తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవ‌డం లేదా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..!

నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందులు పెడుతున్న స‌మ‌స్య అజీర్ణం. తింటున్న‌ది చాలా త‌క్కువే అయినా స‌రిగ్గా జీర్ణం అవ‌డం లేద‌ని చాలా మంది అంటూ ఉంటారు. అయితే అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తినే తిండి టైముకు తిన‌క‌పోవ‌డం, వ్యాయామం చేయకపోవడం, సమయ పాలన లేని నిద్ర, ఒత్తిడి, ఆందోళన… ఇలా చెప్పుకుంటూ పోతే అజీర్ణానికి కారణాలు ఎన్నో ఉంటున్నాయి. అయితే ఇలా వ‌చ్చే అజీర్ణాన్ని త‌గ్గించుకోవ‌డం కోసం చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతున్నారు. కానీ అలా కాకుండా ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధమైన ప‌దార్థాల‌తోనే అజీర్ణ స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!

1. ఒకటిన్నర కప్పు నీటిని ఒక పాత్రలో తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. మరుగుతున్న నీటిలో 1 టీస్పూన్ అల్లం తురుం వేసి మళ్లీ నీటిని మరగబెట్టాలి. ఆ తరువాత వచ్చే ద్రవాన్ని వడ కట్టి తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

2. ఒక కప్పు వేడి నీటిలో 1 టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల అల్లం రసం వేసి బాగా కలిపి తాగితే అజీర్తి తగ్గుతుంది.

3. భోజనం చేసిన వెంటనే చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమిలినా లేదంటే చప్పరించినా అజీర్తి సమస్య పోతుంది.

4. పెరుగు లేదా మజ్జిగను ఆహారంలో భాగం చేసుకుంటే అజీర్తి సమస్య ఉండదు.

5. పుదీనా ఆకులు కొన్నింటిని తీసుకుని నీడలో ఎండబెట్టి వాటిని పొడి చేయాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక కప్పు వేడి నీటిలో కలిపి ఆ తరువాత వచ్చే ద్రవాన్ని తాగాలి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.

6. భోజనం చేసిన ప్రతి సారి 1 టీస్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. దీంతో ఆహారం జీర్ణమవుతుంది.

7. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ సోంపు గింజలను వేసి బాగా మరిగించి ఆ తరువాత వచ్చే ద్రవాన్ని తాగినా అజీర్తి సమస్య పోతుంది.

8. ఇంగువను ఆహార పదార్థాల్లో భాగం చేసుకున్నా అజీర్తి సమస్య నుంచి బయట పడవచ్చు. లేదంటే ఒక గ్లాస్ వేడి నీటిలో చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి తాగితే ఆహారం జీర్ణమవుతుంది. పసికందులకు ఈ మిశ్రమాన్ని తాగించకూడదు. కానీ దీన్ని వారి బొడ్డుపై రాసి మసాజ్ చేస్తే చాలు, వారికి ఉన్న అజీర్తి సమస్య పోతుంది.

9. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని తాగితే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

10. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం, అల్లం రసంలను సమపాళ్లలో కలిపి తాగితే అజీర్తి సమస్య ఉండదు.

11. ఒక గ్లాస్ మజ్జిగలో ధనియాల పొడిని ఒక టీస్పూన్ కలిపి తాగినా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

12. చిటికెడు నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్), ఒక టీస్పూన్ వాము కలిపి తినాలి. ఇలా చేస్తే అజీర్తి సమస్య బాధించదు.

13. వేయించిన జీలకర్ర పొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని తాగాలి. ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది.

14. గ్రీన్ టీ నిత్యం తాగుతుంటే అజీర్తి సమస్య ఉండదు.

15. అరగ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ఆ నీటిని తాగాలి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు పోతాయి.

16. పియర్స్, యాపిల్స్, రాస్ప్‌బెర్రీలు, బొప్పాయి, అరటిపండ్లు, పైనాపిల్, అంజీర పండ్లు, అవకాడోలు వంటి వాటిని తింటుంటే జీర్ణ సమస్యలు రావు.

Comments

comments

Share this post

scroll to top