ఆవును చంపితే 5 నుంచి 14 ఏళ్ల జైలు శిక్ష‌… మనిషిని చంపితే 2 సంవ‌త్స‌రాల శిక్ష‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన జ‌డ్జి

ల‌గ్జ‌రీ కారు. కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంద‌ది. అలాంటి కారులో వెళ్తున్నాడు ఓ బ‌డాబాబు త‌న‌యుడు. అస‌లే కుర్ర‌తనం. దీనికి తోడు చేతిలో టాప్ మోడ‌ల్ కారు ఉంది. ఇంకేముందీ… ఆగ‌లేదు. ర‌య్‌మ‌ని రోడ్డుపై దూసుకెళ్లాడు. అలా దూసుకెళ్లే క్ర‌మంలో ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో దానిపై ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులు తీవ్ర గాయాల‌కు గురై అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ క్ర‌మంలో ఈ కేసుపై కోర్టులో విచార‌ణ జ‌రిగింది కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, నిందితుడైన ఆ యువ‌కుడికి ఎన్నేళ్ల జైలు శిక్ష ప‌డి ఉంటుందో..! 10 ఏళ్లు.. ఉహు.. 5 ఏళ్లు.. ఉహు..! మ‌రి ఎన్నేళ్లో మీరే చెప్పండి.. అని అడ‌గ‌బోతున్నారా..? అయితే వినండి. ఆ యువ‌కుడికి ప‌డింది కేవ‌లం 2 ఏళ్ల జైలు శిక్ష మాత్ర‌మే.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఢిల్లీ సెష‌న్స్ కోర్టు న్యాయ‌మూర్తి ఇటీవ‌లే ఆ యువ‌కుడికి శిక్ష విధించారు. 2008 సెప్టెంబర్‌ 11వ తేదీన ఢిల్లీలో బీబీఏ చదువుతున్న భసిన్ అనే యువ‌కుడు తన బీఎండబ్ల్యూ కారుతో దక్షిణ ఢిల్లీలోని మూల్‌చంద్‌ ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌పై తన స్నేహితుడు మృగాంక్‌ శ్రీవాస్తవతో కలిసి వెళ్తున్న అనుజ్‌ చౌహన్ వాహ‌నాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఈ ఘటనలో తీవ్ర గాయాల‌పాలైన మృగాంక్‌, అనుజ్‌లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా ప్రమాద అనంతరం చండీఘర్‌కు పారిపోతున్న భసిన్‌ను పోలీసులు వెంబడించి అరెస్టు చేశారు. ఈ కేసును పలుమార్లు విచారించిన సెషన్స్‌ కోర్టు తాజాగా ఈ కేసులో తీర్పు వెల్ల‌డించింది. స‌ద‌రు యువ‌కుడు భసిన్‌కు రెండేళ్ల పాటు శిక్షను విధిస్తున్నట్లు జడ్జి సంజీవ్‌ కుమార్ చెప్పారు. ఇలా చెబుతూ ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

మ‌న దేశంలో ఆవును చంపిన వ్యక్తికి 5 నుంచి 14 సంవత్సరాల వరకూ శిక్ష పడుతోందని, అదే మనిషిని చంపిన వ్యక్తికైతే కేవలం 2 సంవత్సరాల శిక్షే పడుతోందని జ‌డ్జి సంజీవ్‌ అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్ధ అలా ఉందని తామేమైనా చేయడానికి సాయం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కాగా జడ్జిమెంట్‌ కాపీని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపుతున్నట్లు చెప్పారు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 304-ఏలో మార్పులు చేయడానికి ఈ జడ్జిమెంట్‌ కాపీ ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు. ఇక మ‌రి ఇందుకు అనుగుణంగా ప్ర‌భుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top