సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ…ఏవీ పెద్ద అడ్డంకులు కావని నిరూపించిందీమె.!

 సాధారణంగా మనిషి జీవితం బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం అనే నాలుగు దశల్లో ఉంటుంది. ఏ దశలో చేయాల్సిన పనులను ఆ దశలో చేస్తారు. బాల్యంలో పాఠశాల విద్యను అభ్యసిస్తూ సరదా సరదాగా అల్లరి చేస్తూ గడుపుతారు. అదే యవ్వనానికి వచ్చే సరికి కాలేజీ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో ఉంటారు. ఇక మధ్య వయస్సులో పిల్లలు, సంసారం, సంపాదన ఇలాంటి విషయాలపై దృష్టి పెడతారు. వృద్ధాప్యానికి వచ్చే సరికి రిటైరవుతారు. ఆ సమయంలో మనవలు, మనవరాళ్లను చూస్తూ మురిసిపోతుంటారు. రోజూ ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తూ కాలం వెళ్లదీస్తారు. అయితే ఈ దశకు వచ్చిన వారెవరైనా అలాగే చేస్తారు. కానీ ముంబైకి చెందిన ఆ మహిళ మాత్రం అలా కాదు. వయస్సు మీద పడినా చదువు మీద ఎంతో ఆసక్తితో గ్రాడ్యుయేషన్ విద్యను విజయవంతంగా అభ్యసించింది. చదువుకు వయస్సు అడ్డం కాదని నిరూపించింది.
ముంబైలో నివాసం ఉండే ఓ మహిళ ఇంటర్ వరకే విద్యను అభ్యసించింది. ఆమె కుటుంబ పరిస్థితి అప్పట్లో అంతగా బాలేకపోవడంతో తన చదువును అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. అయితే ఆమె అప్పుడే ఓ నిర్ణయం తీసుకుంది. ఎప్పటికైనా తాను గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేయాలని సంకల్పించుకుంది. ఈ క్రమంలో ఆమెకు వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. అయితే ఆ పిల్లలకు ఆమే రోజూ ట్యూషన్లు చెప్పేది. వారు 9వ తరగతి వరకు వచ్చే వరకు ఆమే నిత్యం వారికి చదువు చెప్పింది. క్రమంగా వారు కాలేజీ విద్యకు దగ్గరవడంతో ఇంక వారికి పాఠాలు చెప్పడం ఆమెకు కష్టతరమైంది. కాగా కాల క్రమంలో ఆమె కూతురికి వివాహం జరిగింది. మరో ఇద్దరు పిల్లలు కాలేజీ విద్యలో బిజీగా మారారు. దీంతో ఆమె ఫుల్‌స్టాప్ పెట్టిన తన చదువును మరోసారి కొనసాగించాలనుకుంది.
అది 2013వ సంవత్సరం. అప్పటికి ఆమె చదువు మానేసి దాదాపు 30 ఏళ్లు కావస్తోంది. ఆ ఏడాది ఆమెకు 51 ఏళ్లు వచ్చాయి. అయితే తన వయస్సును చూసి ఆమె నిరాశ చెందలేదు. ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలని భావించింది. ఈ క్రమంలో భర్త, అత్తల అనుమతి తీసుకుని ఓ కాలేజీలో బి.కామ్. కోర్సులో చేరింది. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆమెను చదువుకోమని ప్రోత్సహించారు. కాగా ఈ వయస్సులో కాలేజీకి వెళ్తూ కూడా ఆమె ఏ మాత్రం సిగ్గు పడలేదు. అక్కడ అందరూ తన కొడుకు, కూతురు వయస్సు వారే ఉన్నా వారితో ఆమె చనువుగానే ఉండేది. ఈ క్రమంలో కొంత మంది స్నేహితులు కూడా ఆమెకు జత కలిశారు. ఇదంతా ఆమెకు మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నిత్యం కాలేజీకి వెళ్లి రావడం, ఇంటికి వచ్చాక కొడుకు, కూతురుతో ఆయా సబ్జెక్ట్‌లలో సందేహాలు తీర్చుకోవడం ఆమెకు కొత్తగా అనిపించింది.
12994552_903298073133246_7416703189259139126_n
అయితే ఒకానొక సందర్భంలో ఆమె అత్త అనారోగ్యం కారణంగా హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. దీంతో ఆమె అత్తకు సపర్యలు చేయడం కోసం కొద్ది రోజులు కాలేజీ మానాల్సి వచ్చింది. అయినా ఆమె దిగులు చెందలేదు. తనకు స్నేహితులుగా మారిన యువతీ యువకులు నిత్యం క్లాస్‌లో చెప్పిన పాఠాలను ఆమెకు వచ్చి చెప్పేవారు. దీనికి తోడు వారు క్రియేట్ చేసుకున్న వాట్సప్ గ్రూప్ ద్వారా ఆమె తన సందేహాలను తీర్చుకునేది. ఈ క్రమంలో ఆ మహిళ ప్రతి ఏటా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చింది. దీన్ని చూసి ఆమె భర్త, పిల్లలు ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. కాగా ఈ ఏడాది ఆ మహిళ తన డిగ్రీ ఫైనలియర్ పరీక్షలను రాయనుంది. వాటిలో ఎలాగైనా ఉత్తీర్ణత సాధిస్తానని నిశ్చయంగా చెబుతోంది.
నిజంగా చదువు పట్ల అంతటి ఆసక్తిని కనబరిచి ఈ వయస్సులోనూ డిగ్రీ పొందాలని చూస్తున్న ఆ మహిళకు మనమందరం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

Comments

comments

Share this post

scroll to top