శానిటరీ నాప్‌కిన్స్‌పై 12 శాతం జీఎస్‌టీ అట.. హవ్వ… నవ్విపోతారు ఎవరైనా వింటే..!

మనకు దేని గురించైనా అందుబాటులో అనేక ఆప్షన్లు ఉన్నప్పుడు ఒక్కోసారి ఇంకీ పింకీ పాంకీ వేసి వాటిలో దేన్నో ఒక ఆప్షన్‌ను ఎంచుకుంటాం కదా. అవును, అదే. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన జీఎస్‌టీ బిల్లును కూడా నిజంగా ఇంకీ పింకీ పాంకీ వేసినట్టుంది. అవును, నమ్మలేరా..! అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది చదవండి. మీకే తెలుస్తుంది, ఆ తరువాత మీరే అంటారు, నిజంగా మేం పైన చెప్పింది కరెక్టే అని. అయితే.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

ఈ నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ జీఎస్‌టీ బిల్లును అమలులోకి తెచ్చింది కదా. దాని వల్ల కొన్ని వస్తువులు, సేవల ధరలు పెరగ్గా, కొన్నింటివి తగ్గాయి. అందుకుగాను ఆయా వస్తువులు, సేవలను జీఎస్‌టీ బిల్లులో ఉండే పలు శ్లాబుల్లో చేర్చారు. అయితే ఆ శ్లాబుల్లో 12 శాతం శ్లాబులో మహిళలు వాడే శానిటరీ నాప్‌కిన్స్‌ను చేర్చారు. ఇక వారు వాడే బొట్టు బిళ్లలు, గాజులు వంటి వాటిని మాత్రం 0 శాతం శ్లాబులో చేర్చారు. అంటే… శానిటరీ నాప్‌కిన్స్‌కు 12 శాతం ట్యాక్స్ కట్టాలి, అదే గాజులు, కుంకుమ, బొట్టు బిళ్లలకు ట్యాక్స్ లేదు. దీంతో కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని చాలా మంది మహిళలు తప్పు పడుతున్నారు.

ముఖ్యంగా బెంగుళూరులో ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో క్యాంపెయిన్ రన్ అవుతోంది. నిజానికి బొట్టుబిళ్లలు, గాజుల కన్నా మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ అవసరమే ఎక్కువని, అసలు వాటికి ట్యాక్స్ ఎలా వేస్తారని, సున్నా శాతం శ్లాబులో వాటిని చేర్చడమే కాక, ప్రభుత్వమే సబ్సిడీ కింద పేద మహిళలకు వాటిని అందజేయాల్సింది పోయి 12 శాతం ట్యాక్స్ శ్లాబులో వాటిని ఎలా చేరుస్తారని మహిళలు మండి పడుతున్నారు. ఇది కచ్చితంగా జాతి వివక్ష కిందకే వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శానిటరీ నాప్‌కిన్స్‌పై ట్యాక్స్ వేయడం అంటే మహిళలకు నెల నెలా అయ్యే రుతుక్రమంపై ట్యాక్స్ వేయడమే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ అనాలోచిత చర్యను వెంటనే ఉపసంహరించుకుని శానిటరీ నాప్‌కిన్స్‌ను మహిళలకు సబ్సిడీ కింద అందజేయాలని వారు అంటున్నారు.

అవును మరి, నిజానికి చాలా మందికి రుతు సమయంలో శుభ్రత గురించి తెలియదు, అవగాహన లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, పేద మహిళలకు, ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వ‌ర‌కు తెలియదు. తెలిసినా ఎక్కువ డబ్బు వెచ్చించి శానిటరీ నాప్‌కిన్స్‌ను కొని వాడే స్థోమత అసలే ఉండదు. ఈ క్రమంలో శానిటరీ నాప్‌కిన్స్‌పై 12 శాతం ట్యాక్స్ వేయడం అంటే… ఇక అవి ఏ కోశానా వారికి అందే పరిస్థితే లేదు. మరి.. ఇలా వాటికి 12 శాతం ట్యాక్స్‌ను తెలిసి వేశారా..? అంటే.. లేదు.. తెలియకే చేసి ఉంటారు. అదీ.. పైనే చెప్పాం కదా.. ఇంకీ పింకీ పాంకీ వేసి ఉంటారు. అందుకే శానిటరీ నాప్‌కిన్స్ వెళ్లి 12 శాతం శ్లాబులో పడి ఉంటాయి. ఇక ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు కదా..! జీఎస్‌టీ బిల్లు రెడీ అయింది. అమలైపోయింది..! ఇక ఇప్పుడు మీరే చెప్పండి.. ఇంకీ పింకీ పాంకీ.. జీఎస్‌టీ బిల్లు.. అవునో కాదో..!

Comments

comments

Share this post

scroll to top