బ‌ల‌వంతంగా వేశ్యాగృహానికి అమ్మ‌బ‌డిన ఓ మ‌హిళ ఎలా త‌ప్పించుకుని వ‌చ్చిందో తెలిపే రియ‌ల్ స్టోరీ ఇది..!

హ్యూమ‌న్ ట్రాఫికింగ్‌… సెక్స్ ట్రాఫికింగ్‌… ఏ పేరుతో పిలిచినా ఆ కూపంలోకి చిక్కుకున్న మ‌హిళలు, యువతులు, బాలిక‌లు ఎవ‌రైనా బ‌ల‌వంతంగా వేశ్య‌లుగా మార్చ‌బ‌డుతారు. దీంతో వారి జీవితం న‌ర‌క ప్రాయం అవుతుంది. అలాంటి కూపం నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలో తెలియ‌దు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ న‌ర‌కంలో చిక్కుకున్న ఓ మ‌హిళ గురించే. కాక‌పోతే ఆమె అందులో ఉండిపోలేదు. ధైర్యం చేసి అక్క‌డి నుంచి త‌ప్పించుకుంది. ఆ క్ర‌మంలో పోలీసుల‌ను క‌ల‌వ‌గా వారు ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. దీంతో ఆమెను ఆ బందిఖానాలోకి దింపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో ప్ర‌స్తుతం పోలీసులు ఉన్నారు.

కోల్‌క‌తాకు చెందిన ఓ మ‌హిళ ఆమె. వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాలు. ఆమె పెళ్లైన ఆరు నెల‌ల‌కు భ‌ర్త ఆమెను విడిచి పెట్టాడు. అప్ప‌టికే ఆమె గ‌ర్భ‌వ‌తిగా ఉంది. దీంతో ఆమె కొన్ని నెల‌ల‌కు కూతురికి జ‌న్మ‌నిచ్చింది. అప్పుడు ఆమె త‌న పుట్టింట్లోనే ఉంది. అయితే తండ్రి ఆరోగ్యం విష‌మించ‌డంతో అత‌న్ని ఆమె ఓ ఆస్ప‌త్రిలో చేర్పించింది. వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తుండ‌గా ఆమెకు ఓ వ్య‌క్తి తార‌స ప‌డ్డాడు. ఆమె ప‌డుతున్న క‌ష్టాల‌ను గురించి అడిగి తెలుసుకున్నాడు. దీంతో అత‌నికి దుర్భుద్ధి పుట్టింది. ఈ క్ర‌మంలోనే ఆమెను ట్రాప్ లో ప‌డేశాడు. త‌న‌తో ఢిల్లీకి వ‌స్తే ఉద్యోగం ఇప్పిస్తాన‌ని, డ‌బ్బు బాగా సంపాదించుకోవ‌చ్చ‌ని అత‌ను నమ్మ బ‌లికాడు. ఆ మాట‌ల‌ను న‌మ్మిన ఆ మ‌హిళ ఈ ఏడాది జ‌న‌వ‌రి మొద‌టి వారంలో త‌న కూతుర్ని వెంట తీసుకుని ఢిల్లీ వెళ్లింది. అయితే అప్పుడామెకు తెలియ‌లేదు, తాను ఓ విష వ‌ల‌యంలో చిక్కుకుంటున్నాన‌ని. అక్క‌డికి వెళ్తే మ‌ళ్లీ తిరిగి రావ‌డం క‌ష్ట‌మ‌ని అప్ప‌టికి ఆమెకు తెలీదు.

కాగా ఆ మ‌హిళను ఆ వ్య‌క్తి ఢిల్లీలో ఉండే ఓ వేశ్యాగృహానికి అమ్మేశాడు. రూ.70వేల‌కు ఆ గృహానికి ఆమెను విక్ర‌యించాడు. దీంతో జ‌రిగిన మోసాన్ని ఆ మ‌హిళ గుర్తించింది. అయితే అక్క‌డి నుంచి త‌ప్పించుకోవ‌డం అంత సుల‌భం కాలేదు ఆమెకు. 15 రోజుల పాటు ఆ గృహంలో న‌ర‌కం అనుభ‌వించింది ఆమె. ఆ త‌రువాత ఓ రోజు రాత్రి పూట బాత్ రూంక‌ని చెప్పి ఆమె బ‌య‌టికి వ‌చ్చి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంది. అయితే ఆమె కూతురు మాత్రం ఆ వేశ్యాగృహాన్ని న‌డిపే ఓ మ‌హిళ వ‌ద్దే ఉండిపోయింది. ఈ క్ర‌మంలో ఆ గృహం నుంచి బ‌య‌టికి వ‌చ్చిన ఆ మ‌హిళ వెంట‌నే ఢిల్లీ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుని దొరికిన రైలు ఎక్కింది. అలా వెస్ట్ బెంగాల్‌లోని కానింగ్ అనే ప్రాంతానికి వ‌చ్చి అక్క‌డి పోలీసుల‌కు జ‌రిగింది చెప్పి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి ఆ మ‌హిళ కూతుర్ని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఆమెను ఆ కూపంలో బంధించి ఉంచిన అంజు బేగం, అకా సిమ్రాన్ అనే ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఆ గ్యాంగ్ ఎంత మంది ఉన్నారో వెతికే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. ఏది ఏమైనా… ఆ మ‌హిళ అలా ధైర్యం చేసి వ‌చ్చింది కాబ‌ట్టే అలాంటి దుండగుల ఆటలు క‌ట్టాయి. ఇంకా ఎంత మంది అలా బందిఖానాల్లో ఉన్నారో..! వారికి ఎప్పుడు విముక్తి ల‌భిస్తుందో ఆ భ‌గ‌వంతునికే తెలియాలి.

Comments

comments

Share this post

scroll to top