ఆ బాలిక వయస్సు 11 ఏళ్లు… ఈ ఏజ్‌లోనే ఆమె కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి యజమానురాలైంది…

అద్భుత ఫలితాలనిచ్చే ఆలోచన ఉంటే చాలదు… దాన్ని సరైన రీతిలో అమలులో పెట్టే నైపుణ్యం కూడా ఉన్నప్పుడే ఎవరైనా తమ ఆలోచనల ద్వారా లాభం పొందగలుగుతారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించింది ఆ బాలిక. తన మదిలో మెదిలిన ఆలోచనను సరైన చోట, సరైన వ్యక్తుల మధ్య ఆవిష్కృతం చేసి వారి ద్వారా మెప్పు పొందడమే కాదు, తన ఐడియాకు పెట్టుబడిని కూడా రాబట్టగలిగింది. ఫలితంగా కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన ఓ కంపెనీకి యజమానురాలిగా మారింది. ఆలోచన ఉండాలే గానీ దానికి వయస్సుతో పని లేదని, ఎవరైనా ఏదైనా సాధించవచ్చని ఆ బాలిక నిరూపించింది. ఆమే మికైలా ఉల్మర్.

mikaila-ulmer

11 ఏళ్ల వయస్సున్న మికైలా ఉల్మర్‌కు అందరు పిల్లల్లాగే టీవీ చూడడమంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో రోజూ తాను ఇంటికి రాగానే టీవీలో వచ్చే ఓ కార్యక్రమాన్ని తరచూ చూసేది. అదేమిటంటే ఏబీసీ అనే ఛానల్‌లో వచ్చే ‘షార్క్ ట్యాంక్’ అనే కార్యక్రమం. కొత్త కొత్త ఐడియాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తులతోపాటు పలువురు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి వస్తారు. ఇందులో ఔత్సాహికులు తమ తమ ఆలోచనల గురించి పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తలు వారిని పలు ప్రశ్నలు అడిగి తమకు నచ్చిన ఆలోచనలు చెప్పిన ఔత్సాహికులకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. అలా అద్భుతమైన ఆలోచనలు చెప్పే వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ షార్క్ ట్యాంక్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రోజూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ వస్తున్న మికైలాకు మదిలో ఓ ఆలోచన తళుక్కున మెరిసింది. తాను కూడా అలా ఏదైనా ఒక ఆలోచనతో ఆ కార్యక్రమంలో పాల్గొని సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంది.

mikaila-ulmer with lemonade

అనుకున్నదే తడవుగా మికైలా షార్క్ ట్యాంక్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది. అయితే అక్కడ ఆమె వ్యాప్తార వేత్తలకు చెప్పిన తన ఆలోచన ఏమిటో తెలుసా? వింటే మీరు ఆశ్చర్యపోతారు. నిమ్మరసం తయారు చేసి విక్రయిస్తానని చెప్పడం. అయితే అది మామూలుగా మనం ఉప్పు, చక్కెర వేసి తయారుచేసే నిమ్మరసం మాత్రం కాదు. మికైలా అమ్మమ్మ తయారు చేసే నిమ్మరసం. అయితే అందులో స్పెషాలిటీ ఏముంది అంటారా? అక్కడికే వస్తున్నాం. చక్కెరకు బదులుగా తేనె, దాంతోపాటు అవిసె గింజలను వేసి మికైలా అమ్మమ్మ నిమ్మరసం తయారు చేస్తుంది. ఆ నిమ్మరసం అంటే తనకెంతో ఇష్టమని తెలుసుకున్న మికైలా అదే నిమ్మరసం తయారుచేసే వ్యాపారం ప్రారంభిస్తానని ఆ కార్యక్రమంలో అందరి ముందు చెప్పింది. అయితే ఆ వ్యాపార వేత్తలు మికైలాకు పెట్టుబడి పెట్టేందుకు అంత త్వరగా ముందుకు రాలేదు.

mikaila-ulmer-with-satya-nadella

మికైలా తన ఆలోచనను చెప్పగానే కార్యక్రమంలో ఉన్న వ్యాపారవేత్తలు ఆమెను సవాలక్ష ప్రశ్నలు వేశారు. తికమక పెట్టారు. అయినప్పటికీ మికైలా ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. దీంతో వారు ఆమె సమాధానాలకు ఆశ్చర్యపోయి వెంటనే రూ.40 లక్షలను పెట్టుబడిగా ఆమెకు అందించారు. అది మొదలు మికైలా ఇక వెనక్కి తిరిగి చూడలేదు. వెంటనే వ్యాపారం ప్రారంభించింది. అనతి కాలంలోనే కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి యజమానురాలైంది. రోజూ స్కూల్‌కు వెళ్లి చదువుకోవడం, అనంతరం వ్యాపార పనులు చూసుకోవడం మికైలా దినచర్యగా మారింది.

పిట్ట కొంచెం, కూత ఘనం అన్నట్టుగా అత్యంత చిన్న వయస్సులోనే తన ఆలోచనతో ఓ పెద్ద కంపెనీకి యజమానురాలైనందుకు నిజంగా మనం మికైలాను అభినందించాల్సిందే! ఇంతకీ ఆమె కంపెనీ పేరు చెప్పలేదు కదూ! అదే ‘బీ స్వీట్ లెమనేడ్’. అవును, అత్యంత తక్కువ కాలంలో ఇది బాగా విస్తరించింది. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లలు సైతం మికైలా కంపెనీకి చెందిన నిమ్మరసం రుచి చూసి ఆమెను మెచ్చుకున్నారంటే, మికైలా అక్కడ ఏ విధంగా పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!

ఇక మికైలా సంగతి పక్కన పెడితే ఏబీసీ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఆ షార్క్ ట్యాంక్ కార్యక్రమం ఇప్పటికి 7 సీజన్లు పూర్తి చేసుకుని, 8వ సీజన్ ప్రారంభం దిశగా అడుగులు వేస్తోంది. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు మన దగ్గర కూడా జరిగితే ఎంతో మంది నైపుణ్యం ఉన్న వారికి ఉపాధి లభిస్తుంది కదా!

Comments

comments

Share this post

scroll to top