పసుపురంగులోకి మారిన గోర్లను 15 నిమిషాల్లో మెరిసేలా చేయడానికి ఉపయోగపడే 8 వస్తువులు.

చాలా మంది గోర్ల‌ను ఆక‌ర్ష‌ణీయ‌త కోసం పెంచుకుంటారు. కొంద‌రైతే గోర్లు పెరుగుతున్నా వాటిని ప‌ట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గోర్ల‌ను పెంచుకున్నా, పెంచుకోక‌పోయినా వాటిని ఎప్ప‌టి క‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్ర‌మంలో అలా శుభ్రం చేసుకోక‌పోయినా, లేదంటే ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, విట‌మిన్ లోపం, పొగ తాగ‌డం, డ‌యాబెటిస్‌, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారి గోర్లు ప‌సుపు రంగులోకి మారిపోతాయి. ఒక వేళ మీకు గ‌న‌క అలా మారి ఉంటే వెంట‌నే స్పందించండి. అలాంటి వారు కింది టిప్స్‌ను పాటిస్తే గోర్ల‌ను ప‌సుపు రంగు నుంచి సాధార‌ణ స్థితికి మార్చుకోవ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోర్ల‌కు ఎవ‌రైనా నెయిల్ పెయింట్ వేసుకున్న‌ట్టయితే వెంట‌నే దాన్ని తీసేయాలి. గోర్లకు ఎలాంటి ప‌దార్థాలు లేన‌ప్పుడే వాటి అస‌లు రంగు తెలుస్తుంది. దీంతో ఆ రంగును తొల‌గించుకునేందుకు వీలుంటుంది. కాబ‌ట్టి నెయిల్ పాలిష్ రిమూవ‌ర్‌తో పెయింట్‌ను తీసేయండి. అనంత‌రం కింది టిప్స్‌ను పాటించండి.

collage

నిమ్మ‌కాయ‌…
చిన్న గిన్నెలో కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అందులో గోళ్ల‌ను పూర్తిగా ముంచాలి. అలా 10 నుంచి 15 నిమిషాల పాటు ఉండాలి. అనంత‌రం గోర్ల‌ను బ‌య‌ట‌కు తీయాలి. ఇప్పుడు ఒక టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో అదే నిమ్మ‌రసాన్ని ఉప‌యోగించి గోర్ల‌ను శుభ్రంగా రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగేయాలి. త‌రువాత గోర్ల‌కు మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు నిత్యం చేస్తూ ఉంటే ప‌సుపు రంగు గోర్లు సాధార‌ణ స్థితికి వ‌స్తాయి. అయితే నిమ్మ‌ర‌సం లేకుంటే లెమ‌న్ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను కూడా నీటిలో క‌లుపుకుని పైన చెప్పిన విధంగా వాడుకోవ‌చ్చు. లేదంటే ఒక నిమ్మ‌కాయ‌ను తీసుకుని రెండు ముక్క‌లుగా క‌ట్ చేసి ఒక్కో ముక్క‌ను 10 నిమిషాల పాటు గోర్ల‌పై రాయాలి. అనంత‌రం క‌డిగేయాలి. ఇలా చేసినా గోర్లు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తాయి.

టూత్‌పేస్ట్‌…
టూత్‌పేస్ట్‌ను కొద్దిగా తీసుకుని గోర్ల‌కు బాగా రాయాలి. అనంత‌రం ఆ గోర్ల‌ను టూత్ బ్ర‌ష్ సహాయంతో రుద్దాలి. ఇలా ఒక్కో గోరును చేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా చేసినా గోర్ల సాధార‌ణ రంగును తిరిగి పొంద‌వ‌చ్చు.

హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌…
3 టేబుల్ స్పూన్ల హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌ను తీసుకుని కొద్దిగా గోరు వెచ్చ‌ని నీటిలో క‌ల‌పాలి. అనంత‌రం ఆ నీటిలో గోర్ల‌ను ముంచి 10 నిమిషాల పాటు ఉండాలి. గోర్ల‌ను తీసి అదే మిశ్ర‌మంతో టూత్‌బ్ర‌ష్‌ను ఉప‌యోగించి గోర్ల‌ను రుద్దాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో గోర్ల‌ను క‌డిగి మాయిశ్చ‌రైజ‌ర్ రాయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా ఫ‌లితం ఉంటుంది.

బేకింగ్ సోడా…
1 టేబుల్ స్పూన్ హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌, రెండున్న‌ర టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మ‌ర‌సం తీసుకుని అన్నింటినీ బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని టూత్‌బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు ప‌ట్టించాలి. 2 – 3 నిమిషాల పాటు గోర్ల‌ను అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో క‌డిగేయాలి. త‌రువాత మాయిశ్చ‌రైజ‌ర్‌ను అప్లై చేయాలి. ఇలా 6 నుంచి 8 వారాల పాటు చేస్తే ఫ‌లితం క‌నిపిస్తుంది. ముందు చెప్పిన దాంట్లో హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌కు బ‌దులుగా ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడ‌వ‌చ్చు.

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌…
ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ క‌లిపి ఆ మిశ్ర‌మంలో గోర్ల‌ను 20 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీటితో క‌డిగేయాలి. అనంత‌రం గోర్ల‌కు ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. నిత్యం 3 సార్ల చొప్పున 4 వారాల పాటు ఇలా చేస్తే గోర్ల‌కు పూర్వ రంగు వ‌స్తుంది.

నారింజ తొక్క‌…
నారింజ పండు తొక్క‌ల‌ను సేక‌రించి వాటిని ఎండ‌బెట్టి పొడి చేయాలి. ఈ పొడిని కొంత నీటికి క‌లిపి మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను టూత్ బ్ర‌ష్ స‌హాయంతో గోర్ల‌కు రాయాలి. అలా గోర్ల‌ను 10 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క‌డిగేయాలి. ఈ చిట్కాను 1 నుంచి 2 వారాల పాటు రోజూ పాటిస్తే గోర్ల‌కు ఉన్న ప‌సుపు రంగు పోతుంది. ముందు చెప్పిన దానికి బ‌దులుగా నారింజ పండు తొక్క‌ను రోజుకు 2 నుంచి 3 సార్లు గోర్ల‌కు రాస్తూ ఉన్నా గోర్ల రంగు సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top