ఒక్క పోస్టు… పోటీ పడుతున్న వారు దాదాపుగా 416 మంది… ఇదీ… పశ్చిమబెంగాల్లో ఇప్పుడు గ్రూప్ డి పోస్టుల కోసం దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థుల పరిస్థితి. ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడి నిరుద్యోగులకు తగినన్ని ఉద్యోగాలు కల్పించలేకపోయింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్యూన్ పోస్టుల కోసం 2015లో ఏకంగా 23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 368 పోస్టులకు గాను అంత భారీ ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే క్రమంలో తాజాగా వెస్ట్ బెంగాల్లో కూడా పరిస్థితి అలాగే మారింది.
ఇటీవల వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం గ్రూప్ డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆ పోస్టులకు దరఖాస్తులు పెట్టుకున్నారు. అందులో భాగంగా దాదాపుగా 25 లక్షల మంది వరకు ఆ పోస్టులకు దరఖాస్తు చేశారు. కానీ ఉన్నది మాత్రం 6వేల పోస్టులే. అంటే ఒక్కో పోస్టుకు దాదాపుగా 416 మంది పోటీ పడుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇప్పుడు ఎంతటి డిమాండ్ ఉందో.
అయితే వెస్ట్ బెంగాల్లో గ్రూప్ డి పోస్టులకు అంత భారీ ఎత్తున దరఖాస్తులు రావడానికి కారణమేంటో తెలుసా..? ఆయా పరీక్షలకు ఎలాంటి ఫీజు లేదట. అందుకే అంత పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవాలు మాత్రం వేరే విధంగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రైవేటు రంగంలో చర్యలు తీసుకోలేదని, అందుకే నిరుద్యోగం అంతగా పెరిగి, గ్రూప్ డి పోస్టు కోసం అంత పెద్ద ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. అయితే ఆ 25 లక్షల మందిలో 1.50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 24,969 పోస్టు గ్రాడ్యుయేట్లు, 250కి పైగా పీహెచ్డీ చేసిన వారు దరఖాస్తు పెట్టుకున్నారట. కానీ ఆ జాబ్లకు కావల్సింది స్కూల్ సర్టిఫికెట్ మాత్రమే. దానికి వచ్చేది రూ.16,200 జీతం. అందు కోసమే పీహెచ్డీ చేసిన వారు కూడా దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. ఏది ఏమైనా దేశంలో నిరుద్యోగం పెరుగుతుందనడానికి, ప్రభుత్వాలు ఆ దిశగా వారికి అవకాశాలు కల్పించలేకపోతున్నాయనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే..!