ఆ మహిళా వ్యాపారవేత్త ఒకప్పటి తొలి ఆదాయం 50 పైసలు… ఇప్పుడు రోజుకి రూ.2 లక్షలు…

కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఎంతటి విజయాన్నయినా సాధించవచ్చని మరోసారు రుజువైంది. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఇబ్బంది పెట్టినా, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటికి బెదరకుండా ధైర్యంతో ముందడుగేసి ఉన్నత శిఖరాలను అధిరోహించిన అనేక మంది గురించి ఇప్పటి వరకు మనం విన్నాం. సరిగ్గా ఇదే కోవకు చెందుతారు చెన్నైకు చెందిన మహిళా వ్యాపారవేత్త పట్రిషియా నారాయణ్. తనకు ఎదురైన అనేక కష్టాలను ఎన్నింటినో తెగువతో అధిమించి నేడు చెన్నై నగరంలో పలు రెస్టారెంట్లకు యజమానురాలిగా మారారు. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 50 పైసల రోజువారీ ఆదాయాన్ని ఆర్జించిన ఆమె ఇప్పుడు రోజుకు రూ.2లక్షలకు పైగా సంపాదిస్తూ ఇతర మహిళా వ్యాపార వేత్తలకు, ఆ మాటకొస్తే జీవితంలో పైకి ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
చెన్నైలో నివాసం ఉండే పట్రిషియా నారాయణ్ గత 31 ఏళ్ల కిందట తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా తాను నమ్మిన వ్యక్తితో ఇంటి నుంచి బయటికి వచ్చింది. అయితే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగినా తన తల్లిదండ్రులు మాత్రం ఆమె ముఖం చూసేందుకు ఇష్ట పడలేదు. ఈ నేపథ్యంలోనే తన భర్త కూడా ఆమెను మోసం చేసి వెళ్లిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల సంరక్షణ భారాన్ని ఆమె నెత్తిన వేసుకుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఏదైనా ఒకటి చేసైనా సరే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, తాను ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదగాలని భావించింది. ఈ క్రమంలోనే మొదట ఆమె ఊరగాయలు, జామ్‌లు వంటి వాటిని స్వయంగా తయారు చేసి వీధుల్లో అమ్మేది.
paise-female-750x500
అది 1980వ సంవత్సరం. అప్పుడు పట్రిషియా నారాయణ్ చెన్నై మెరీనా బీచ్‌లో కాఫీలు అమ్మడం ప్రారంభించింది. అప్పుడామెకు తొలి రోజు 50 పైసల ఆదాయం వచ్చింది. క్రమంగా ఆమె ఆదాయం రోజుకు రూ.2500లకు చేరింది. కాగా అదే ఏడాది జరిగిన ఓ సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక రోజు ఆమె అమ్మకాన్ని చూసిన అక్కడి స్లమ్ క్లియరెన్స్ బోర్డ్ చైర్మన్ ఆమె వద్దకు వెళ్లి స్థానికంగా మంచి కిచెన్‌తో కూడిన ఓ క్యాంటీన్ పెట్టమని సలహాతోపాటు ఆఫర్ కూడా ఇచ్చాడు. దీనికి అంగీకరించిన పట్రిషియా నారాయణ్ ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దిన దినాభివృద్ధి చెందుతూ అంచెలంచెలుగా వ్యాపార రంగంలో ఎదిగింది. ఇప్పుడు అదే చెన్నైలో పలు రెస్టారెంట్లకు యజమానురాలిగా మారింది.
అయితే 2004లో జరిగిన ఓ సంఘటన తనను తీవ్రంగా కలచివేసింది. తాను ఎంతో గారాబంగా పెంచిన కూతురు, ఆమె భర్త ఓ రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కాగా యాక్సిడెంట్ అయిన ప్రదేశం నుంచి వారి మృతదేహాలను తరలించేందుకు ఏ ఆంబులెన్స్ ముందుకు రాలేదు. దీంతో ఇతర వ్యక్తుల సహాయం తీసుకుని ఆమె వారి మృతదేహాలను ఖననం కోసం తరలించింది. ఈ సంఘటన తనను ఎంతగానో ఆలోచింపజేసింది. అసలే కూతురు, అల్లుడు పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న పట్రిషియాకు వారి ప్రమాదం జరిగిన అనంతరం తలెత్తిన పరిస్థితులను జీర్ణించుకోలేకపోయింది. దీంతో వెంటనే ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. వారు చనిపోయిన ప్రదేశం వద్దే క్షతగాత్రులను లేదా మృతదేహాలను తరలించేందుకు ఓ ఆంబులెన్స్‌ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది. తనకు జరిగినట్టు మరొకరికి కాకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఈ సేవను ప్రారంభించింది. అయితే ఆమె ఇక్కడితో ఆగిపోలేదు. ఆ దుర్ఘటన అనంతరం వెంటనే తేరుకుని తన కూతురి జ్ఞాపకార్థం సందీఫా పేరిట ఓ రెస్టారెంట్‌ను తన కొడుకుతో కలిసి ప్రారంభించింది. ఇప్పుడీ రెస్టారెంట్ పేరిట చెన్నైలో 14 బ్రాంచ్‌లు నడుస్తున్నాయి. వీటన్నింటి ద్వారా ఆమె రోజుకు రూ.2లక్షలను సంపాదిస్తోంది. కాగా వ్యాపార రంగంలో ఆమె చూపిన తెగువ, సాధించిన ప్రగతికి గాను 2010 సంవత్సరానికి ఆమెకు ఫిక్కి ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.

Comments

comments

Share this post

scroll to top