నులిమారు. అయితే ఆసిఫా చనిపోయిందో లేదో తెలియలేదు. దీంతో మళ్లీ ఆమె తలపై బండరాయితో మోదారు. అత్యంత కిరాతకంగా హతమార్చి పక్కనే ఉన్న అడవిలో ఆమె మృతదేహాన్ని పారేశారు.

పెద్ద ఎత్తున ఆందోళన చేసిన గుజ్జర్లు…
జనవరి 10వ తేదీన ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆసిఫా సాయంత్రం అయినా రాకపోయే సరికి తల్లిదండ్రులు పుజ్వాలా, నసీమాలు చుట్టు పక్కల గాలించారు. పుజ్వాలా కొంత మంది సహాయం తీసుకుని లాంతర్లతో రాత్రంతా అడవిలో గాలించారు. అయినా ఆసిఫా జాడ తెలియకపోయే సరికి వారు తీవ్రంగా దుఃఖించారు. తమ కూతురు ఏమైందో తెలియక వారు విలపించారు. తరువాత మరో రెండు రోజుల పాటు అడవిలో గాలించారు. అయినా ఆమె జాడ లభించలేదు. దీంతో జనవరి 12వ తేదీన పుజ్వాలా, నసీమాలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు స్పందించలేదు. పుజ్వాలాతోపాటు అతని వర్గానికి చెందిన మరికొందరు నిలదీసే సరికి అక్కడి ప్రత్యేక పోలీసు అధికారి దీపక్‌ ఖజూరియా (నిందితుల్లో ఒకడు) ఆసిఫా కోసం గాలిస్తున్నట్లు నటించాడు. ఆమె జాడ తెలియలేదని చెప్పేశాడు. చివరకు జనవరి 17వ తేదీన ఆసిఫా మృతదేహం అడవిలో కనిపించే సరికి ఒక్కసారిగా ఈ ఘటన సంచలనం అయింది. దీంతో పుజ్వాలాతోపాటు అతని బంధువులు, స్నేహితులు, ఆ గ్రామవాసులు, గుజ్జర్లు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో జనవరి 23వ తేదీన జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.

8 మందిపై కేసు నమోదు…
ముఫ్తీ ఆదేశాల మేరకు ఆసిఫా అత్యాచారం, హత్య కేసును విచారించేందుకు ప్రత్యేక క్రైం బ్రాంచ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సదరు బృందం కేసు విచారించి 15 పేజీలతో కూడిన ఛార్జి షీటును దాఖలు చేసింది. అందులో ప్రధాన నిందితులైన సంజీరామ్‌, అతని మేనల్లుడు, కుమారుడు విశాల్‌ తోపాటు పర్వేష్‌ కుమార్‌, పోలీసు అధికారులు దీపక్‌ ఖజూరియా, సురేందర్‌ వర్మలపై క్రైం బ్రాంచ్‌ అధికారులు కేసు నమోదు చేశారు. వీరితోపాటు బాలిక దుస్తులపై ఉన్న రక్తం, బురద మరకలను శుభ్రం చేసి సాక్ష్యాలను తారు మారు చేసేందుకు సహకరించిన మరో ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఆనంద్‌ దత్తా, తిలక్‌ రాజ్‌ ల పేర్లను కూడా క్రైం బ్రాంచ్‌ పోలీసులు చార్జి షీట్‌లో నమోదు చేశారు. ఈ మేరకు ఈ  ఘటనలో మొత్తం 8 మందిపై కేసు నమోదైంది.

నిందితులకు కొమ్ము కాస్తున్న అధికార పార్టీ నాయకులు…
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసిఫా బానో అత్యాచారం, హత్య కేసు జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. గుజ్జర్ల నాయకుడు, ఎమ్మెల్యే అయిన మియాన్‌ అల్తాఫ్‌ ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. ఆసిఫా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే మరో వైపు నిందితులను కఠినంగా శిక్షించాలి అనాల్సిందిపోయి ఆ ప్రాంతంలో బలంగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులు మాత్రం నిందితులకు కొమ్ము కాసే పని చేస్తున్నారు. ఆసిఫా బానో సంఘటన ఆమె కుటుంబ విషయమని కతువాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్‌ జస్రోటియా అన్నారు. దీంతో గుజ్జర్లు ఈ విషయంపై మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. చివరకు ఈ కేసు మతం రంగు పులుముకుంది. గుజ్జర్లు కావాలనే కతువా ప్రాంతంలో హిందువులను అణచివేసేందుకు యత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఆ ఘటనకు వారే పాల్పడ్డారని నిందితులకు చెందిన పలువురితోపాటు, బీజేపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఆరోపించారు. కాగా నిందితుల్లో ఒకడైన సంజీరామ్‌, అంకుర్‌ శర్మ అనే మరో వ్యక్తి సహాయంతో తాజాగా కతువాలో ర్యాలీ తీశారు. హిందూ ఏక్తా మంచ్‌ పేరిట బ్యానర్లు పట్టుకుని ర్యాలీ చేపట్టగా, అందులో ఆ రాష్ట్ర మంత్రులు ఇద్దరు జాతీయ జెండాలతో పాల్గొన్నారు. వారు నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిజంగా ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం మాత్రం మరొకటి ఉండదు. వారు ఇలా చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటన మరోసారి చర్చనీయాంశమైంది. నిందితులకు కొమ్ముకాసేలా అధికార బీజేపీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యవహరిస్తున్నారని, నిజంగా ఇది సిగ్గు చేటని దేశంలో ఉన్న అనేక పార్టీలు, ప్రజా సంఘాలకు చెందిన నాయకులతోపాటు పలువురు ప్రముఖులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు అన్నారు.

నిందితులను అరెస్టు చేసి శిక్షించాల్సిందిపోయి వారికి మద్దతుగా ర్యాలీలు తీయడమేమిటని అందరూ మండి పడుతున్నారు. మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్‌లో బార్‌ అసోసియేషన్‌ లాయర్లు కొందరు నిందితులకు మద్దతుగా తాజాగా ఆందోళన కూడా చేశారు. వారు గుజ్జర్లతో దీపక్‌ ఖజూరియాకు గొడవలు ఉన్నాయని, దీపక్‌ స్థలాలను గుజ్జర్లు కబ్జా చేశారని, ఇప్పుడు ఆ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తూ చార్జిషీట్‌ దాఖలు చేయడానికి వచ్చిన క్రైం బ్రాంచ్‌ పోలీసులను అడ్డుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, క్రైం బ్రాంచ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు. అయితే ఇలా సాక్షాత్తూ న్యాయవాదులే నిందితులకు మద్దతుగా మాట్లాడుతుండడం మరింత వివాదాస్పదమైంది. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలే కాదు, సినీ ప్రముఖులు కూడా సామాజిక మాధ్యమాలు వేదికగా స్పందిస్తున్నారు. నిందితులకు ఇలా ప్రజాప్రతినిధులు, లాయర్లు మద్దతు తెలపడం, వారిని రక్షించడం సరికాదని, అసలు మనం నిజంగా ఇండియాలోనే ఉన్నామా, వేరే దేశంలోనే ఉన్నామా, ఇలా వారు నిస్సిగ్గుగా నిందితులను రక్షిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు.. అంటూ చాలా మంది స్పందిస్తున్నారు. చిన్నారి ఆసిఫా కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇంతటి దారుణకాండకు ఒడిగట్టిన క్రూర మృగాలను విడిచిపెట్టకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. అవును.. నిజంగా ఇంతటి నీచమైన, దారుణమైన, హేయమైన ఘటనకు పాల్పడిన ఆ మృగాళ్లకు కఠిన శిక్ష పడాల్సిందే. వారిని విడిచిపెడితే అంతకు మించిన సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు..!

Comments

comments

Share this post

scroll to top