ఇంట్లోకి వెళుతుంటే గేటు ఎదురుగా పచ్చని ప్రకృతి పలకరిస్తుంది. ఇంకాస్త లోపలికి వెళితే గ్రీన్ కలర్ లో ఉండే రాళ్లు.. కిటికీలు.. గోడలు ఇలా ఒక్కటేమిటి ఆ ఇళ్లు మొత్తం ఆకు పచ్చ రంగుతో మెరిసిపోతుంది. ఇంట్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం మిమ్మల్ని లోపలికి ఆహ్వనం పలుకుతూ ఓ భామ్మ ఎదురవుతుంది. ఆమెని చూశాకకాని తెలియదు పచ్చదనమంటే ఇది అని. కారణం ఆమె ఇళ్లే కాదు ఒళ్లు కూడా ఆకుపచ్చ రంగుతో మెరిసిపోతూ కనిపించడమే.
వింతలు పలురకాలంటారు. అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ఎలిజబెత్ స్వీట్హార్ట్ అనే బామ్మ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే తనకి ఆకుపచ్చ రంగంటే పిచ్చి ఇష్టం. ఆ ఇష్టంతో ఇంటిని.. ఇంట్లో వాడే వస్తువులని.. చివరకి తను వేసుకునే డ్రెస్ లను కూడా గ్రీన్ రంగులోకి మార్చేసింది. అంతే కాదు వాడే ప్రతి వస్తువు గ్రీన్ రంగులోనే అమర్చుకుంది ఈ బామ్మ. 74 ఏళ్ల వయసున్న ఈ బామ్మ గత 20 ఏళ్లుగా కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే వాడుతూ వస్తుంది. దీంతో ఈమెను ‘గ్రీన్ లేడీ’గా పిలుస్తున్నారంతా.
20 ఏళ్లకు ముందు అన్ని రంగులను ఇష్టపడింది ఈ బామ్మ. మొదట్లో పింక్, సిల్వర్, పర్పుల్, నీలి రంగు లను కాస్త ఎక్కువగా ఇష్టపడింది. అయితే ఏమైందో ఏమో కాని ఒక్క సారిగా ఆకుపచ్చరంగంటే ఎనలేని ఇష్టాన్ని పెంచుకుంది ఎలిజెత్. ఎక్కడికి వెళ్లినా ఒంటిపై ధరించినవన్ని ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకునేది. చివరికి జుట్టు రంగును కూడా గ్రీన్ లోకే మార్చేసుకుంది ఈ బామ్మ. స్థానికంగా ఉండే ప్రజలు ఈ బామ్మను ముద్దుగా ‘మిస్ గ్రీన్’ అని.. ‘గ్రీన్ లేడీ’ అని పిలుచుకుంటున్నారు. నిజంగా ఆకుపచ్చ రంగులో ముచ్చటగా ఉంది కదా భామ్మ లుక్.