777888999 ఫోన్ నంబ‌ర్ నుంచి కాల్ వ‌స్తే… దాన్ని లిఫ్ట్ చేస్తే ఫోన్ నిజంగానే పేలుతుందా..? ఇందులో నిజం ఉందా..?

నేడు సోష‌ల్ మీడియా ఎలా త‌యారైందంటే… వాటిల్లో వ‌చ్చే మెసేజ్‌లు, వైర‌ల్ అయ్యే పోస్టులలో వేటిని న‌మ్మాలో, వేటిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌డం లేదు. అంత‌లా ఆయా మాధ్య‌మాల్లో ప‌లు వార్త‌లు పుకార్లు సృష్టిస్తున్నాయి. ప్ర‌ధానంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలోనే ఇలాంటి పుకారు వార్త‌లు ఎక్కువ‌గా షేర్ అవుతున్నాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఓ మెసేజ్ బాగా వైర‌ల్ అవుతోంది. అదేమిటంటే… 777888999 అనే ఫోన్ నంబ‌ర్ నుంచి కాల్ వ‌స్తే తీయ‌రాద‌ని, ఒక వేళ తీస్తే వెంట‌నే ఫోన్ బ్లాస్ట్ అవుతుంద‌నే మెసేజ్‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో, ప్ర‌ధానంగా వాట్సాప్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే నిజానికి ఈ నంబ‌ర్ తో అంత‌టి ప్ర‌మాదం జ‌రుగుతుందా..? ఇందులో వాస్త‌వం ఎంత అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

ఒక‌సారి మీరు పైన చెప్పిన 777888999 నంబ‌ర్‌ను ప‌రిశీలించండి. అందులో మొత్తం 9 నంబ‌ర్లే ఉన్నాయి. అంటే అస‌లు మొద‌ట ఈ నంబ‌ర్ మ‌న దేశంలో ఎక్క‌డా ప‌నిచేయ‌దు. ఎందుకంటే మొబైల్ నంబ‌ర్ అయితే 10 నంబ‌ర్లు, ల్యాండ్‌లైన్ అయితే 11 నంబ‌ర్లు ఉంటాయి. కానీ ఇందులో 9 మాత్ర‌మే ఉన్నాయి. అంటే ఈ నంబ‌ర్ అస‌లు ప‌నిచేయ‌దు. మ‌రి అలాంటిది ఈ నంబర్ నుంచి ఎవ‌రైనా కాల్ ఎందుకు చేస్తారు..? క‌నుక ఇది ఓ ఫేక్ (న‌కిలీ) మెసేజ్ అని అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ మెసేజ్ వ‌ట్టిదే అని తేల్చేందుకు ఇంకో కార‌ణం ఏమిటంటే…

ఈ నంబ‌ర్ మాత్ర‌మే కాదు, ఏ నంబ‌ర్ నుంచైనా అవ‌తలి వ్య‌క్తుల‌కు కాల్ చేస్తే వారి ఫోన్లు పేల‌వు. ఒక వేళ అవ‌త‌లి వ్య‌క్తుల ఫోన్ల‌లో చిన్న‌పాటి బాంబులు, అవి కూడా ఫోన్ కాల్స్‌కు యాక్టివేట్ అయ్యేవి ఉంటే త‌ప్ప‌. అలాంటి బాంబులు మ‌న ఫోన్ల‌లో ఉండ‌వు క‌దా, క‌నుక ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేదు. అవి కాకుండా ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్ల‌ను పేల్చే టెక్నాల‌జీ ఇంకా రాలేదు. ఏమో… అది త‌యారు చేస్తున్నారేమో. అది ఎవ‌రికి తెలుసు. ఆ టెక్నాల‌జీ అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచంలోనూ ఎక్క‌డా రాలేదు. క‌నుక పైన చెప్పిన మెసేజ్ ఉత్త పుకారే అని మ‌న‌కు తెలుస్తుంది.

స‌రే… ఒక వేళ ఆ నంబ‌ర్ విదేశాల‌కు చెందిన‌ది అయి ఉంటుంది అంటారా..? అలా అయితే మ‌రి 9 నంబ‌ర్ల‌కు ముందు దేశం కోడ్ ఉండాలి క‌దా. అలా లేదు. క‌నుక ఆ నంబ‌ర్ మాత్ర‌మే కాదు, ఆ వార్త కూడా పుకారే అని తెలుస్తుంది. దీన్ని తాజాగా ప‌లువురు నిపుణులు తేల్చేశారు కూడా. క‌నుక మీకు ఇలాంటి మెసేజ్‌లు వ‌స్తే స్పందించాల్సిన ప‌నిలేదు. అయితే పుకారు క‌దా అని ఎవ‌రికీ ఇలాంటి మెసేజ్‌లు మాత్రం షేర్ చేయ‌కండి. ఎందుకంటే అస‌లే ఇది వైర‌స్‌ల కాలం. ఆ మెసేజ్‌ల‌లో వైర‌స్ గ‌న‌క ఉంటే అది అంద‌రి ఫోన్ల‌కు పాకుతుంది. దీంతో ఫోన్లు పాడ‌వుతాయి. అయినా అలాంటి ఏ మెసేజ్‌ను కూడా అంత గుడ్డిగా న‌మ్మేయ‌కండి. ఎందుకంటే సోష‌ల్ మీడియాలో క‌నిపించే అలాంటి మెసేజ్‌ల‌లో నూటికి 99 శాతం మెసేజ్‌లు న‌కిలీవే ఉంటున్నాయి. కాబ‌ట్టి త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!

Comments

comments

Share this post

scroll to top