శ‌రీర మెట‌బాలిజం పెరిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు 10 ప‌వ‌ర్‌ఫుల్ టిప్స్ ఇవిగో..!

కొందరు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. మరికొందరు కొద్దిగా తిన్నా బరువు పెరిగిపోతుంటారు. ఈ తేడా ఎందుకు ఉంటుంది? అందరి శరీర క్రియలు ఒకే విధంగా ఎందుకు జరగవు? అయితే అందుకు మెటబాలిజమే కారణం. మెటబాలిజం అంటే శరీరంలో జరిగే జీవ రసాయనిక చ‌ర్య‌లే. ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక వ్యక్తి శరీరంలో ఒక రోజుకి క్యాలరీలు ఖర్చయ్యే వేగం అన్నమాట. మెటబాలిజం వేగంగా జరిగే వ్యక్తులు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కానీ ఈ ప్రక్రియ నెమ్మదిస్తే మాత్రం అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది. బరువు పెరగడం వీటిలో ప్రధానమైంది. అయితే కింద పేర్కొన్న పలు సూచనలను పాటిస్తే శరీర మెటబాలిజాన్ని పెంచుకుని తద్వారా చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. దీంతో బ‌రువు కూడా త‌గ్గుతారు.

1. రోజుకి కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. ఇది జీవక్రియల వేగాన్ని పెంచి శరీరం నుంచి విష పదార్థాలు, అధిక కొవ్వును తొలగించడానికి తోడ్పడుతుంది. భోజనానికి ముందు చల్లని నీరు తాగితే జీర్ణాశయం కుచించుకుపోయి కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే కఫం సమస్య ఉన్నవారు చల్లని నీటిని తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

2. ఒకేసారి ఎక్కువ భోజనం తినే కంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినడం ఉత్తమం. రోజుకి కనీసం 4 నుంచి 6 సార్లు భోజనం చేస్తే మంచిది. ముఖ్యంగా భోజనం అస్సలు మానేయకూడదు. వేళకు ఎంతో కొంత ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తినకపోతే జీవక్రియల వేగం తగ్గుతుంది. ప్రధానంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మానేయకూడదు.

3. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. రోజుకి కనీసం 2 నుంచి 3 కిలోమీటర్లు వాకింగ్ చేసినా సరిపోతుంది. ప్రధానంగా సాయంత్రం పూట చేసే వాకింగ్‌తో మెటబాలిజం ఎంతగానో మెరుగుపడుతుంది. రాత్రయ్యే కొద్దీ తగ్గే జీవక్రియల వేగం వాకింగ్ కారణంగా పెరుగుతుంది.

4. నిత్యం 25 గ్రాముల చొప్పున 3 సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. రోజుకి 70 గ్రాములకి మించకుండా ప్రోటీన్లను తీసుకోవాలి. ఇవి రక్తంలోని ఇన్సులిన్ స్రావాన్ని నియంత్రించి జీవక్రియలకు ఉత్తేజాన్నిస్తాయి.

5. రోజుకి 6 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతకు ఎక్కువైనా, తక్కువైనా మంచిది కాదు. జీవక్రియలు సరిగ్గా పనిచేయాలంటే తగినంత మోతాదులో నిద్ర అవసరమే.

6. ఉపవాసాలు అస్సలు చేయకూడదు. శరీరానికి వేళకు ఆహారం అందకపోతే మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీంతోపాటు శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు అవకాశం ఉంటుంది.

7. నిత్యం 150 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ మోతాదులో 2 నుంచి 3 కప్పుల వరకు గ్రీన్ టీ తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తాగరాదు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేసిన తరువాత కొంత సమయానికి గ్రీన్ టీ సేవిస్తే మెటబాలిజం ప్రక్రియ అద్భుతంగా వేగం పుంజుకుంటుంది.

8. కోడిగుడ్డులో ఉండే తెల్ల‌సొన తింటున్నా శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని వ‌ల్ల ఎలాంటి కొవ్వు ద‌రిచేర‌దు. పైగా అందులో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు, ఇత‌ర పౌష్టికాహారం శ‌రీరానికి అందుతుంది.

9. నిమ్మ‌కాయ కూడా శ‌రీర మెట‌బాలిజంను పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాదు, ఇది శ‌రీరంలో పేరుకుపోయిన విష ప‌దార్థాల‌ను తొల‌గిస్తుంది.

10. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో వాటిలో ఉండే ఫైబ‌ర్ ఇత‌ర పోష‌కాలు శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచేందుకు దోహ‌ద‌ప‌డుతాయి. అల్లం, బాదంప‌ప్పు, బ్ర‌కోలి, పాల‌కూర‌, వెల్లుల్లి, యాపిల్ త‌దితర ఆహార ప‌దార్థాల‌ను త‌ర‌చూ తింటుంటే త‌ద్వారా శ‌రీర మెటబాలిజం పెరిగి చ‌క్క‌ని ఆరోగ్యం పొందుతారు. దీంతో అధికంగా ఉన్న బ‌రువు కూడా త‌గ్గుతారు.

Comments

comments

Share this post

scroll to top